మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులతో చర్చ
”జూలు దులిపిన సింహాల్లారా/ వేలాదిగా లేవండి../ నేలను విదిలించండి శృంఖలాలను/ నిదురలో మీపైబడ్డ మంచు బిందువులవి/ ఘన సమూహం మీరు/ వాళ్లెంత పిడికెడే!”
పి. షెల్లీ రాసిన ఈ నాలుగు లైన్లు సరిగా అర్థం చేసుకోండర్రా! ఇంగ్లీషు పిచ్చి బాగా వున్న సోషల్ అధ్యాపకుడు అంటున్నప్పుడే తన ముందు కూచున్న సింహాలు, సివంగులు పుస్తకం చదివి మాంచి ఆవేశంగా వున్నాయి. ఆచార్యుల వారు తాను అసైన్‌మెంట్ ఇచ్చి వారం అయిన సందర్భంలో ప్రబీర్ అనుభవాల పుస్తకంపై సాగే చర్చ యిది. తన విద్యార్థుల గాండ్రింపులు వింటుంటే రచయిత ధన్యుడైనట్లే అనిపించింది గురువుగారికి. ఏడాది క్రితం పుస్తకంపై ఇప్పుడు చర్చ ఎందుకు పెట్టారని ఎవరైనా అడుగుతారనుకున్నాడు రామానుజాచార్యులు. ఆ పని ఎవరూ చేయలేదు. రచయిత జీవితమంతా నిరంకుశత్వంపై పోరాడారు. ఆయన విద్యార్థి దశలో కాంగ్రెస్ పాలన – ఎమర్జెనీ. ఆయన మీడియా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేటి ‘అప్రకటిత’ ఎమర్జెన్సీలో ఇంకా ముగియని కాషాయ దాష్టీకం! ఈ రెండు సందర్భాల్లో ఆయనెదుర్కొన్న శిక్షలే ఈ ‘పెద్దబాలశిక్ష’లో వున్నాయన్నారు రామానుజాచార్యులవారు పిలక సవరించుకుంటూ! ఆయన శ్తోత్రియుడే గాని దేవుడ్ని, మతాన్ని రాజకీయాల్లోకి లాగేవారంటే చెడ్డ చిరాకు. ద్వేషం కూడానూ. బహుశా దాశరథి సోదరుల వారసత్వం కావచ్చు.
ఆచారి : మై బాప్ సర్కార్ అనే మాట ఏ సందర్భంలో ఎందుకు వాడారు రచయిత?
ఖాదర్ వలీ : ఎమర్జెన్సీ కాలంలో ‘మీసా’, మోడీ కాలంలో ‘ఉపా’ వంటి అనాగరిక చట్టాల వినియోగం, పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు, ప్రజల గొంతుకలు నొక్కడం, అందుకు న్యాయ వ్యవస్థను ఉపయోగించడం, ప్రభుత్వ వ్యవహారాలు చూసేవారే ప్రజావసరాలు తీరుస్తారని చెప్పేదాన్నే ‘మై బాప్ సర్కార్’ అన్నాడు ప్రబీర్ సాబ్. 1967 చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టాన్ని 2019లో సవరించడానికి మరిన్ని కోరలు తొడిగింది మోడీ సర్కార్! నేరారోపణ ఎదుర్కొనే వ్యక్తే దాన్ని రుజువు చేసుకోవాలట. బెయిల్ ఒక నియమంగా కాక ఒక మినహాయింపుగా వుండేలా మార్చారు. బీమా కోరేగావ్ కేసే దీనికి ఉదాహరణ అన్నాడు. బట్టీ పట్టినట్లు ఠకఠకా చెప్పాడు ఖాదర్‌వలీ! వాడి అధ్యయనం ఎంత లోతుగా వుండో తెల్సుకోవడానికి ‘ప్రస్తుతం వేధింపులు ఏ స్థాయిలో సాగుతున్నాయిరా?’ అన్నాడు ఆచార్యులవారు.
ఖాదర్ : ఎమర్జెన్సీ ఒకటికి రెండుకు మధ్య కీలక తేడా ఆనాడు ఖాత్ర పరిషత్, సంజరుగాంధీ గూండా ముఠాలుండేవి. వాటికి ప్రత్యేక సైద్ధాంతిక పునాది లేదు. ప్రత్యర్థులపై దాడి తప్ప! ఇప్పుడలా కాదు. క్షేత్రస్థాయిలో డాక్టర్ ధబోల్కర్ నుండి గౌరీ లంకేష్ వరకు బుల్లెట్లకు బలిచేయడం, ప్రశ్నను కంట్రోల్ చేయడం, గోరక్షకులు కొందర్ని హత్య చేయడం, సాంస్కృతిక పోలీసింగ్ విస్తృతం కావడం, సోషల్ మీడియాలో పచ్చిగా బూతులు విచ్చలవిడిగా పెరిగాయి. దీనికి ‘వాహినీలు, సేనలు’ వున్నాయి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. మున్సిపల్ చట్టాలు దాటరనే పేరున ఆస్తుల విధ్వంసం బుల్డోజర్ రాజ్యాలు నడుస్తున్నాయి.
ఆచార్య : శెభాష్! బాగా స్టడీ చేశావురా! అని భుజం తట్టాడు.
ఆడపిల్లలు ఏపాటి చదివారో తెల్సుకునేందుకు సుభాషిణీ! లేమ్మా! ఇంకో కీలక తేడా వుందని రాశాడు ప్రబీర్ సాబ్! అదేంటి?
సుభాషిణి : దేశంలోని ప్రధాన స్రవంతి మీడియా పైన ఖాదర్ చెప్పిన వాటికి తోడు, అవన్నీ చేయడం కరక్టే కదా అనుకునేలా చేస్తోంది. అవన్నీ నేటి సమాజంలో ‘కామన్ సెన్స్’ పాయింట్లయిపోయేలా చేస్తోంది. నేటి కాషాయ నెట్‌వర్కింగ్ వీటికి ఆమోదం వచ్చేలా చేస్తోంది. ప్రబీర్ సార్ మాటల్లో ‘రాజ్యాధికారానికి తోడుగా ప్రణాళికాబద్దమైన శక్తి ఒకటి పెరిగింది. ఈ శక్తి ప్రజల నుండి వచ్చే ఏ ప్రతిఘటననైనా ఎదుర్కొంటుంది. మతం ఆధారంగా కొందరు భారతీయులను పౌరసత్వం నుండి మినహాయించడమే ఆ శక్తుల లక్ష్యం’ అన్నాడు. ‘1975లో ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ఆ పని చేయలేదు. కాని నేటి అప్రకటిత ఎమర్జెన్సీలో ఆర్‌ఎస్‌ఎస్ ఆ పని శక్తివంతంగా చేస్తోంది. అప్పటికీ ఇప్పటికీ ప్రధాన తేడా ఏమంటే మన దేశ లౌకిక లక్షణాలపైనా, సంస్కృతిపైనా, విద్యపైనా, సైన్స్‌పైనా, హేతుబద్దతపైనా నిరంతరం దాడులు జరుగుతున్నాయి. ఇంతకన్నా తేడాలేమి కావాలిసార్? అంది రొప్పుతూ!
ఒకరికంటే ఒకరు పుస్తకాన్ని బాగా అధ్యయనం చేసినందుకు లోలోన సంతోషించిన రామానుజాచార్యులవారు ‘మీలో కొందరు విద్యార్థిసంఘాల్లో పనిచేస్తున్నారు కదా! వాటి నిర్వహణ ఎలా వుండాలని చెప్పారు ప్రబీర్‌సాబ్?
రాంబాబు : అసలు ఏ సంఘమైనా వారి జనం సమస్యలపై పనిచేస్తేనే చాలదని ఆచరణలో చెప్పారు. జెఎన్‌యు విద్యార్థిసంఘం హాస్టళ్లు, మెరుగైన భోజన వసతి వంటి వాటితో పాటు కార్మికులు, మహిళలు, దళితులు, ఆదివాసీల సమస్యలపై కూడా పోరాడింది. 1974 రైల్వే కార్మికులు 20 రోజుల సమ్మెకు సంఘీభావంగా నిలిచారు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ముందు పీఠిన నిలిచారు. అందుకేగా ప్రబీర్‌సాబ్‌కు అన్ని కష్టాలు. మనముందుకు మీరన్న ‘పెద్దబాలశిక్ష’! అంటూ నవ్వాడు.
ఆచార్య : ఈ పుస్తకం చదివిన తర్వాత మీకు అర్థమైన ఒక కీలకాంశం చెప్పండ్రా! అని అడగ్గానే శామ్యూల్ అనే దళిత విద్యార్థి లేచాడు.
శామ్యూల్ : గత పదేళ్లుగా ప్రతి జూన్ 25/ 26కి మోడీగారు ఎమర్జెన్సీ దారుణాలపై ‘ఊక’ దంచుతూనే వున్నా కాంగ్రెస్ ప్రధాన నాయకులెందుకు చప్పుడు చేస్తలేరో ఈ బుక్ బాగా వివరించింది సార్. ఆనాటి ఎమర్జెన్సీ విషయాలే దీన్లో ప్రధానంగా రాశారు. ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే దేశంలో ఇన్ని దుర్మార్గాలు జరిగాయా అని కళ్లకు కట్టినట్టుగా రాశారు రచయిత. వామపక్ష ఉద్యమ కేంద్రమైన జెఎన్‌యు పై ఆనాడు కాంగ్రెస్ దాడి, ఈనాడు బిజెపి దాడి, పాలకుల స్వభావం అర్థమవుతోంది కదా సార్!
ఆచార్య : మీకర్థం కావాల్సిన కీలక విషయమేమంటే ఇది ఇందిరాగాంధీ, మోడీల సొంత విషయం కాదు. వాళ్లిద్దరూ ప్రాతినిథ్యం వహించే వర్గాల కోసమే ఇదంతా! దీన్ని మర్చిపోవద్దు’ అంటూ అసలు విషయం చెప్పారు.
ఖాదర్ : ఇంకో ముఖ్యమైన విషయం కూడా వుంది సార్ దీన్లో. ‘నిర్భంధం’ గురించి, అది కోరలు చాచిన తీరు గురించి ఈ పుస్తకం నిండా ఎక్కడపడ్తే అక్కడ ఉంది సార్! నేరస్థులు మరుగుదొడ్లను తమ చేతుల్తో తామే శుభ్రం చేసుకున్నారని ప్రబీర్ సార్ రాసింది చదివితే అంత విద్యాధికులకే ఆ స్థితి వుంటే ఇంక మాలాంటి వాళ్లు దేనికైనా తెగించే వుండాలి. ఆరోజుల్లో ఏ అధికారం లేని సంజరుగాంధీ ముఠా పేరు రాకుండా ‘ప్రధాన కార్యాలయం’ అనేవారని ప్రబీర్‌సార్ రాశారు. నేడు ‘నాగపూర్ముఠా పేరు రావాల్సిన అవసరం లేకుండా అజిత్ దోవల్ వంటి వారంతా అధికార యంత్రాంగమంతా వెదజల్లబడి వున్నారు. ఈ పుస్తకంలో కేవలం దాడుల గురించే రాయలేదు సార్. ప్రతిఘటన గురించి కూడా రాశారు. రాజకీయాల్లో కూడా న్యూటన్ 3వ సూత్రం పనిచేస్తుందని అర్థమైంది సార్ ఈ పుస్తకం చదివితే!
‘1977 ఎన్నికలు – ఎమర్జెన్సీ ఓటమి’ దాదాపు పుస్తకం ముగింపులో చదివిన తర్వాత ప్రబీర్ సార్ రాసినట్లు నిజంగా పీడకల చెదిరిపోయినట్లయి మనసుకు ప్రశాంతత వస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ మోసపూరిత విధానాలు, వాజ్‌పేరు ఇందిరాగాంధీతో జరిపిన చాణక్యనీతి రీతులు ఈ పుస్తకంలో నుండి దొరికే అదనపు సమాచారం. ఏమైనా చివర్లో రాసిన ‘ఆసక్తికరమైన రోజుల్లో నీవు జీవింతువుగాక’ అనే పాత చైనా శాపం ప్రబీర్‌సార్ గుర్తు చేస్తాడు మనకి! అంటే కథ ముగియలేదు! సశేషం…!
సుధా భాస్కర్, 9490098025