Sunday, September 21, 2025
E-PAPER
Homeప్రత్యేకంయాత్రలు చేయండి…

యాత్రలు చేయండి…

- Advertisement -

హాయ్‌! ఎలా ఉన్నారు అందరూ. నన్ను గుర్తు పట్టారా? హ్మ్… కొందరు గుర్తు పట్టి ఉంటారు. కొందరేమో ‘ఎక్కడో చూసినట్టుందే’ అని అనుకుని ఉంటారు. యెస్‌. మీరు అనుకుంటున్నది కరెక్టే. నేనేనండోయ్‌. యమ్‌.ఆదినారాయణ. నా బ్లడ్‌ గ్రూప్‌ ‘జి’. అదేమిటని ఆశ్చర్యపోకండి. జి అంటే జిప్సీ అని. ప్రపంచ యాత్రికుడిని. స్కాలర్‌ జిప్సీని. అయ్యో! ఈమధ్య జిప్సీ అనొద్దంటున్నారు రోమా ప్రజలు. వారిని గౌరవిస్తూనే మనకు సౌకర్యంగా ఉండేందుకు జిప్సీగానే మీతో కాసేపు మాట్లాడతాను. నాలుగు గదుల మధ్య కూర్చుని ఎంతకని ప్రపంచాన్ని చూడాలనుకుంటారండీ.

రండి! నేను ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తాను. యాత్రలు చేయడం ఎంత బాగుంటుందో మీకు తెలుసా? మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ఆవిష్కరించుకోవాలంటే, మీ వ్యక్తిత్వాన్ని సరిగ్గా నిర్మించుకోవాలంటే ముందు యాత్రలు చేయాలి. అందుకే నా యాత్రను అందరి యాత్ర చేయాలనుకున్నాను. ఈ ప్రయత్నంలోనే ప్రంపంచంలోని వింతలూ విడ్డూరాలను పుస్తకాలుగా రూపొందించి మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇప్పటికి 12 పుస్తకాల యాత్రా సాహిత్యం మీ ముందు ఉంది. మీరు ఏదైనా దేశాన్నో, మన దేశంలోని ఏదైనా ప్రదేశాన్నో చూడాలనుకుంటున్నారనుకోండి, ముందుగా నా పుస్తకం చదివారనుకోండి, ఆ ప్రదేశాలకు వెళ్లిన తరువాత కచ్చితంగా మధురానుభూతులను పొందుతారు. ఎలా అనుకుంటున్నారా… అయితే నేను చెబుతున్న పూర్తి విశేషాలు చదవండి మరి.
నడిపించింది నాన్న:
ప్రపంచం ఎంత పెద్దదో చెప్పండి. ఎన్ని వింతలతో కూడినదో చెప్పండి. నాకైతే ప్రపంచంలోని ప్రతి అణువునూ తెలుసుకోవాలని కోరిక. ఈ కోరిక ఇప్పుడు పుట్టింది కాదండోరు. నా తాత, తండ్రుల నుంచే నాకు వారసత్వంగా ఈ యాత్రలు చేసే ఆసక్తి కలిగిందని చెప్పొచ్చు. అంతేకాదు. అసలు నా రక్తంలోనే ఉంది యాత్రలు చేసే ఆసక్తి, అనురక్తి. ఎలా అనుకుంటున్నారా? పూర్వ కాలం నుంచే ఎందరో సాధు సన్యాసులు సంసార బాధ్యతల నుంచి విముక్తి పొందేందుకు దేశాటన చేసేవారు. రైళ్లు రాక పూర్వం నుంచి ఉన్నాయి. మా తాతల కాలం నుంచి చెప్పుకుంటే రైళ్లు వచ్చిన కొత్తల్లోనే వారు ఎందరో సాధుసన్యాసులు బృందాలుగా ఏర్పడి ఉచితంగానే రామేశ్వరం, కాశీయాత్రలు చేసి వస్తుండేవారు. వారిలో అవివాహితులు, వివాహితులు ఉండేవారు. అప్పటి సాధుసన్యాసులతో ఈనాటి వారికి పోలికలేదండోరు. మా తాతగారి పేరు వైకుంఠ తిరుమాళ్లు. అద్భుతమైన పండితుడు. పాటగాడూ. మా నాన్న కోటి లింగం. మా తాతలాగే మా నాన్న ఎక్కడ సాధువుల్లో కలిసిపోతాడోననే భయంతో ఊరివాళ్లంతా కలిసి మా అమ్మతో బలవంతంగా పెళ్లి జరిపించేసారు. అయితేమాత్రం మానాన్న ఏమన్నా ఆగాడా. లేదండీ. ఆయన భారత దేశమంతటా పర్యటించాడు. అందుకే ఆయనను ‘సంసార సంచారి’ అని నిర్వచిస్తాను. ఆయన స్ఫూర్తే నన్ను ఏడు ఖండాలు చుట్టి వచ్చేంతటి ఆశయాన్నిచ్చింది. ఆయనే నాకు గాడ్‌. అందుకే నా పుస్తకంలో ”నడిపించింది నాన్న/ నడిచింది ఆదినారాయణ” అని రాసుకున్నాను.

తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది:
ఈ మాట నా ప్రతి పుస్తకంపైన కనిపిస్తుంది. స్వతహాగా నేను కవిని. రచయితను, శిల్పిని, చిత్రకారుడిని. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫైనార్ట్స్‌ విభాగం ప్రొఫెసర్‌ను. బాల్యం నుంచే చదువుపట్ల ఆసక్తి విపరీతంగా ఉండేది. దాంతో చిన్న వయసు నుంచే ప్రపంచ సాహిత్యం వైపు అడుగులు పడ్డాయి. నాన్న సంచారిగా మారినప్పుడు మా అన్నయ్య, నేను, మా చెల్లి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. కూలి నాలి చేసుకుని బతకాల్సిన పరిస్థితి. ఆ సమయంలో మా అన్నయ్య కేవలం కడుపు నింపుకోడానికే మిల్ట్రీలో చేరాడు. ఆ తరువాత అన్నయ్య నెల నెలా పంపే డబ్బుతో నేనూ మా చెల్లి చదువుకున్నాం. అన్నయ్య లెఫ్టినెంట్‌ కమాండర్‌గా పని చేసాడు. మా చెల్లిని సైతం లెఫ్టినెంట్‌ కమాండర్‌గా తీర్చిదిద్దారు. నాకు కళలపైనే ఆసక్తి ఉన్న విషయం బాల్యంలోనే అర్థమైపోయింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్రకళ, శిల్పవాస్తు కళ, కవిత్వం, కథల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. చివరకు సాహిత్యంలోనే పిహెచ్డీ చేసి గోల్డ్‌ మెడల్‌ సంపాదించాను. జీవితాన్ని మనకు నచ్చిన రీతిలో మలుచుకుంటే సుఖసంతోషాలు మనతోనే ఉంటాయి. మనసుకు నచ్చిన చదువు, అధ్యయనం, ప్రపంచాన్ని చుట్టేయడం… అన్నీ చేసాను గనుకే ఇప్పటికీ సంతోషమే నా స్నేహశీలి. ప్రపంచంలోని ప్రతి అణువునూ కళ్లారా చూడాలని, దానిని అనుభూతి చెందాలని అనుకున్నాను. నిజం చేసుకున్నాను. మా నాన్న, వారి నాన్న… అందరూ యాత్రలు చేసారు కానీ వాటిని అక్షరబద్దం చేయలేకపోయారు. నేను పిహెచ్డీ పట్టా పుచ్చుకుని మరీ యాత్రా సాహిత్యాన్ని సృష్టిస్తున్నాను గనుక నన్ను నేను ‘స్కాలర్‌ జిప్సీ’గా అభివర్ణించుకుంటున్నాను. అలాగే ప్రపంచాన్ని చూసిన వారికి కలిగే అనుభూతి టీవీల్లో చూస్తే రాదు. అది స్వయంగా తెలుసుకుని మరీ ‘తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది’ అని రాసుకున్నాను.

ఫ్రమ్‌ వూంబ్‌ టూ టూంబ్‌:
ఇది నా తొలి ప్రయాణానికి పెట్టుకున్న పేరు. చెప్పాను కదా మా చెల్లెలు లెఫ్టినెంట్‌ ఆఫీసర్‌ అని. ఆమె ఢిల్లీలోనే అకస్మాత్తుగా చనిపోయింది. ఆమె సమాధి దర్శనానికి ప్రకాశం జిల్లాలోని మా వూరి నుంచి ఢిల్లీదాకా నడుచుకుంటూ వెళ్లాను. అదే నా తొలి ప్రయాణం. ఆ ప్రయాణానికి ‘ఫ్రమ్‌ వూంబ్‌ టూ టూంబ్‌’ అని పెట్టుకున్నాను. ఆ సమయంలో నేను రాసిన పుస్తకాలు ‘భ్రమణ కాంక్ష, ప్రార్థించే పాదాలు’. వీటిని ఎమెస్కో వారు ప్రచురించారు. ఈ పుస్తకం అయిదుసార్లు ముద్రితమవడం విశేషం.
కాలి బాటలు నా స్వర్గ ద్వారాలు:
భ్రమణ కాంక్ష నాకు బాల్యం నుంచే ఉందని చెప్పాను కదా. అలాగే నేను చేస్తున్న యాత్ర అందరి యాత్ర కావాలనే తపన ఉంది. అందుకోసం నా ప్రయాణానికి ఒక ప్రణాళిక రూపొందించుకుంటాను. ఆ ప్రణాళిక ప్రకారమే నా యాత్ర సాగుతుంది. ప్రణాళిక ఉండటంతో ప్రయాణానికి నా మనసు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుంది. దాంతో అక్కడ ఎదురయ్యే ప్రతీ అనుభవాన్ని ఎంజారు చేయగలిగే మనస్తత్వం ఏర్పడుతుంది. పాజిటివ్‌ ఆలోచనలు ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే ‘కాలి బాటలు నా స్వర్గ ద్వారాలు’ అని రాసుకున్నాను.

పెళ్లి జోలికి వెళ్లలేదు:
నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా. మా నాన్న గారు నా హస్తరేఖలు చూసి ‘నీకు పెళ్లానికి కూడు పెట్టే యోగం లేదురా. అంతకంటే గొప్పగా బ్రహ్మజ్ఞానం అబ్బింది’ అని చెప్పారు. అదే నా విషయంలో అక్షరాలా నిజమైందని నమ్ముతున్నాను. మా నాన్న చనిపోయేవరకు కూడా నాపై పెళ్లి ఒత్తిడి తీసుకురాలేదు. అలాగే మా అమ్మ కూడా ఈనాటికీ పెళ్లి చేసుకోమని అందరు అమ్మల్లా అడగనేలేదు. ఇది అక్షరసత్యం. సమాజంలో చాలామంది పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడికి తలొగ్గి చేసుకునేవారు ఎందరో. అదృష్టవశాత్తూ నేను మచ్చుకైనా అటువంటి ఇబ్బందిని ఎదుర్కోలేదు. పెళ్లి నా ఆసక్తి కానేకాదు. సాధుసూఫీల రక్తమే నాలో ఉప్పొంగుతుందని నేను నమ్ముతున్నాను. మన భారతీయ సాంప్రదాయవాదులు, సాధువులు, సూఫీ సాధువులు, అలాగే కాళిదాసు, రామదాసు, తులసీదాసు, గజానన బాబా… లాంటి సాధువుల రక్తమే నాది అంతా.

నేను సాధువుల మాదిరిగా ప్రపంచం అంతా తిరగాలని ఇంటర్మీడియట్‌ నాటికే నిశ్చయించుకున్నాను. నా బుక్‌లో కూడా ఇలా రాసుకున్నాను. ‘నేను సంసార జీవితానికి పనికి రానని, సంచార జీవితానికే సరిపోతాను. ఇంటర్మీడియట్‌లోనే తెలుసుకున్నాను.’ అని. అలా తెలుసుకోవడం వల్లే డిగ్రీ నాటికే సంగీతం, సాహిత్యం, వాస్తు, చిత్రకళ, కవిత్వాలలో ప్రపంచ సాహిత్యాన్నంతా చదివి పడేసాను. పుట్టుకతోనే నేనో ఆర్టిస్టును. ఆర్టిస్టును కాబట్టే నేను ఆర్ట్‌ చదువుకున్నాను. ఆ తరువాత ఆర్ట్‌ కంటే గొప్పది ప్రేమ అని తెలుసుకుని, ప్రేమతత్వం వైపు నా ప్రయాణం సాగించాను. అందుకే నా పుస్తకాల్లో ఆర్ట్‌, డ్రాయింగ్‌, పెయింటింగ్‌, మ్యూజిక్‌… అన్నీ ఉంటాయి. అవన్నీ కలగలిసి ఉన్నాయి గనుకే పాఠకుల మనసుకు నా పుస్తకాలు హత్తుకుపోయాయి.

ఏ ఒక్క ఆడపిల్ల అడగలేదు నన్ను
ప్రపంచాన్ని ఇంతగా చుట్టుముట్టి వస్తున్న నేను ఎన్నో అనుభవాలు సొంతం చేసుకున్నాను. ఇటువంటి అనుభవాలను స్వయంగా చవిచూసే ఆసక్తి ఉన్నవారి కోసం నిత్యం వెతుకుతూనే ఉంటాను. ఎన్నో దేశాల నుంచి ఎందరెందరో నాతో ప్రయాణించి ఆ అనుభూతులను సొంతం చేసుకున్నారు. ఒక్క భారతదేశం నుంచి తప్ప. మన దేశంలో యాత్రా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు తక్కువ. ప్రయాణాలు చేసే పురుషులే తక్కువ. అందునా మహిళల సంఖ్య మరీ మరీ తక్కువ. ఇటీవలే రష్యా ప్రయాణం ముగించుకుని వచ్చాను. అక్కడ రోజీ అనే మహిళ నాతో సమానంగా ప్రయాణించి ఎన్నో అనుభూతులను మూటగట్టుకుంది. కానీ, ఒక్క మనదేశంలోనే ఇప్పటిదాకా ఏ ఒక్క అమ్మాయి కానీ, మహిళ కానీ నాతో ప్రయాణిస్తానని అడగనేలేదు. అసలు నేను తిరిగినట్లుగా స్వేచ్ఛగా ప్రయాణం చేయడం మన దేశపు మహిళలకు ఎక్కడ సాధ్యమవుతుంది చెప్పండి. భారత్‌లో అన్ని రంగాలలో స్త్రీలు ఉన్నారు కానీ యాత్రారంగంలో మటుకు లేరు. అందుకే 2005లో ‘స్త్రీ యాత్రికులు’ అని పుస్తకం రాసాను.
మన పురాణేతిహాసాలలోనే ‘న స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని రాసి ఉంది. స్త్రీకి స్వాతంత్య్రం ఉంటే చెడి పోతుంది అనుకోవటం, నిరక్షరాస్యత, ఆస్తి అంతా మగవాడి చేతుల్లో ఉండటం, స్వతంత్రత కరువైపోవటం లాంటి ఎన్నో అంశాలను స్త్రీలు యాత్రికులుగా మారకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. అదే ఇతర దేశాల్లో అమెరికన్స్‌, జపనీస్‌, యూరోపియన్స్‌ దేశాలనుంచి మహిళా యాత్రికులు ఎందరో ఉన్నారు. ‘స్త్రీకి చేతిలో డబ్బు లేదు. ఆస్తిలో హక్కులేదు. పొద్దునలేస్తే ఇంటి పనంతా చేయాలి. ఆమెకంటూ ఒక టేబుల్‌ లేదు. ఒక చెయిర్‌ లేదు. అసలు ఆమెకు ఆలోచించుకునే వ్యవధి ఇవ్వని సమాజం మనది. ఇక వాళ్లు ప్రపంచ యాత్రకు వెళ్లేదెప్పుడు?’ ఈ సందర్భంగా ప్రపంచంలోని ఒక గొప్ప నాటకాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. దానిని నార్వే రచయిత హెన్రీ గిబ్సన్‌ రాసారు. ఆ నాటకం పేరు ‘డాల్స్‌ హౌస్‌’. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన నాటకం. అందుబాటులో ఉంటే వదులుకోకండి. ముఖ్యంగా ఆడవారు.

మోటో:
ప్రపంచం చాలా పాతది. కనీసం అయిదువేల సంవత్సరాల నాగరికత మనకు ఉంది. ఎందరో గొప్ప గొప్ప రాజులు, రాణులు, సిపాయిలు, సాధువులు, సన్యాసులు… ఎంతోమంది ఎన్నో గొప్ప మాటలు చెప్పారు. నేను వాటన్నింటినీ చదివి, జీర్ణం చేసుకునేసరికి ప్రయాణాలు చేయడమే ఉత్తమం అనిపించింది. మన భారతీయులకు యాత్రా సాహిత్యం తక్కువ. ఎలాగూ నాకు యాత్రా సాహిత్యం పట్ల మక్కువ పెరిగింది గనుక యాత్రా సాహిత్యాన్ని అభివృద్ధి చేయగలిగాను. అంటే నా యాత్రలు మాత్రమే కాకుండా ఇతరులు చేసిన యాత్రలకు గురించిన చరిత్రను పరిశోధిస్తూ వాటిని కూడా పుస్తకాలుగా తీసుకువస్తున్నాను. ప్రపంచంలోని గొప్ప గొప్ప యాత్రలను గురించి కూడా పాఠకులకు సమగ్రమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో పుస్తకాలు రాస్తున్నాను. ప్రయాణం గొప్పదయ్యా. అసలు ‘ప్రయాణాల వల్లనే ప్రపంచం పరిణామం చెందింది’ అని చెబుతాను. కొలంబస్‌, వాస్కో డ గామా… తదితరులు ఎందరో ప్రయాణాలు చేసారు గనుకే మనకు చరిత్ర పరిచయం అయింది.
మగవాళ్లలో బుద్ధిస్ట్‌ కాలం నుంచి పురుష యాత్రికులు ఉన్నారు. బౌద్ధ కాలంలో చైనా దాకా వెళ్లిన గొప్ప గొప్ప సాధువులు ఉన్నారు. ఆ తరువాత చెప్పుకోదగినవారుగా చరిత్రలో ఉన్నది ఏనుగుల వీరాస్వామి భారత దేశంలో మొట్టమొదటి జిప్సీ అని చెప్పవచ్చు. ఆయన 1830లో ఆయన కాశీ యాత్ర చేశారు. ఆయన యాత్రానుభవాల పుస్తకం 1836లో వచ్చింది. అంటే కాశీ మజిలీ కథలు 1940 ప్రాంతాల్లో పుట్టుకొచ్చాయి. కాశీమజిలీ కథలకంటే పురాతనమైనది ఏనుగుల వీరాస్వామి యాత్ర. అందుకే ఆయనను దేశంలోని మొట్టమొదటి యాత్రా నిర్మాత అని చెప్పవచ్చు. మానవుడు తన వంద సంవత్సరాల కాలంలో అద్భుతమైన పనులు చేయవచ్చు అనిపించింది. మనం కూడా ఒక గొప్పపని చేయాలని అనిపించింది. నాకు వచ్చిన అవకాశం యాత్రాసాహిత్యం అనుకున్నాను.

సంస్కృతి ఏదైనా గొప్పదే:
అన్నీ సమానమైనవే. మన బుద్ధిని బట్టి, మన మూడ్‌ను బట్టి అది తక్కువ, ఇది ఎక్కువ అంటారు. నలుపూ తెలుపూ, పసుపూ గోధుమ… అని పేర్లు పెడుతుంటాం. అది చాలా తప్పు. భూమి మీద అన్ని వర్ణాలు సమానం. అన్ని సంస్కృతులు గొప్పవే. మన శరీరంలో మనకు నచ్చని అవయవం అంటూ ఏదైనా ఉంటుందా? అలాగే ప్రపంచం కూడా. అన్ని సంస్కృతులు, సంప్రదాయాలను కలగలుపుకుని అవతరించినదే ప్రపంచం. ఒక దశకు వెళ్లినప్పుడు మనం కనుగొనేది ఇదే. నాలుగైదు దేశాలు తిరిగితే గొప్ప సంస్కృతి ఏది అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.
లెస్‌ లగేజ్‌… మోర్‌ కంఫర్ట్‌…
సామాన్యంగా నేను మోసే లగేజ్‌ ఆరేడు కిలోల కంటే ఎక్కువ ఉండదు. కెమెరా, మొబైల్‌ ఉంటుంది. ఒక ప్యాంటూ, రెండు టీ షర్టులు, ఒక పేపర్‌ కట్ట, ఒకటి రాసుకునే పుస్తకం, ఒకటి చదువుకునే పుస్తకం. ఇవి తప్పక నాతో ఉంటాయి. పేపర్లు కట్ట అంటే ఎ4 సైజ్‌ షీట్స్‌ అన్నమాట. అవి వంద పేపర్లు ఉంటాయి. వాటిల్లో నేను పెయింటింగ్స్‌ వేస్తుంటాను. విదేశాలకు వెళ్లేప్పుడు వాటిల్లో సగం సగం పెయింటింగ్స్‌ వేసుకుని తీసుకువెళ్తాను. ఎక్కడైతే నా బస ఏర్పాటు చేసుకోవాలనుకుంటానో అక్కడ మిగతా సగం పెయింటింగ్‌ను సందర్శకుల ముందు పూర్తి చేస్తుంటాను. దీని వలన ఆ పెయింటింగ్స్‌ నా సొంతమని వారికి అవగాహన ఏర్పడుతుంది. అలాగే ఆ ఆర్ట్‌పై గౌరవం ఉన్నవారు బస, ఆహార సౌకర్యాలు ఏర్పాటు చేసే అవకాశమూ ఉంటుంది. అవే నా హౌమ్‌ స్టేషన్స్‌. నేనెప్పుడూ హౌటళ్లలో, లాడ్జ్‌లలో బస చేయలేదు. అన్ని యాత్రలనూ ఇలాగే పూర్తి చేసాను. అది కూడా సుదీర్ఘకాలంపాటు కొనసాగిన యాత్రలు. శిల్పాలను కూడా చెక్కుతుంటాను. అవి ఎలా చేస్తానంటే… నేను పరిభ్రమిస్తున్న ప్రాంతాలలో ఎవరి ఇంటి ముందైనా అడుగు, రెండు అడుగుల రాళ్లు ఏవైనా పడిపోయి కనిపిస్తాయనుకోండి. వాళ్ల ఇంటిలో అందుబాటులో ఉన్న పనిముట్లతోనే వాటిని చెక్కి ఏ కుక్క బొమ్మనో, పిల్లి బొమ్మనో, పక్షినో చెక్కేసి వారికి బహుమతిగా అందిస్తాను. వారు కూడా ఎంతో సంతోషపడిపోతారు. నాకు చక్కని ఆహారంతోపాటు బస కూడా ఏర్పాటు చేస్తారు. అటువంటి ఆతిథ్యాలు నాకు ఎంతో బాగా నచ్చుతాయి. ఇవన్నీ కూడా ఇంటర్నెట్‌ ఉండటంతోనే వేగంగా సాధ్యమయ్యాయి. లేకపోతే ఇంతటి మహా ప్రపంచాన్ని తిరగగలిగేవాడినేనా?

ప్రయాణాలే నా ప్రాణవాయువులు
ఇప్పటి వరకూ వేల కిలోమీటర్లు ప్రయాణించాను. ప్రయాణాల్లో తలనొప్పి అనేది కూడా నాకు తెలియదు. ప్రయాణం అంటే చాలు నా శరీరం గాల్లో తేలినట్లుగా ఉంటుంది. అలసటే తెలియదు. ఎన్నో కిలోమీటర్లు నడిచాను. ఇప్పటిదాకా చెమటలు కక్కుతూ వెళ్లిన జ్ఞాపకంలేదు. ప్రయాణాలే నా ఆరోగ్య రహస్యం. అందుకే నా ప్రయాణాలను ఇలా కవిత్వీకరించాను. ‘నా ప్రాణాలు ప్రభువు చేతిలో లేవు // ప్రయాణాల చేతిలో ఉన్నాయి”.
ఇంకొక్క విషయం చెప్పి ముగిస్తాను ఫ్రెండ్స్‌. యాత్రా సాహిత్యాన్ని సృష్టించి 12 పుస్తకాలు రాసిన ఏకైక వ్యక్తిని నేనే కదా. కొందరు మితృలు నన్ను విచిత్రమైన ప్రశ్న అడుగుతుంటారు. ‘మీకు ప్రయాణాల్లో వారసులు ఎలా?’ అని. ఈ జీవితం ఒకరు నేర్పితే అబ్బే విద్య కాదు. నేర్పితే వచ్చే విద్యలు విశ్వ విద్యాలయాల్లో ఉంటాయి. అప్పట్లో సాధువులు, సూఫీలు ప్రపంచ వ్యాప్తంగా ‘మంచి’ అనే విత్తనాలు చల్లడానికే వచ్చారు. అటువంటి వారే నాకు ఆదర్శం. విశ్వమానవులు రాగద్వేషాలకు అతీతులుగా ఉంటారు.
(సెప్టెంబర్‌ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రపంచ పర్యాటకుడు ఆదినారాయణ యాత్రా పరిచయం)

నస్రీన్‌ ఖాన్‌
writernasreen@gmail.com

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -