Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ ఐటీఐలో 5వేల సీట్లను భర్తీ చేయాలి

ప్రభుత్వ ఐటీఐలో 5వేల సీట్లను భర్తీ చేయాలి

- Advertisement -

ఏటీసీ పేరుతో సంప్రదాయ ట్రేడ్లపై నిర్లక్ష్యం తగదు
విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలి : జేడీ నగేష్‌కు ఎస్‌ఎఫ్‌ఐ వినతి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ ఐటీఐల్లో ఐదు వేల సీట్లను వెంటనే భర్తీ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఐటీఐలో ఈ సంవత్సరం ప్రవేశాలు చేపట్టకుండా నిలిపేయడం సరైంది కాదని తెలిపింది. ఏటీసీల పేరుతో సంప్రదాయ ట్రేడ్లలో ప్రవేశాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేయడం తగదని హెచ్చరించింది. విద్యార్థులకు ఐటీఐల్లో వెంటనే ప్రవేశాలు కల్పించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ట్రైనింగ్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌వికె నగేష్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ రజినీకాంత్‌, కార్యదర్శి టి నాగరాజు కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో 64 ప్రభుత్వ ఐటిఐల్లో 4,884 సీట్లు భర్తీ చేయలేదని తెలిపారు. ఫిట్టర్‌-80 సీట్లు, ఎలక్ట్రికల్‌-128 సీట్లు, వెల్డర్‌-640 సీట్లు, టర్నర్‌-360 సీట్లు, స్టెనోగ్రఫీ-264 సీట్లు, డ్రెస్‌ మేకింగ్‌-320 సీట్లు, కోపా-912 సీట్లు, సివిల్‌-1,632 సీట్లు, ఎంఎంవి-120 సీట్లు, మెకానిస్ట్‌-168 సీట్లు, వుడ్‌ వర్క్‌- 24 సీట్లు, మెకానిక్‌ గ్రిండర్‌-80 సీట్లు, డీజిల్‌ మెకానిక్‌-48 సీట్లు, ఇన్‌స్ట్ట్రుమెంట్‌-178 సీట్లు తదితర ట్రేడ్లలో మొత్తం 4,884 సీట్లకు ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు భర్తీ చేయలేదని పేర్కొన్నారు.

ఏటీసీ పేరుతో ఉపాధి కల్పన అంటూ వేరే కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. రాష్ట్రంలో ఒకేసారి 4,884 పైగా సీట్లకు కొత పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో చాలా కళాశాలల్లో అన్ని ట్రేడ్లలో కనీసం ఒక్క అడ్మిషన్‌ కూడా నింపలేదని వివరించారు. దీని వల్ల ప్రయివేట్‌ కళాశాలలకు అవకాశం ఇచ్చి వాటిలో ఈ ట్రేడ్‌లను కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఐటీఐల్లో ఈ ట్రేడ్లలో ప్రవేశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏటీసీలను తీసుకొచ్చి ప్రయివేట్‌ సంస్థ టాటాకు అప్పజెప్పి రాష్ట్రంలో ప్రభుత్వ ఐటీఐల్లో సీట్లు నింపకపోవడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. డిమాండ్‌ ఉన్న స్టెనోగ్రఫీ, డ్రెస్‌ మేకింగ్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రికల్‌, టన్నర్‌, వెల్డర్‌ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం కనీసం నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ ట్రేడ్లలో సీట్లను భర్తీ చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్‌ గువేరా, హైదరాబాద్‌ జిల్లా నాయకులు కైలాష్‌, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -