– యూజీసీ నిబంధనలకు అనుగుణంగా లేదంటున్న ఉన్నత విద్యామండలి
– సక్రమమేనంటున్న విద్యాశాఖ
– అభాసుపాలవుతున్న సర్కార్
– అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యాశాఖలో జీవో 21 చిచ్చు రేపుతోంది. ఉన్నత విద్యామండలి-విద్యాశాఖ మధ్య కోల్డ్‌వార్‌కు కారణమవుతోంది. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారే తప్ప, సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారం దిశగా అడుగులు పడట్లేదు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఏ రేవంత్‌రెడ్డి జోక్యంచేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యేలా కనిపించట్లేదు. ఈ వివాదం వల్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే… విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నాలుగో తేదీన విడుదల చేసింది. ఇందులో అకడమిక్, పరిశోధనల పనితీరుకు 50 శాతం వెయిటేజీ మార్కులను ఇవ్వాలని ప్రకటించింది. పీహెచ్‌డీ ఉంటే (యూజీసీ నిబంధనల ప్రకారం) 10 మార్కులుంటాయని పేర్కొంటూ జీవో 21 విడుదల చేశారు. అయితే యూజీసీ మాత్రం 30 మార్కులను ప్రకటించింది. జేఆర్‌ఎఫ్, నెట్, సెట్ ఉంటే ఏడు మార్కులుంటాయని యూజీసీ ప్రకటించింది.
యూజీసీ/సీఎస్‌ఐఆర్, జేఆర్‌ఎఫ్ ఉంటే పది మార్కులు, యూజీసీ నెట్, స్లెట్, సెట్ ఉంటే ఐదు మార్కులుంటాయని 21 జీవోలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంఫిల్‌కు సంబంధించి 60 శాతానికి పైగా మార్కులు ఉంటే ఏడు మార్కులు, 55 నుంచి 60 శాతంలోపు ఉంటే ఐదు మార్కుల ను యూజీసీ కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 21 జీవోలో ఎంఫిల్ ఉంటే ఐదు మార్కులుంటాయని ప్రకటించింది. ఇలా కొన్ని అంశాల్లో యూజీసీ నిబంధనలకు, జీవో 21లోని అంశాలకు తేడాలున్నాయి. అయితే రాష్ట్రంలోని 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు సంబంధించి 2,817 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో 757 (26.87 శాతం) మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే పనిచేస్తున్నారు. 2,060 (73.13 శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 60 నుంచి 65 ఏండ్లకు పెంచింది. దీంతో ఉద్యోగ విరమణ ప్రక్రియ ఆగిపోయింది.
జీవో 21 మారిస్తేనే ఉపయోగం : బాలకిష్టారెడ్డి
ఈనెల 12న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన వీసీల సమావేశంలో జీవో 21 సవరించాలని నిర్ణయించామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా లేకుంటే కోర్టును ఎవరైనా ఆశ్రయిస్తే ఆ జీవో నిలవబోదని స్పష్టం చేశారు. తెలిసి కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదనీ, ప్రక్రియ ప్రారంభం కాలేదని చెప్పారు. జీవో 21 విడుదల చేశాక అనేక మంది ఆ జీవోను మార్చాలంటూ విజ్ఞప్తులు చేశారని తెలిపారు. జీవోను మార్చాలనీ, లేదంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని అభిప్రాయ పడ్డారు. ఇప్పటికే టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణపై కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నదని చెప్పారు. తెలిసి కూడా జీవో 21 సవరించకుంటే కోర్టు తప్పుపడుతుందనీ, అందువల్ల ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
కోర్టుకు వెళ్తే మా వాదనలు వినిపిస్తాం : యోగితారాణా
విశ్వవిద్యాలయాల వీసీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ)లు ఆమోదించిన తర్వాతే జీవో 21 ని ప్రభుత్వం విడుదల చేసిందని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వీసీలు వివరించారని గుర్తు చేశారు. అయితే యూజీసీలో ఉన్న అన్ని నిబంధనలూ పాటించాల్సిన అవసరం లేదనీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ఇష్టప్రకారం మార్గదర్శకాలను రూపొందించుకోవచ్చని చెప్పారు. జీవో 21 సవరించాల్సిన అవసరం లేదన్నారు. జీవో 21 ను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తే ప్రభుత్వం నుంచి తమ వాదనలు వినిపిస్తామని స్పష్టం చేశారు.
విద్యాశాఖలో జీవో 21 చిచ్చు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES