న్యాయమైన పరిహారం లేకుండా భూములివ్వబోమంటున్న రైతులు
పోతారెడ్డిపల్లి రిజర్వాయరులో 750 ఎకరాలు ముంపు
పనులకు భూసేకరణ సమస్య
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ద్వారా నల్లగొండకు సాగు నీటిని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టింది. వరదల సమయంలో నీటిని ఎత్తిపోసుకునే డిండి ప్రాజెక్టు వల్ల జిల్లా రైతాంగానికి ఏమాత్రం నష్టం లేదన్నది అధికారులు, పాలకపార్టీల నేతల అభిప్రాయం. అయితే న్యాయమైన పరిహారం ఇచ్చాకే రిజర్వాయర్ పనులు చేపట్టాలని ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితులు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పోతారెడ్డిపల్లి, ఉల్ఫర, దాసర్లపల్లి రైతాంగం సుమారు 750 ఎకరాల సాగు భూమి నష్టపోతుంది. దాంతో పనులకు భూసేకరణ సమస్య ఏర్పడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి పాలమూరు-రంగారెడ్డి నీరు ఏదులకు చేరుకుంటుంది.
ఏదుల నుంచి వంగూరు మండలం పోతారెడ్డిపల్లి గ్రామ పరిధిలో ఉన్న దుందుభీ నదిలోనే ‘డిండి లిఫ్ట్’ రిజర్వాయర్ నిర్మిస్తారు. దీని కోసం రూ.1788.89 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఏదుల రిజర్వాయర్ నుంచి పోతారెడ్డిపల్లి చెక్‌డ్యాం వరకు 27 కిలోమీటర్లు ఉంటుంది. దీనికోసం 800 మీటర్ల అప్రోచ్ కెనాల్ తవ్వాల్సి ఉంది. ఆ తర్వాత 2.525 కి.మీ. ఓపెన్ కెనాల్, 16 కి.మీ. సొరంగం, 3.05 కి.మీ. ఓపెన్ కెనాల్, 6.325 కి.మీ. వాగు నిర్మాణం.. మొత్తం 27.9 కి.మీ. కాల్వలు, సొరంగం పనులు చేయాల్సి ఉంది. శ్రీశైలం వెనుక జలాల నుంచి ప్రతిరోజూ 0.50 టీఎంసీల చొప్పున 60 రోజులపాటు 30 టీఎంసీలను డిండి ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లను నింపాలని నిర్ణయించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట పరిధిలోని 3.61 లక్షల ఎకరాలకు సాగు నీరందించడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.
రూ.6,190 కోట్ల అంచనా..
ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ.6,190 కోట్లు ఖర్చు కానున్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 2015 జూన్ 11న దీనికి పరిపాలన అనుమతులు వచ్చాయి. ఇప్పటి వరకు రూ.3,441.89 కోట్లు ఖర్చు అయ్యాయి. ఏడు ప్యాకేజీల ద్వారా పనులు నిర్వహిస్తున్నారు. గ్రావిటి కెనాల్, స్ట్రక్చర్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా రిజర్వాయర్ పనులు జరగాల్సి ఉంది. అయితే, భూసేకరణ సమస్యతో పనులు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఏదుల నుంచి గ్రావిటీ ద్వారా వంగూరు మండలం పోతారెడ్డిపల్లి, జాజాల సమీపాన ఉండే దుందుభీ నదికి రావాల్సి ఉంది. అక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో 750 ఎకరాల సాగుభూమి నీట మునుగుతుంది. సరైన భూపరిహారం ఇవ్వకుండా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మొత్తం 16030 ఎకరాలకుగాను ఇప్పటి వరకు 12052 ఎకరాలు సేకరించారు. 3978 ఎకరాలు సేకరించాల్సి ఉంది. సింగరాజుపల్లి 85శాతం, గొట్టిముక్కల 98 శాతం, కిష్టరాంపల్లి 70శాతం, శివన్నగుడెం రిజర్వాయర్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. చింతపల్లిలో పనులు మొదలు కాలేదు. ఎర్రవల్లిలో 26 శాతం పనులు జరిగాయి. ఇర్విన్ పనులు మొదలు కాలేదు.
వీడని చిక్కులు..
డిండి ప్రాజెక్టుకు న్యాయపరమైన చిక్కులు పరిష్కారం కావడం లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా చేపడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పనులు నిలిపేయాలని ఆదేశించింది. నిబంధనలను ఉల్లంగించినుందుకు రూ.90కోట్లు జరిమానా విధించింది. దాంతో పనులు మొదలు పెట్టడానికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయిం చింది. అయినా ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలూ రాలేదు. ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కులకు తోడు పాలమూరును ఎండబెట్టడానికే డిండి లిప్టు అంటూ బీఆర్‌ఎస్ ఆరోపిస్తుండగా.. ఇతర ప్రజా సంఘాలు పనుల పూర్తికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. డిండి ద్వారా నల్లగొండకు నీళ్లు ఇస్తే.. పాలమూరు భూములు బీళ్లుగా మారుతాయని మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను విరుద్ధంగా నిర్మిస్తున్న డిండి ప్రాజెక్టును అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే, సీపీఐ(ఎం)తోపాటు ఇతర రాజకీయ పార్టీలు మాత్రం పాలమూరుకు నష్టం జరగకుండా నీటిని తరలిస్తే.. డిండిని అడ్డుకోబోమం టున్నాయి.
నష్టం చేయకుండా చూడాలి రైతు సంఘం నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు బాల్‌రెడ్డి
డిండి ఎత్తిపోతల ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లా సాగు భూములకు నష్టం రాకుండా చూడాలి. ప్రభుత్వం రైతులకు ఇచ్చే భూ పరిహారం న్యాయ బద్దంగా ఉండాలి. ముఖ్యంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల అచ్చంపేట, కల్వకుర్తి నియోజ కవర్గాలకు సాగునీటి సమస్య రాకుండా చూడాలి.