Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమధ్యాహ్న భోజన పథకంలో మెనూ ఏంటి ?

మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ఏంటి ?

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పెట్టే ఆహార మెనూ తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మెనూ ప్రకారం పెట్టే ఆహారం ఏమిటి, నూట్రిషన్‌
ఆహారం ఉందా, ఒక్కో విద్యార్థికి ఎంత డబ్బు కేటాయింపు, దీనిని పెంపుదల చేశారా వంటి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంది. చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. అఖిల్‌ శ్రీగురుతేజ వేసిన పిల్‌పై విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఒక స్కూల్‌లో వందకుపైగా స్టూడెంట్స్‌ అస్వస్థతకు గురయ్యారనీ, ఇతర చోట్ల కూడా పలువురు విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారని పిటిషనర్‌ వాదన. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్పింది. బాధ్యులను సస్పెండ్‌ చేశామని తెలిపింది. ఒక విద్యార్ధికి నెలకు రూ.1,500 కేటాయింపు ఉందనీ, దీనిని పెంపుదల చేస్తామని చెప్పింది. కోడి గుడ్ల సరఫరా నిమిత్తం రూ.6 కోట్లకు టెండరు వ్యవహారంపై న్యాయ వివాదం కొలిక్కి వచ్చిందనీ, త్వరలోనే కోడి గుడ్లను కూడా అందజేస్తామని తెలిపింది. ప్రభుత్వ కౌంటర్‌ కోసం విచారణ 3 వారాలకు వాయిదా పడింది.

వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక పిటిషన్‌లో వివరాలేవి? : హైకోర్టు
ఎమ్మెల్సీగా పి.వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ దాఖలుకు ఒక రోజు ముందు ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేశారనీ, కేంద్రం రాజీనామాను ఆమోదించకుండానే ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేసి ఎన్నికయ్యారంటూ దాఖలైన పిటిషన్‌లో ఆ వివరాలు లేకపోవడాన్ని హైకోర్టు గుర్తించింది. రాజీనామా చేశారా, స్వచ్ఛంద పదవీ విరమణ చేశారా వంటి వివరాల్లేకుండా పిటిషన్‌ వేయడాన్ని ప్రశ్నించింది. ఐఏఎస్‌ పదవికి రాజీనామా ఆమోదించాలని ప్రభుత్వానికి చేసుకున్న వినతి పత్రం లేకుండా పిటిషన్‌ ఎలా వేస్తారని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అదనపు పిటిషన్‌ వేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ శుక్రవారం ఆదేశించింది. ”ఐఏఎస్‌ పదవికి రాజీనామాను కేంద్రం ఆమోదించకుండానే ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేయడం చెల్లదు. ఎమ్మెల్సీ పదవిపై అనర్హులు. ఈ మేరకు ఈసీకి, మండలి చైర్మెన్‌కు ఆదేశాలి వ్వాలి.. ” అని కరీంనగర్‌కు చెందిన జె.శంకర్‌ ఇతరులు పిటిషన్లు వేశారు. ”ఎమ్మెల్సీ రాజీనామాను సీఎం ఒత్తిడితో సీఎస్‌ ఆమోదించారు. నిజానికి కేంద్రం ఆమోదం చెప్పాలి. నోటీసు ఇచ్చాక గడువు తీసుకున్నాక కేంద్రం ఆమోదించాలి. ఇవేమీ చేయకుండా రాష్ట్రం ఆమోదించడం చెల్లదు..” అని పిటిషనర్‌ లాయర్‌ చెప్పారు. రాజీనామా ఆమోదించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందనీ, దీని మేరకే ఎమ్మెల్సీ నామినేషన్‌ అనుమతిచ్చినట్టు ఈసీ కౌన్సెల్‌ చెప్పారు. పిటిషనర్‌ వివరాల కోసం విచారణ వాయిదా పడింది.

భాగ్యలక్ష్మి గుడి వద్ద బతుకమ్మకు అనుమతి : హైకోర్టు
హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఈ నెల 23న సాయత్రం 4 నుంచి 5.30 గంటల వరకు బతుకమ్మ నిర్వహించుకునేందుకు అనుమతివ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వేడుకల్లో మహిళలు మాత్రమే పాల్గొనాలనీ, నేర చరిత్ర ఉన్న వాళ్లు పాల్గొనరా దనీ, వీఐపీలను ఆహ్వానించరాదనీ, అన్య మతాలను కించపరిచేలా ప్రసంగాలు, పాటలు పాడకూడదనీ, రాజకీయ ప్రసంగాలు కూడా చేయరాదని నిర్వాహకులను ఆదేశించింది. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బతుకమ్మ నిర్వహణ కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌ కుమార్‌ శుక్రవారం విచారించి ఉత్తర్వులను జారీ చేశారు. గతేడాది అక్టోబర్‌లో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బతుకమ్మ నిర్వహించామనీ, అప్పుడు కూడా హైకోర్టు షరతులతో అనుమతిచ్చిందని పిటిషనర్‌ చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్లీడర్‌ వాదిస్తూ, అనుమతిస్తే శాంతిభద్రతలకు సమస్యలు రావచ్చునని చెప్పారు. గత ఏడాది బతుకమ్మ శాంతియుతంగా జరిగినందున ఈసారి కూడా షరతులతో అనుమతిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -