కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర
దుర్మార్గ చట్టాలను తెచ్చిన మోడీ సర్కార్
సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గం : కార్మికుల ప్రదర్శనలో సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రవాణా రంగ కార్మికుల పొట్ట కొట్టే విధంగా మోడీ విధానాలున్నాయనీ, కష్టజీవుల కడుపులు కొట్టి కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు తెలంగాణ పబ్లిక్, ప్రయివేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. నగర కార్యదర్శి కె అజయ్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వీరయ్య మాట్లాడుతూ రోడ్డు రవాణా డ్రైవర్లకు సామాజిక సంక్షేమ బోర్డు ఏర్పాటు, సెక్షన్ 106 (1)(2), మోటారు ట్రాన్స్‌పోర్టు సవరణ చట్టం 2019, జీవో 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్ తరహా ప్రత్యామ్నాయ యాప్ ఏర్పాటు, పెట్రోల్, డీజిల్‌లో పన్ను మినహాయింపును రవాణా రంగ కార్మికులకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. గతంలో ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమైతే గరిష్టంగా రెండేండ్లు శిక్ష ఉండేదని, ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సెక్షన్ 106 (1) (2) ప్రకారం పదేండ్లు జైలు, రూ. ఏడు లక్షల జరిమానా విధించేలా నిబంధనలు తయారు చేసిందని చెప్పారు. ఇప్పటివరకు ప్రమాదాలు జరిగిన వెంటనే స్టేషన్‌లోనే బెయిల్ తీసుకునే అవకాశం ఉండేదనీ, కొత్త చట్టంలోని నిబంధనల వల్ల కోర్టులో బెయిల్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో జీఓ 21 మోటారు ట్రాన్స్‌పోర్టు చట్టంలో భారీగా జరిమానాలు పెంచినా ప్రమాదాలు తగ్గలేదు సరికదా 2022లో ప్రమాదాలు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయని తెలిపారు.
ప్రమాదాలకు అసలు కారణాలను పరిష్కరించకుండా, శిక్షలు పెంచితే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పడం మోసగించడమేనని విమర్శించారు. ప్రభుత్వాలకు మోటారు కార్మికుల ద్వారా రూ.లక్షల కోట్లు వస్తున్నా, వారి సంక్షేమానికి ఎటువంటి చట్టమూ లేదన్నారు. కార్మికులకు రక్షణ కల్పించేలా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల తరహాలో సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయాలని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ , రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. వారిని కదిలించేందుకు కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపుని చ్చారు. మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకొచ్చి కార్మిక వర్గ మెడకు ఉరితాడు బిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మోటార్ వాహనాల చట్టం 2019లో అగ్రిగేటర్స్‌కి ప్రవేశం కల్పించారని చెప్పారు. సింగిల్ ఓనర్ కమ్ డ్రైవర్లు లేకుండా డ్రైవర్లందరూ ఆన్‌లైన్‌లోకి తప్పనిసరిగా అడాప్ట్ అయ్యేలా పరిస్థితులు సృష్టిస్తున్నారని తెలిపారు. దీనివల్ల రాబోయే కాలంలో సింగిల్ ఓనర్ కమ్ డ్రైవర్లు స్వతంత్రంగా కనబడకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైఖరిపై రవాణా రంగంలోని కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించి పరిస్థితులు తమకనుకూలంగా మారేలా పోరాటం నిర్వహించాలని సూచించారు.
కేరళ ప్రభుత్వం డ్రైవర్ల కోసం సవారీ ఆఫ్ తీసుకొచ్చి 8 శాతం కమీషన్ తీసుకుంటుందని ఆ కమీషన్‌లో ఆరు శాతం తిరిగి మళ్లీ బోర్డుకి డ్రైవర్ల సంక్షేమానికే కేటాయిస్తుందని ఈ విధంగా మిగిలిన ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయని ప్రశ్నించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్ర మహాసభల్లో ఈ విషయాల మీద కూడా చర్చలు జరిపి కర్తవ్యం రూపొందిస్తామని తెలియజేశారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రేడింగ్ సంఘాలతో చర్చలు కూడా జరి పారని తెలిపారు. కానీ ఇప్పటివరకు దాని మీద చేయలేదని చెప్పారు. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టే అర్థమ వుతోందని తెలిపారు. ఆన్‌లైన్ సంస్థల దోపిడీని అరికట్టాలని కార్మిక వర్గం కోరుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వారికి సాగిల పడుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బిజినెస్ పీక్ అవర్‌లో 20 వరకు చార్జీలు పెంచుకోవచ్చు అని అనుమతి ఇచ్చిందనీ, ఇది దేనికి సంకేతం అని? ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకారా యాప్ తీసుకొస్తామని ఘనంగా ప్రకటించిందని, కానీ ఇంతవరకు దానికి విధివిధానాలు రూపొందించలేదని చెప్పారు. వెంటనే యాప్ తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో సీఐటీయూ నగర అధ్యక్షులు కుమార్ స్వామి, సౌత్ కమిటీ కార్యదర్శి శ్రావణ్ కుమార్ ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ సౌత్ కమిటీ కార్యదర్శి ఎల్ కోటయ్య, బాబర్ ఖాన్, సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఉమేష్ రెడ్డి, నగర నాయకులు జి రాములు, జంగయ్య, ఎండి కలీం సాబీర్ ముఖేష్ శర్మ మాజీద్ గౌస్, శ్యామ్, కోటి ,మోయిన్, విష్ణు, అర్బాజ్ ఖాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
రవాణారంగ కార్మికుల పొట్టకొట్టొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES