నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ సినీనటి సదా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సయ్యద్ కన్నుమూశారు. వారం రోజుల క్రితమే ఆయన మరణించగా, ఈ విషాద వార్తను సదా తాజాగా ఇన్‍స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఆమె పెట్టిన భావోద్వేగ పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.
“మా నాన్న మమ్మల్ని విడిచి వారం రోజులే అయినా, అదొక యుగంలా గడిచింది. ఆయన లేని లోటు నా జీవితంలో ఎప్పటికీ పూడ్చలేనిది” అని సదా ఆవేదన వ్యక్తం చేశారు. తాను నటిని అవుతానన్నప్పుడు కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకించినా, తన తండ్రి ఒక్కరే అండగా నిలిచారని ఆమె గుర్తుచేసుకున్నారు. “నాన్నే నాకు అండగా నిలబడ్డారు. కెరీర్ ఆరంభంలో నాతో పాటు షూటింగులకు వస్తూ, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఆయన చేసిన త్యాగం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను” అని సదా తన పోస్టులో పేర్కొన్నారు.
కొంతకాలం తర్వాత తన తల్లి ఆ బాధ్యతను తీసుకోగా, తన తండ్రి ఒక చిన్న క్లినిక్ ప్రారంభించి ఎంతోమందికి సేవ చేశారని సదా తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తికి కూతురిగా పుట్టడం గర్వంగా ఉందని ఆమె అన్నారు. సదా పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు, అభిమానులు ఆమెకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ధైర్యంగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.
‘జయం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సదా, ‘ఔనన్నా కాదన్నా’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‍లో ఉంటున్నారు.