ఏదీ అంత త్వరగా అర్థం కాదు
శక్తులు యుక్తులు అల్పమో అనల్పమో..
కొన్ని గాయాలు
ఏ లేపనానికీ మానవు
అవి జీవితకాలం సలుపుతూ
గుణపాఠాల్ని నేర్పుతూ వుంటాయి
కాలం చాలా విచిత్రమైంది
బలీయమైంది కూడానూ
నదిలో సాగిన నీటి ప్రవాహంలా
ఇసుకను.. రాళ్లను రప్పల్ని తడుముతూ
ప్రవహిస్తూనే వుండాలి పల్లానికి
తిరోగమనమో.. పురోగమనమో
కొన్ని మెలుకువ చూపులు
కొన్ని మెలుకువల నడవడులు
కొత్త పుంతల్ని తొక్కిస్తాయి
కొత్త జాగ్రత్తల్ని నేర్పిస్తాయి
కళ్ళను మోసం చేసే నిజాలు
నిజాల్ని అబద్ధాలుగా మార్చే మోసాలు
వెంట్రుక సన్నని…. కంటికి ఆనని
కళా నైపుణ్య దగాలు
శిఖరాన్ని అందుకున్న ఆనందం
ఎంతోకాలం నిలవక పోవటం
ఏ తప్పిదమే తెలుసుకునే లోపే
నేలకు జారి మనసంతా
విలవిల్లాడి పోవటం
ఒకానొక సహజ సంధీ కాలం
చూస్తూ..చూస్తూండగానే
పగళ్లు పగిలిపోయి
చీకట్లు చిమ్ముకొచ్చినట్టు
పచ్చని ప్రకతిలో వికతి తాండవించవచ్చు
అయినా ఇసుమంత చోటుదక్కినా
పెల్లుబుకే సత్య స్వరం ఆగదు
ఏదేమైనా… ఒక్కటి నిజం
ప్రాణం ఉన్నా లేకున్నా..
నేను రేపటి తరానికి శిలాక్షరాన్ని
నువ్వు మట్టిలో మట్టైపోయే
ధూళి కణానివి..!
- డా.కటుకోఝ్వల రమేష్, 9949083327