– ఖమ్మం అటవీ శాఖ ఉన్నతాధికారులను ప్రశంసించిన మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖమ్మం జిల్లాలోని పులిగుండాల ఎకో టూరిజం కేంద్రంలో జ్యూట్ బ్యాగుల వాడకాన్ని తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు. రాష్ట్రంలోని అన్ని ఎకో టూరిజం సెంటర్లు ఈ పద్ధతిని అనుసరించాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన అధికారులు, పలు సంస్థల బృందంతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి జ్యూట్ బ్యాగులు వాడాలనే ఖమ్మం జిల్లా అధికారుల ప్రయత్నాన్ని ప్రశంసించారు. తెలంగాణ వన జీవధార అభియాన్ (టీవీజేఏ), వన సంరక్షణ సమితులకు అటవీ సంరక్షణతో పాటు సుస్థిర జీవనోపాధిని కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఈ పథకంలో హస్తకళలు, నర్సరీ నిర్వహణ, ఎకో టూరిజం, తేనెటీగల పెంపకం వంటి శిక్షణలు, అటవీ ఉత్పత్తులకు విలువ ఆధారిత మార్కెట్ వ్యవస్థలు, హర్బల్ తోటలు వంటి అటవీ మౌలిక సదుపాయాల కల్పన జరగడం హర్షనీయం అన్నారు. క్యాంపా, టీజీ ఎఫ్డీసీ, సీఎస్‌ఆర్ నిధులు, కేంద్ర పథకాలతో ఈ ప్రాజెక్ట్ అమలవుతుందనీ, వచ్చే మూడేండ్లలో ఖమ్మం జిల్లాలో ఐదొందల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. కాగా, స్థానికంగా పులిగుండాలలో చేపట్టిన జ్యూట్ బ్యాగుల వినియోగం వంటి చర్యలు ఎకో టూరిజాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు, గ్రామీణ అభివద్ధికి ఈ చర్యలు ఉపయోగపడతాయని మంత్రి సురేఖ అభిప్రాయపడ్డారు.
పులిగుండాల జ్యూట్ బ్యాగులు అందరికీ ఆదర్శం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES