Saturday, September 20, 2025
E-PAPER
Homeజాతీయంకాళేశ్వరంపై సీబీఐ విచారణ అడ్డుకుంటోంది కేసీఆరే..

కాళేశ్వరంపై సీబీఐ విచారణ అడ్డుకుంటోంది కేసీఆరే..

- Advertisement -

దానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహకరిస్తున్నారు
మెట్రో విస్తరణకూ అవరోధాలు సృష్టిస్తున్నారు
ఎల్‌అండ్‌టీ కూడా సహకరించట్లేదు
ఆధిపత్యం, ఆస్తిపంపకాల్లో తేడా వల్లే కల్వకుంట్ల కుటుంబంలో ముసలం
యూరియాపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం
బీసీ రిజర్వేషన్లపై ‘సుప్రీం’ తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు : ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టాగోష్టి

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ జరగకుండా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారనీ, దానికి కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి సహకరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దానికి ప్రత్యుపకారంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ దూరంగా ఉందని విశ్లేషించారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో విచారణ జరిపిస్తామని ప్రగల్భాలు పలికిన కిషన్‌రెడ్డి ఇప్పుడా కేసును ఎందుకు దాచుకున్నారని ప్రశ్నించారు. కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖరాసినా, అడుగు ఎందుకు ముందుకు పడట్లేదో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే సమాధానం చెప్పాలని అన్నారు. ఇప్పటి వరకు కనీసం సీబీఐ దీనిపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని చెప్పారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కిషన్‌రెడ్డికి సొంతగా ఆలోచించే శక్తి లేదనీ, కేసీఆర్‌ ఏం చెప్తే అదే ఆయన చేస్తారని విమర్శించారు. మెట్రోరైల్‌ విస్తరణను కూడా కేసీఆర్‌ ఇచ్చిన డైరెక్షన్‌ ప్రకారమే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాళేశ్వరంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దానికోసం నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ), ఘోష్‌ కమిషన్‌ రిపోర్ట్‌ సహా ఇతర వివరాలన్నీ ఇస్తామన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉందన్నారు. లేదంటే ఆ కేసును కూడా సీబీఐకి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీహార్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక తాను ప్రచారానికి వెళ్తానని చెప్పారు. ఓట్‌ చోరీ అంశంపై మొదట స్పందించింది తానేనని గుర్తు చేశారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో 24 లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. తన నియోజకవర్గం కొడంగల్‌లోనే 50 వేల ఓట్లను తొలగించారని వివరించారు. జీఎస్టీ మార్పులతో తెలంగాణకు రూ. 8 వేల కోట్లు నష్టం వస్తుందనీ, కనీసం ఐదేండ్లు కేంద్రం ఆ గ్యాప్‌ని భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

తప్పు కేసీఆర్‌ చేస్తే..ప్రజల్ని శిక్షిస్తారా?
త్రిపుల్‌ ఆర్‌ ప్రాజెక్ట్‌, మెట్రో రైల్‌ ఫేజ్‌-2 కు కేంద్రం అనుమతించకపోవడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. 360 కి.మీ త్రిపుల్‌ ఆర్‌కు ప్రధాని మోడీనే హైదరాబాద్‌ వేదికగా మాటిచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత రూట్లను చివరి పాయింట్‌ వరకు విస్తరిస్తూ ఫేజ్‌-2లో 76 కి.మీ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచామన్నారు. మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ విస్తరణ ముందుకు సాగకుండా కుట్రలు చేస్తున్నారనీ, ఎల్‌ అండ్‌ టీ కూడా సహకరించట్లేదని చెప్పారు. మెట్రో ఫస్ట్‌ఫేజ్‌లో 70 కి.మీల కోసం దాదాపు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశామని, ఆ ప్రాజెక్ట్‌లో తాము నష్టపోయినందున, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయాలని ఎల్‌ అండ్‌ టీ డిమాండ్‌ చేస్తుందన్నారు. ఇలాంటి సమయంలో మెట్రోరైల్‌ ఫేజ్‌-2 కోసం ఎల్‌అండ్‌టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం సూచించడం సరికాదని చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ను ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యంతో (పీపీపీ) నిర్మించడం సాధ్యంకాదన్నారు. ప్రభుత్వమే ఈ భవనాన్ని నిర్మిస్తుందని వివరించారు.

తల్లుల ఉసురుతోనే కేసీఆర్‌ కుటుంబలో ముసలం
తెలంగాణ ఉద్యమంలో వందలాదిమంది పిల్లల్ని ఎమోషనల్‌గా రెచ్చగొట్టి కేసీఆర్‌ పొట్టన పెట్టుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆ బిడ్డల తల్లుల ఉసురు తగిలే ఇప్పుడు కేసీఆర్‌ కుటుంబంలో ముసలం పుట్టిందన్నారు. తనను కూడా తన బిడ్డ వివాహ వేడుకలకు దూరంగా ఉంచి పైశాచిక ఆనందం పొందారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ కవితను ఆమె కుటుంబసభ్యులే టార్గెట్‌ చేశారని చెప్పారు. అదంతా వారి ఆధిపత్యం, అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన విభేదాలేననీ, దానిలో తమ ప్రమేయం ఏం లేదని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌పార్టీ పోరాడుతుందని తెలిపారు.

యూరియాపై దుష్ప్రచారం
”ప్రస్తుత సీజన్‌లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్ర వాటా కింద 9.8 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉంది. కానీ కేంద్రం సకాలంలో దాన్ని సరఫరా చేయలేదు. అనేక విడతలుగా తక్కువ వాటాను సరఫరా చేశారు. దీనికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు రైతుల్లో ఆందోళన కలిగించేలా ప్రకటనలు చేశారు. దీనివల్లే రాష్ట్రంలో యూరియాపై అనిశ్చితి ఏర్పడిందన్నారు. నక్సలైట్లు లొంగిపోవడానికి గతంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయని గుర్తు చేశారు. వారు జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశం కల్పించాలని చెప్పారు. పాకిస్థాన్‌ టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు, స్వదేశం బిడ్డలు నక్సలైట్లతో చర్చలు జరపడానికి ఉన్న అవరోధాలు ఏంటని ప్రశ్నించారు. ఏపీ మంత్రి లోకేష్‌ ఎవరినైనా కలువచ్చని, అందుకు తన అనుమతి అక్కర్లేదని చెప్పారు. లోకేష్‌ తనకు తమ్ముడులాంటి వాడని కేటీఆర్‌ అంటున్నారనీ, అలాంటప్పుడు తండ్రి లాంటి చంద్రబాబును అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టిన సమయంలో రోడ్లపైకి వచ్చిన ప్రజలపై పోలీసులతో ఎందుకు దాడి చేయించారని ప్రశ్నించారు.

ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో?
పదిమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని కేటీఆర్‌, హరీశ్‌రావులు ఆరోపిస్తున్నారనీ, అసలు ఆ ఎమ్మెల్యేలు ఏపార్టీలో ఉన్నారో వాళ్లకే స్పష్టత లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో హరీశ్‌రావు ‘మాకు సభలో 37 మంది సభ్యులు ఉన్నారు. మాట్లాడేందుకు సమయం కావాలి’ అని అడుగుతారనీ, కేటీఆర్‌ పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని స్పీకర్‌కి చెప్పామని అన్నారు. మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చే విషయంపై మాట్లాడుతూ ఎవరు అవుతారో తాను ఇప్పుడే చెప్పలేనన్నారు.

నీటి నేరాలన్నీ బీఆర్‌ఎస్‌ చేసినవే..
నీటి వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్పష్టమైన లెక్కలు లేవని సీఎం అన్నారు. దీనికి పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కారకులని చెప్పారు. ‘గోదావరి లో 968 టీఎంసీ కేటాయింపులు ఉన్నాయి. అయితే ఏ ప్రాజెక్ట్‌ కింద ఎంత నీటిని వాడుకుంటున్నామో తెలియదు. అప్పటి కేసీఆర్‌ సర్కార్‌ అప్పుల కోసం ఒక ఆయకట్టును ఇంకో ప్రాజెక్ట్‌ కింద చూపింది. ఒక ప్రాజెక్ట్‌ కింది నీటి వినియోగాన్ని ఇంకో ప్రాజెక్ట్‌ కిందకు తెచ్చారు. దీంతో రాష్ట్రం ఎంత నీటిని వినియోగిస్తుందో ఎవరికి తెలియదు’ అని చెప్పారు. ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల వివాద పరిష్కారం కోసం ఇటీవల ఇద్దరు సీఎంలు భేటి అయిన విషయాన్ని గుర్తు చేశారు.

స్థానికం ‘సుప్రీం’ తీర్పు తర్వాతే
అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించాలా? వద్దా? అన్న అంశంపై రాష్ట్రపతి రిఫరెన్స్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అయితే సెప్టెంబర్‌ 30 లోపు స్థానిక సంస్థలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలను గుర్తు చేశారు. ఈ గడువు సైతం దగ్గర పడుతున్న నేపథ్యంలో న్యాయకోవిదుల సలహాలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -