Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఊరిస్తూ…ఊరడిస్తూ…

ఊరిస్తూ…ఊరడిస్తూ…

- Advertisement -

పార్టీ పదవులపై కాంగ్రెస్‌ కాలయాపన
టీపీసీసీ చీఫ్‌ బాధ్యతలు చేపట్టి ఏడాదైనా నెరవేరని ఆశలు
గ్రూప్‌ పాలిటిక్స్‌… అంతర్గత పోరుతోనే జాప్యం
స్థానిక ఎన్నికల్లో కష్టమే
గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ అధికారం చేపట్టి రెండేండ్లు కావొస్తున్నది. టీపీసీసీ అధ్యక్షులుగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచింది. కానీ పార్టీ పదవులను ఇవ్వడంలో మాత్రం ఊరిస్తూ…ఊరడిస్తూ…అన్న రీతిలోనే ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రతి కార్యకర్త కోరుకునేది తాను పని చేస్తున్న పార్టీలో పదవి. తద్వారా ప్రజల్లో గుర్తింపు, మద్దతు కూడబెట్టుకోవడం, అది వారి చిరకాల వాంఛ. ఆ తర్వాత ఎన్నికల్లో గెలవడం, అలాంటి కార్యకర్తలను గుర్తించి పార్టీ పదవులివ్వడమేది నాయకత్వస్థానంలో ఉన్న వారి బాధ్యత. కానీ ఆ విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నది. పదవులు ఇవ్వడం వల్ల పార్టీపై పెద్ద ఆర్థిక భారం కూడా పడదు. ఒక నియామకపత్రం తప్ప. ఆ నియామకపత్రం కోసం అన్ని స్థాయిల్లో క్యాడర్‌ ఎదురు చూస్తున్నది. పదవులు ఇవ్వడం ఆలస్యం అయినకొద్దీ దాని ప్రభావం పార్టీ, ప్రభుత్వంపై కూడా పడుతున్నది. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుతం చేపట్టిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా వెళతాయి. ఈ చిన్న లాజిక్‌ను కాంగ్రెస్‌ మిస్సవుతుందంటూ క్యాడర్‌లో చర్చ జరుగుతున్నది.

లక్షన్నరకు పైగా పదవులు
గ్రామ వార్డుసభ్యులు దగ్గర నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని స్థాయిల్లో లక్షన్నరకు పైగా పదవులు వస్తాయి. ఇవేకాకుండా మార్కెటింగ్‌ కమిటీ సభ్యులు, ప్రాథమిక సహకార సంఘాల సభ్యులు, దేవాలయాల కమిటీ సభ్యులు.. ఇలా చెప్పుకుంటూ పోతే పదవులు ఎన్నో ఉంటా యి. ఆ పదవులను నింపే బాధ్యత పార్టీపై ఉంటుంది. కానీ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత ఒత్తిళ్లు, గ్రూప్‌ పాలిటిక్స్‌ వల్ల నియామకాలు ఆలస్యమవుతున్నట్టు పార్టీ నేతలు చెబుతు న్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లకే అంతర్గత అసంతృప్తి బయటపడుతోంది. పదవుల కేటాయింపులో ఆలస్యం జరుగుతున్నదనే భావన కార్యకర్తల్లో నెలకొంది. దశాబ్దాలపాటు పార్టీ కోసం కష్టపడ్డ వారి కంటే, ఎన్నికల ముందు కొత్తగా చేరిన నాయకులకు ప్రాధాన్యత పెరుగుతోందంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ ఆలస్యం, కార్పొరేషన్లు, బోర్డు నియామకాల్లో జాప్యం, జిల్లా స్థాయి పదవులపై స్పష్టత లేకపోవడం కార్యకర్తల్లో నిరుత్సాహానికి దారి తీస్తోంది.
ఎన్నికల సమయంలో త్యాగాలు చేసిన తమకు ఇప్పుడు తమకే అవకాశాలు రావడం లేదన్న గోడు వినిపిస్తున్నది. కొంతమంది సీనియర్‌ నేతలు బాహాటంగానే ఈ విషయం చెబుతున్నారు. వర్గపోరు, లాబీయింగుల కారణంగా పదవుల పంపిణీ వాయిదా పడుతోందని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఇక దీనిపై అధిష్ఠానం దృష్టి సారిస్తేనే క్షేత్రస్థాయిలో క్యాడర్‌ ఉత్సాహంగా పని చేసే అవకాశం ఉంది. లేకపోతే రాబోయే గ్రామ, మండల, జెడ్పీటీసీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులకే పరిమితమా?
పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో మేథోమథనం చేసి ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్ష పదవులను నియమించేవరకే టీపీసీసీ చీఫ్‌ పరిమితమ య్యారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధు లను నియమించే అధికారం కూడా ఆయనకు ఉంది. ఆయన ఆదేశాలమేరకు గ్రామ, మండల, జిల్లా కార్యవర్గాలను నియమించవచ్చు. ఈ వ్యవహారాన్ని చక్క దిద్దేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మెన్లు, అనుబంధ సంఘాల అధ్యక్షుల అభిప్రా యాలను తీసుకోవాల్సి ఉంటుంది. తమ అనుచరులకు పార్టీ పదవులు ఇప్పిం చుకునేందుకు వారు చాంతాడంత లిస్టు ఇచ్చినట్టు తెలిసింది. అందులో కొందరికి రాకపోయినా, నచ్చని వారికి పదవులొచ్చినా అదో పెద్ద చర్చ. మరోవైపు ఇప్పటికే జిల్లాల్లో నెలకొన్న గ్రూప్‌ తగాదాలు కూడా పదవులు ఆలస్యం కావడానికి కారణమన్న వాదన వినిపిస్తున్నది.

అయోమయంలో అధిష్టానం
సీనియర్‌ నేతల మధ్యలో గ్రూప్‌ పాలిటిక్స్‌ లాబీయింగ్‌ ఎక్కువగా ఉండటంతోపాటు ఏ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిపై అధిష్టానం అయోమ యంలో పడింది. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన నేతలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారని పాత కార్య కర్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో తాముపార్టీ కోసం చేసిన కష్టం వృథా అయ్యిందనే భావన కార్యకర్తల్లో బలపడుతోంది. రాష్ట్ర నేతల సూచనలకంటే పార్టీ అధిష్టానం నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండడం వల్ల ఆలస్యం మరింత పెరుగుతోంది. పార్టీలో కొత్తగా చేరిన నాయకులు ప్రభావం చూపేవారు కావడంతో వారికే పదవులు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో 10 నుంచి 15 ఏండ్లుగా కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తల్లో నిరుత్సాహం పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కార్యకర్తల్లో ఉత్సాహం సన్నగిల్లితే పార్టీకి నష్టమని సీనియర్లు చెబుతున్నారు. పార్టీలో అంతర్గత అసంతృప్తి పెరగడం వల్ల ఇతర పార్టీలు ప్రయోజనం పొందే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -