తొమ్మిది రోజుల పాటు అంగ రంగ వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ. మనిషి జీవితం ప్రకృతితో విడదీయరాని అనుబంధం పెనవేసుకుని ఉంటుందని తెలియజెప్పే పండుగ బతుకమ్మ. తెలంగాణ పండుగ వేడుకల్లో సంస్కృతి సంప్రదాయాల కలనేతగా విలసిల్లే చైతన్య సంగమం బతుకమ్మ. ఇప్పుడు దేశ విదేశాలలో సైతం ఈ పండుగ వైభోగం ఆర్భాటంగా మారింది. స్త్రీలు అరమరికలు, ఆర్థిక కుల అంతరాల తేడాల్లేకుండా కలిసి నిర్వహించుకునే వేడుక బతుకమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని పండుగల్లోకెల్లా శిఖర సమానమైనది. మానవీయ సంబంధాలకు ఉన్నతమైన, హృద్యమైన, వ్యక్తీకరణ. రంగురంగుల వాగులు వీథుల్లో ప్రవహిస్తూ ఒక చోటుకు చేరుకొన్నట్లు గుంపులుగా స్త్రీలు అన్నీ మరిచి ఆదమరిచి ఆడుకుంటారు. గాఢమైన మానవ సంబంధాల దీపాలను వెలిగిస్తారు.
అయితే బతుకమ్మను కేవలం సంబరాల్లా జరుపుకుంటే సరిపోతుందా? ఆ తొమ్మిది రోజులు ఆడిపాడితే మహిళల జీవితం మారిపోతుందా? మహిళల జీవితాలు చిగురుటాకులా వణికిపోతున్న నేటి సమాజంలో ఆమెకు చేయూతనిచ్చే పండుగగా బతుకమ్మ ఉండాలి. మహిళల బతుకు కోరే పండుగవ్వాలి బతుకమ్మ. ఆమెనూ ఓ మనిషిగా గుర్తించి స్వేచ్ఛా, సమానత్వం కావాలని గుర్తించే పండుగగా బతుకమ్మ ఉండాలి. శతాబ్దాల తరబడి మహిళలు లింగ అసమానతలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాటలు మలిచి బతుకమ్మతో పంచుకుంటున్నారు. అట్లాగే పనిపాటల్లో ‘ఆటవిడుపు’ పాట కొనసాగడం కూడా చూస్తూనే ఉన్నాం. అన్ని సందర్భాలలోనూ ‘పాట’ స్త్రీలకు తమ గాథలను, బాధలను కలబోసుకునే సమిష్టి వ్యక్తీకరణ రూపం తీసుకోవడం అన్ని భారతీయ భాషల మౌఖిక సాహిత్యాల్లోనూ మనం గమనించవచ్చు. అట్లా చూసినప్పుడు ‘పాట’ సామాజిక చరిత్రలో స్త్రీల సంవేదనలను పట్టి చూపే సందర్భాన్ని అనుసరించి తమ సంవేదనలను, ఊహలను వ్యక్తీకరించేది స్త్రీలే. అందువల్ల జనం నోళ్ళలో ఆడే పాటలకు సృష్టికర్తలు స్త్రీలే. అలా మహిళల మస్తిష్కాల నుండి పుట్టుకొచ్చినవే బతుకమ్మ పాటలు.
బతుకమ్మ పాటల్లో స్త్రీల స్థితిగతులు వారి కష్టసుఖాలు, ఆనందాలు, ప్రేమ, భక్తి, సామాజిక కట్టుబాట్లు, పురుషాధిపత్యాన్ని ఎదిరించడం వంటి అనేక విషయాలను మనం గమనించవచ్చు. ఈ పాటలు కేవలం వినోదానికే కాకుండా మహిళల జీవన చిత్రణకు, వారి అస్తిత్వ పోరాటానికి, చైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఇది మహిళా కేంద్రిత పండుగ కావడంతో, వారి జీవితంలోని ప్రతి కోణాన్ని ఈ పాటల్లో చూడవచ్చు.
ఆనాటి స్త్రీలు ఎదుర్కొన్న కష్టాలు, అత్తాకోడళ్ళ సంబంధాలు, బంధుత్వం, స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు వంటి వాటిని పాటలు వివరిస్తాయి. బతుకమ్మను స్త్రీ శక్తికి ప్రతిరూపంగా భావించి, పాటల్లో ఆమె త్యాగాలను, ఆత్మబలిదానాలను, ఊరిని కాపాడే ప్రయత్నాలను గుర్తు చేస్తారు. కొన్ని పాటల్లో మగవారి ఆధిపత్యాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసిన స్త్రీల ప్రస్తావన ఉంటుంది. ఇటువంటి బతుకమ్మ పండుగకు ఓ లక్ష్యమంటూ ఉండాలి. మన పాలకులు చెబుతున్న బేటీ బడావో-బేటీ బచావో వంటి నినాదాలు కేవలం చెప్పుకోడానికే మరిమితమవుతున్నాయి. కానీ అమ్మాయిలకు రక్షణ మాత్రం కరువయ్యింది. ఇటువంటి సమాజంలో ఆమెకు బాసటగా నిలిచే పండుగగా బతుకమ్మను జరుపుకోవాలి. ఈ బతుకమ్మ సాక్షిగా మహిళా సమానత్వం కోసం అందరూ చేయీ చేయీ కలపాలి. అమ్మాయిలు స్వేచ్ఛగా బతికే ధైర్యాన్ని ఇవ్వాలి.
బతుకమ్మ
- Advertisement -
- Advertisement -