Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేసీఆర్‌ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారు

కేసీఆర్‌ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారు

- Advertisement -

బీఆర్‌ఎస్‌ హయాంలో వేరే పార్టీ ఎమ్మెల్యేలు 32 మందిని చేర్చుకోలేదా?
అప్పుడు ఎందుకు రాజీనామాలకు డిమాండ్‌ చేయలేదు?
ప్రజలకిచ్చిన హామీ మేరకే కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా : స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నవతెలంగాణ-నక్కలగుట్ట
కేసీఆర్‌ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం హన్మకొండలోని నక్కలగుట్ట హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలకు చెందిన 36మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, అందులో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని, అప్పుడు రాజీనామాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వాళ్లు చేస్తే సంసారం, ఇప్పుడు వేరేవాళ్లు చేస్తే వ్యభిచారమా అంటూ విమర్శించారు. సభ్యత, సంస్కారం మరవొద్దని, కొంతమంది స్థాయిని మరిచి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ పదవులు అడగలేదని, కేసీఆర్‌ స్వయంగా ఢిల్లీ నుంచి పిలిచి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని అన్నారు. తాను భూ కబ్జాలు, అవినీతి చేయలేదని ఎప్పుడూ స్వార్థం కోసం పని చేయలేదని తెలిపారు. తన దృష్టి ఎల్లప్పుడూ నియోజకవర్గ అభివృద్ధిపైనే ఉందని చెప్పారు. ‘ప్రజల చేత, పార్టీల చేత తిరస్కరించబడిన వ్యక్తివి నువ్వని, ప్రజలు, పార్టీలు తిరస్కరించిన వ్యక్తి ఇప్పుడు ఆరోపణలు చేయడం విచిత్రమని అన్నారు.

ఎవరెన్ని వ్యక్తిగత దూషణలు చేసినా తాను వెనుకడుగు వేయలేనని, ప్రజల అభివృద్ధికే కట్టుబడి పని చేస్తానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే తన ఎజెండా అని, ప్రజలకిచ్చిన హామీ మేరకే కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని అన్నారు. గత 21 నెలల్లోనే నియోజకవర్గానికి రూ.1025 కోట్ల అభివృద్ధి పనులు మంజూరైనట్టు శ్రీహరి వివరించారు. దేవాదుల ఉప కాల్వలు మరమ్మత్తు చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందజేసినట్టు తెలిపారు. రూ.1015కోట్లతో 3వ దశ పనులు పూర్తవుతాయని, 4 నియోజకవర్గాల్లో 78వేల ఎకరాలకు సాగునీరు చేరుతుందని, ప్రతి గ్రామానికి గోదావరి జలాలు వచ్చే ఏడాదిలోపు అందిస్తామని, రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైనట్టు తెలిపారు. రూ.45.50 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, అనేక సబ్‌స్టేషన్లు నిర్మాణంలో ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లే ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు లభ్యమయ్యాయని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -