– వార్షిక రుసుం పెంచిన అమెరికా
– ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం
– రేపటి నుంచి అమల్లోకి
– భారతీయులకు కష్టకాలం
విదేశీ నిపుణులకు అమెరికా ఇచ్చే హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకం చేశారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసా రుసుము నిర్ణీత కాలాన్ని బట్టి రెండు వేల డాలర్ల నుంచి ఐదు వేల డాలర్ల వరకు ఉంది. దీన్ని ఒకేసారి లక్ష డాలర్లకు పెంచేశారు. అంటే భారతదేశం నుంచి రీసెర్చ్, నైపుణ్య ఉద్యోగాల కోసం వెళ్లే వారు భారత కరెన్సీలో హెచ్-1బీ వీసా కోసం అక్షరాలా రూ.88 లక్షలు చెల్లించాలి. దీనికి ఆయా ఏజెన్సీల ఫీజులు ఇతరత్రా కలిపి మొత్తంగా ఏడాదికి దాదాపు కోటి రూపాయలు చెల్లిస్తే తప్ప అమెరికాలో కాలుపెట్టలేరు.
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాను రెండు నుంచి ఆరేండ్ల వరకు ఇస్తారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశం సహా ప్రపంచదేశాలన్నింటికీ శరాఘాతమే. ముఖ్యంగా ఐటీ కంపెనీలకు గడ్డుకాలం ఎదురైనట్టే. అమెరికాలో హెచ్-1బీ వీసాల మీద దాదాపు 71 శాతం మంది భారతీయులు పనిచేస్తున్నట్టు అంచనా. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం భారత్‌తో పాటు, చైనాపెనాౖ తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు యూఎస్ కామర్స్ సెక్రటరీ హౌవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించామన్నారు. ఆయా కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే అమెరికాలోని గొప్ప యూనివర్సిటీల నుంచి ఇటీవల పట్టభద్రులైన స్వదేశీయులకు ఇవ్వాలనీ, మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలనీ ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్-1బీ వీసా తీసుకొచ్చారు. యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. వీటిని మూడు నుంచి ఆరేండ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందరాÄ్భల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మార నుంది. అమెరికా ఏటా 85వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. మరో వైపు ట్రంప్ గోల్డ్‌కార్డును సైతం ప్రకటించారు. దీని విలువను 10 లక్షల డాలర్లుగా ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికాకు వంద బిలియన్ డాలర్ల ఆదాయం సమకూ రుతుందనీ, ఆ నిధులతో పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాల చెల్లింపుల వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పుకొ చ్చారు. హెచ్-1బీ వీసా లక్ష్యం దుర్విని యోగం అవుతోందనీ, తమకు నాణ్యత కలిగిన నిపుణులు మాత్రమే కావాలనీ, అందు వల్లే వార్షిక ఫీజును పెంచా మని ట్రంప్ చెప్పారు. హెచ్-1బీ వీసాలు అమె రికా ఉద్యోగుల పాలిట శాపంగా మారాయని చాలా కాలంగా ఆ దేశంలో ఆందోళ నలున్నాయి. అయితే ప్రపంచ దేశా లకు చెందిన నిపుణులను ఆకర్షిం చడానికి ఈ కార్యక్రమం దోహదపడుతోందని ఒకప్పటి ట్రంప్ మద్దతుదారుడైన ఎలన్ మస్క్ సహా పలువురు అభిప్రాయపడ్డారు.
నిర్ణయం కంపెనీదే
ట్రంప్ ఆదేశాలు ఆదివారం నుంచి అమలులోకి వస్తాయి. ఇది కొత్త అభ్యర్థనలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే కంపెనీలు ప్రతి దరఖాస్తుదారు కోసం ఆరు సంవత్సరాల పాటు అంతే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుం దని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ తెలిపారు. ప్రభుత్వానికి ఏటా లక్ష డాలర్లు చెల్లించి ఆ ఉద్యోగిని అట్టే పెట్టుకోవాలా లేక అతనిని స్వదేశానికి తిప్పి పంపాలా లేక అతని స్థానంలో అమెరికా ఉద్యోగిని తీసుకోవాలా అనేది కంపెనీయే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 2004 నుంచి హెచ్-1బీ దరఖాస్తుల సంఖ్యను అమెరికా ఏడాదికి 85 వేలకు పరిమితం చేస్తోంది.
చిన్న, స్టార్టప్ కంపెనీలకు శరాఘాతం
అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) అందించిన డేటా ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య 3,59,000కు పడిపోయే అవకాశం ఉంది. ఇది నాలుగు సంవత్సరాల కనిష్ట సంఖ్య. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమం కింద అమెజాన్ ఎక్కువగా ప్రయోజనం పొందింది. టెక్ కంపెనీలైన టాటా, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు కూడా లబ్ది పొందాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే చిన్న వ్యాపార సంస్థలు, స్టార్టప్ కంపెనీలకు ట్రంప్ నిర్ణయం శరాఘాతమని వాట్సన్ ఇమ్మిగ్రేషన్ లా సంస్థకు చెందిన ఫౌండింగ్ అటర్నీ తెహ్మినా వాట్సన్ చెప్పారు. లక్ష డాలర్ల వార్షిక ఫీజు ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె తెలిపారు. చిన్న, మధ్య తరహా కంపెనీలు ఉద్యోగులను నియమించుకోలేక చేతులెత్తేస్తాయని అన్నారు. లక్ష డాలర్ల ఫీజు టెక్ రంగంలోనూ, అన్ని పరిశ్రమలలోనూ అమెరికా పోటీతత్వానికి అవరోధాలు సృష్టిస్తుందని కొందరు నిపుణులు చెప్పారు. కొన్ని కంపెనీలు అమెరికా వెలుపల కార్యకలాపాలు నిర్వహించే అవకాశం లేకపోలేదనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి.
ఇక ట్రంప్ కార్డులు
విదేశీ ఉద్యోగుల హెచ్-1బీ వీసా వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచాలన్న ట్రంప్ నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువ మంది భారతీయులు అమెరికా టెక్ కంపెనీలు, ఇతర సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అనేక యూరోపియన్ దేశాల్లో సర్వసాధారణమైన ఇన్వెస్టర్ వీసా ఫీజు కూడా సంవత్సరానికి 10 వేల డాలర్ల నుంచి 20వేల డాలర్ల వరకు పెరుగుతుంది. ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్‌ని కూడా ప్రకటించింది. ఇందులో వ్యక్తులకు ట్రంప్ గోల్డ్ కార్డ్, ట్రంప్ ప్లాటినమ్ కార్డ్, వ్యాపారాలకు ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్ ఉంటాయి. ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, ఆర్టిస్టులు, అథ్లెట్లు సహా పౌరసత్వానికి బాటలు వేసే ఉద్యోగ ఆధారిత వీసాల స్థానంలో ఈ కార్డులను ప్రవేశపెడతారు. ట్రంప్ గోల్డ్ కార్డు ధర మిలియన్ డాలర్లు. ఈ కార్డు ఉన్న వారు అమెరికాలో ఎక్కడైనా దానిని ఉపయోగించుకోవచ్చు. ట్రంప్ ప్లాటినమ్ కార్డు ధర ఐదు మిలియన్ డాలర్లు. ఈ కార్డు ఉన్న వారు అమెరికా యేతర ఆదాయంపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశంలో 270 రోజులు ఉండవచ్చు. ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డు ధర రెండు మిలియన్ డాలర్లు. ఈ కార్డును కొంత ఫీజుతో ఒక ఉద్యోగి నుంచి మరో ఉద్యోగికి బదిలీ చేయవచ్చు.
వీసా భారంతో ప్రధాన నష్టాలు
ఐటీ కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం భారతీయులకు యూఎస్‌లో ఉద్యోగ అవకాశాల తగ్గుదల అమెరికాలో ఉద్యోగ కలలు దూరం
– ఐటీ కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం.
– భారతీయులకు యూఎస్‌లో ఉద్యోగ అవకాశాల తగ్గుదల.
– అమెరికాలో ఉద్యోగ కలలు దూరం.
– ఇతర దేశాలకు వలసపోవాల్సిన పరిస్థితి.
– చిన్న కంపెనీలకు మరింత గడ్డుకాలం.
– కంపెనీల లాభాలు 10-15 శాతం తగ్గొచ్చు.