సీఎస్‌కు టీఎస్‌సీపీఎస్‌ఈయూ అధ్యక్షులు స్థితప్రజ్ఞ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగుల కరువు భత్యం (డీఏ) బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను ఒకేసారి చెల్లించాలని కోరారు. ఆర్నెల్లకు ఒకసారి ఇచ్చే డీఏ రెండేండ్లకి ఇచ్చి అందులో వాయిదా పద్ధతిలో చెల్లించడం వల్ల సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయపడినట్టు అయ్యిందని తెలిపారు. పాత పెన్షన్ పథకం ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలో ఒకేసారి జమ చేయబడతాయని వివరించారు. ప్రభుత్వం జీపీఎఫ్ వడ్డీ రేట్ల ప్రకారం క్రెడిట్ మొత్తంపై వడ్డీ పొందుతారని పేర్కొన్నారు. అయితే వాయిదాల పద్ధతి ద్వారా సీపీఎస్ ఉద్యోగులకు అదే ప్రయోజనం కల్పించబడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈఎంఐ ప్రాతిపదికన పొందుతున్నారని తెలిపారు.
మూడు బిల్లులకు సంబంధించి డీడీవోలు సమర్పించి ఆడిట్ చేసినప్పటికీ బకాయిలు ప్రభుత్వం వద్ద నుంచి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికీ రెండేండ్లయినా అన్ని రికవరీలూ ప్రాన్ ఖాతాలో జమ చేయలేదని తెలిపారు. ఉద్యోగ విరమణ చెందిన సీపీఎస్ ఉద్యోగులు కూడా యాన్యుటీ కొనుగోలు చేయలేకపోతున్నారని వివరించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మొత్తం బకాయిలను ఒకేసారి చెల్లించాలనీ, రిటైర్ అయిన సీపీఎస్ ఉద్యోగుల జీవనం సాఫీగా సజావుగా సాగేలా చూడాలని కోరారు. సీఎస్ రామకృష్ణారావు సానుకూలంగా స్పందించారనీ, ఈ అంశాన్ని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానంటూ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ నాయకులు కోటకొండ పవన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES