మూడు ముళ్ళతో ముడిపడి, ఏడడుగులతో జతపడి, అగ్నిసాక్షిగా ఒక్కటయ్యే అపురూప బంధం. వివాహ బంధం. మన భారతీయ సంప్రదాయంలో పెళ్ళి చాలా విశిష్టమైనది. వేదాలు, పురాణాలు కూడా పెళ్ళి వేడుకను గురించి చాలా గొప్పగా కీర్తించాయి. మహాకవులు, విద్వాంసులు, పండితులు కూడా పెళ్ళి గొప్పతనాన్ని పాటల్లో, పద్యాల్లో తెలియజేశారు. మన తెలుగు సినిమాల్లో కూడా పెళ్ళి గురించి చాలా పాటలు వచ్చాయి. అలాంటి పాటల్లోనిదే ఇది. ఈ మధ్య ఏ పెళ్ళి వేడుకకు వెళ్ళినా ఈ పాటే వినిపిస్తుంది. అంత అద్భుతంగా రాశాడు దినేశ్ గౌడ్ కక్కెర్ల. 2012 లో ధీరజ్ రాజు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళి పుస్తకం’ అనే లఘుచిత్రంలోని ఆ పాటనిపుడు చూద్దాం.
దినేశ్ గౌడ్ చురుకైన పాటలు రాస్తున్న యువ కెరటం. ఆయన రాసిన ఈ పెళ్ళిపాట ఆయన పాటల ప్రస్థానాన్ని ఓ మలుపు తిప్పింది. ఇది ఓ షార్ట్ ఫిల్మ్‌కి రాసిన పాట అయినా.. ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాట వల్ల ఆయనకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ తరువాత ఎన్నో సినిమాలకు పాటలు రాసే అవకాశం లభించింది.
పెళ్ళి చాలా పవిత్రమైన బంధం. కేవలం మూడు ముళ్ళతో, ఏడడుగులతో మాత్రమే ముడిపడేది కాదు. రెండు మనసులను ఒకటి చేస్తూనే రెండు కుటుంబాలను కూడా ఒకటి చేసే అపూర్వబంధం.. అని ఈ పాట చెబుతోంది.
పెళ్ళిపుస్తకం అని ఈ లఘు చిత్రానికి పెట్టిన పేరు పాతదే కావచ్చు. అది ఒక సినిమా పేరే కావచ్చు. కాని ఆ పుస్తకంలోని ప్రతి పుట నిత్యనూతనం. జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టసుఖాలను కలిసి పంచుకుంటూ రోజూ రోజూ నిత్యనూతనంగా తమను తాము నిర్మించుకోవాలని దంపతులకు సూచిస్తోంది పెళ్ళిపుస్తకం.
పెళ్ళి పీటల మీద కూర్చున్న అమ్మాయి మనస్సాక్షిగా, అగ్నిసాక్షిగా చెబుతోంది ఇలా.. తన ప్రాణాలు ఇక అబ్బాయివేనని.. అది ఎలా చెబుతోందంటే ధర్మేచగా… చెబుతోంది. తన మనసంతా ఆ అబ్బాయే ఉన్నాడని చెబుతోంది.. అది అర్థేచగా వ్యక్తం చేస్తోంది. తన ప్రేమంతా అబ్బాయేనని చెబుతోంది. అది కామేచగా స్పష్టమవుతోంది. హద్దులు లేని ప్రేమకై ఇద్దరు సాగుతున్నారు. అది మోక్షేచగా తేటతెల్లమవుతుంది. అంటే.. ధర్మార్థకామమోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాల సాక్షిగా.. తన ప్రాణాలను, తన మనసును, తన వలపును, అవధులు దాటిన ప్రేమను.. ఆ అబ్బాయికి అర్పించుకుంటోంది ఆ అమ్మాయి..
మూడు ముళ్ళతో, ఏడు అడుగులతో, అగ్నిసాక్షిగా ఇద్దరూ ఒకటిగా మారే అపురూపమైన, అన్యోన్యమైన, అనురాగబంధం.. ఈ పెళ్ళిబంధం.. మరుపేలేని సంతకమే పెళ్ళి అంటే.. నవదంపతులకు మరుజన్మనిచ్చేదే పెళ్ళి అంటే..
ప్రేమించి పెళ్ళి చేసుకుంటే అందులో ప్రేయసీ ప్రియుల ప్రేమ మాత్రమే కనబడుతుంది. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకుని, ఇష్టపడి చేసుకుంటారు కాబట్టి. అందులో పెద్దవాళ్ళ ప్రమేయం ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళకు సంబంధం ఉండదు. అదే తల్లిదండ్రులు, బంధువులు, పెద్దలు, మిత్రులు అందరూ కలిసి చేసిన పెళ్ళే నిజమైన పెళ్ళి అనే సందేశం ఈ పాటలో నిండుగా కనబడుతోంది. కన్నవాళ్ళ ఆశలతో పాటు బంధుమిత్రులు, కనపడని ఆ దేవతల ఆశీస్సులు కలిసి మన మీద అక్షింతలు కురియడమే పెళ్ళంటే.. ఒకరినొకరు ప్రాణబంధంగా పెనవేసుకోవడమే పెళ్ళంటే అని చెబుతున్నాడు కవి. నువ్వు నేను అనే మాటను మనం అనే మాటగా మార్చేదే పెళ్ళి అని ఈ పాట తెలియజేస్తోంది.
తోడుగా, నీడగా, ఒకరి కోసం ఒకరంటూ, ఒకరివెంట ఒకరంటూ శాశ్వతంగా ఈ జగమంతా మనమే అంటూ నవదంపతులను సరికొత్త జగానికి, సరికొత్త జీవితానికి ఆహ్వానించేదే పెళ్ళని ఈ పాట ద్వారా తెలియజేశాడు గీతరచయిత దినేశ్ గౌడ్ .
వివాహబంధాన్ని గురించి మహోన్నతంగా చాటి చెప్పిన పాట ఇది. వంశీకష్ణ సంగీతం, సురేంద్రనాథ్ ఎన్.జె, దీపు పార్థసారధిల గానం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పాట:
తన ప్రాణాలే నీవనీ ధర్మేచగా/తన మనసంత నీదనీ అర్థేచగా/తన వలపంత నీకనీ కామేచగా
అవధులు లేని ప్రేమకై మోక్షేచగా/ మూడు ముళ్ళతో ఏడు అడుగులా/ అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారెగా/ మరుపే లేని సంతకం, పెళ్లి పుస్తకం/ మరుజన్మకి తొలి స్వాగతం, పెళ్లి పుస్తకం/ ప్రేమ పెళ్లి పేరులో/ ఇరువురిలోన ప్రేమ మాత్రమే/ బంధు మిత్రు ప్రేమలే కలిసిననాడేలె పెళ్లనగా/కన్నవాళ్ళ ఆశలే/ కలిసిన స్వర్గలోక దీవేనే నువ్వు నేను మాటనే/ మార్చే మాటే ఈ పెళ్లనగా/ తోడు నీడగా, ప్రాణ బంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమికా/ మరుపే లేని సంతకం పెళ్లి పుస్తకం/ మరుజన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం.
డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682