‘ఆకెళ్ల’గా ప్రేక్షకులకు, పాఠకులకు సుపరి చితులైన ప్రముఖ రచయిత ఆకెళ్ల సూర్య నారాయణ (75) ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 80కి పైగా తెలుగు సినిమాలకు కథలు, మాటలను అందించిన ఆకెళ్ల 15 ఏళ్ల పాటు తెలుగు రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఆకెళ్ళ కథలు ఎక్కువగా మహిళల జీవితానికి సంబం ధించిన అంశాల ఇతివత్తంతో ప్రేక్షకులను బాగా అలరించాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో జానకీ, రామయ్య దంపతులకు ఆకెళ్ల జన్మించారు. 1960లో బాలరాముడి పాత్రతో నాటకరంగంలోకి అడుగు పెట్టారు. మొదటగా చందమామ, బాలమిత్ర పత్రికలకు కథలు రాసి పంపారు. డిగ్రీ పూర్తయిన తరువాత నవలలు రాయటం ఆరం భించారు. ఇప్పటివరకు సుమారు 200 కథలు, 20 నవలలను రచించారు. అలాగే టీవీ సీరియల్స్‌కి దాదాపుగా 800 ఎపిసోడ్స్ రాశారు. రేడియో నాటకాలూ రచన చేశారు. 1997లో తొలిసారిగా ‘కాకి ఎంగిలి’ అనే నాటకాన్ని రాశారు. తరువాత ‘అల్లసాని పెద్దన’, ‘రాణి రుద్రమ’, ‘రాణాప్రతాప్’ లాంటి చారిత్రక నాటకాలు రాశారు. ఆకెళ్ల రచయితగా పని చేసిన తొలి చిత్రం చిరంజీవి నటించిన ‘మగమహా రాజు’. ‘స్వాతిముత్యం, శ్రుతిలయలు, ఆడదే ఆధారం, సిరివెన్నెల, శ్రీమతి ఒక బహుమతి, నాగదేవత, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఓ భార్య కథ, ఆయనకి ఇద్దరు, చిలకపచ్చ కాపురం, ఔనన్నా కాదన్నా, ఎంత బావుందో’ చిత్రాలతో రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. నరేష్ నటించిన ‘అయ్యయ్యో బ్రహ్మయ్య’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఆకెళ్లను ఎన్నో అవార్డులు వరించాయి. విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, యువ చక్రపాణి, విజయ మాస పత్రిక అవార్డు, ‘కాకి ఎంగిలి’ నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. అలాగే 13 సార్లు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకోవడం విశేషం. ఆకెళ్లకు భార్య రామలక్ష్మీ, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆకెళ్ల అంత్యక్రియలు శనివారం హఫీజ్‌పేటలో నిర్వహించారు. ఆకెళ్ళ మృతి పట్ల తెలుగు సినీ రచయితల సంఘం సంతాపం తెలియజేసింది.
రచయిత ఆకెళ్ల కన్నుమూత
- Advertisement -
- Advertisement -