Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంఇంజినీరింగ్‌ విద్యార్థులకు జాబ్‌ గ్యారంటీ శిక్షణ

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు జాబ్‌ గ్యారంటీ శిక్షణ

- Advertisement -

– ఐటీ, పరిశ్రమలశాఖమంత్రి శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి సాఫ్ట్‌ వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించే మరో కొత్త కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ‘ప్లేస్‌ మెంట్‌ సక్సెస్‌ ప్రోగ్రాం’ కింద ఐదు నెలల శిక్షణనిచ్చి ఉద్యోగాలకు సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ అయాన్‌ (టీసీఎస్‌ఐఓఎన్‌) ముందుకొచ్చిందని తెలిపారు. గురువారం సచివాలయంలో మంత్రి సమక్షంలో హైదరాబాద్‌ జేఎన్‌టీయూ, టీసీఎస్‌ ఐయాన్‌ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ చేసినా వారిలో నైపుణ్యం లేక పోవడంతో ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం స్కిల్‌ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ‘సాంకేతిక నైపుణ్యాలు లేకుండా డిగ్రీలతో ఉద్యోగాలు రావడం కష్టం. చదువు పూర్తి చేసే సమయానికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశంలో నైపుణ్యం పెంచగలిగితే ఉద్యోగాలు ఇవ్వడం కోసం కంపెనీలు వాటికవే పరుగెత్తుకుంటూ వస్తాయి. టీసీఎస్‌ ఐయాన్‌ సంస్థ మొదటి దశలో ప్రతి ఐదు నెలల(20 వారాల)కు వంద మంది ఇంజినీరింగ్‌ విద్యార్ధులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తుంది. ఆ సంస్థతో సంబంధం కలిగిన మూడు వేలకు పైగా కంపెనీలు వీరిలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకుని ఉద్యోగాలు కల్పిస్తాయి. పైలట్‌ కార్యక్రమం కింద మంథనిలోని జేఎన్‌టీయూ కళాశాల విద్యార్థులకు ప్లేస్‌ మెంట్‌ సక్సెస్‌ ప్రోగ్రాం కింద నైపుణ్య శిక్షణకు ఎంపిక చేస్తాం” అని శ్రీధర్‌ బాబు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత యువ తను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ సంసిద్ధత కార్య క్రమాలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. అవగాహన ఒప్పంద కార్యక్రమంలో టీసీఎస్‌ ఐయాన్‌ గ్లోబల్‌ హెడ్‌ వెంగుస్వామి, స్కిల్‌ ఎడ్యుకేషన్‌ బిజినెస్‌ హెడ్‌ స్మృతి ముల్యే, జేఎన్‌టీయూ వైస్‌ ఛాన్సలర్‌ టి కిషన్‌ కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -