ఈసీకి కేరళ రాజకీయ పార్టీల వినతి
తాజా ఓటర్ల జాబితానే బేస్ డాక్యుమెంట్‌గా తీసుకోవాలని సూచన
తిరువనంతపురం : స్ధానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు కేరళలోని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఎస్‌ఐఆర్‌ను చేపట్టే సమయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పైగా ఓటర్ల జాబితా సవరణకు బేస్ డాక్యుమెంట్‌గా 2002 నాటి ఓటర్ల జాబితాను ఉపయోగించుకోవాలనుకోవడాన్ని కూడా పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దానికి బదులుగా తాజా జాబితాను ఉపయోగించుకోవాలని కోరాయి.
కేరళ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రతన్ యు.కేల్కర్ ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. కేరళలో ఎస్‌ఐఆర్‌ను నిర్వహించడంపై ప్రజల్లో వ్యతిరేక భావన నెలకొందన్నారు. అయినా ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేంతవరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరాయి. రేషన్ కార్డును కూడా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంగా చేర్చాలని కోరాయి. 23ఏండ్ల నాటి పాత ఓటర్ల జాబితా బదులుగా గతేడాది లోక్‌సభ ఎన్నికలకు ఉపయోగించిన ఓటర్ల జాబితాను బేస్ డాక్యుమెంట్‌గా పరిగణించాలని ప్రధాన పార్టీలు కోరాయి.
కేరళకు ఎస్‌ఐఆర్ షెడ్యూల్‌ను ఇసి ఇంకా ప్రకటించనప్పటికీ, ప్రజల్లో, పార్టీల్లో వున్న ఆందోళనలను తొలగించే ప్రయత్నంలో భాగంగా కేల్కర్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇప్పుడు అవసరమా ? : సీపీఐ(ఎం)
”అయినా ఫోటో గుర్తింపు కార్డులు (ఎపిక్) వుండి, తాజా ఓటర్ల జాబితాలో వారి పేర్లు వుండి, పైగా గత ఐదు ఎన్నికల్లోనూ ఓటు వేసిన వారు మళ్ళీ ఓటరు దరఖాస్తు ఫారాలు నింపాల్సిన అవసరం ఏమిటి?” అని సీపీఐ(ఎం)కి చెందిన ఎం.వి.జయరాజన్ ప్రశ్నించారు. 2002కి బదులుగా 2024 లోక్‌సభ ఓటర్ల జాబితాను ఉపయోగించాల్సిందిగా ఇసికి విజ్ఞప్తి చేశారు. బీహార్ నమూనా ఎస్‌ఐఆర్‌ను కేరళలో ఎంత మాత్రమూ ఆమోదించేది లేదని స్పష్టం చేశారు.
2002 నాటి ఓటర్ల జాబితాను ఉపయోగించుకోవాలనుకోవడాన్ని ‘కాలం చెల్లిన డేటా మ్యాపింగ్’గా కాంగ్రెస్ ఎంఎల్‌ఎ పి.సి.విష్ణునాథ్ విమర్శించారు. రేషన్ కార్డులను గుర్తింపు కార్డుగా పరిగణించాలని కోరారు. ఓటర్ల జాబితా సమస్యలకు ఎస్‌ఐఆర్‌ను ఒక పరిష్కారంగా చూడరాదని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి లిజూ విమర్శించారు.
బీజేపీ ఈ చర్యను స్వాగతించగా, యూడీఎఫ్ వ్యతిరేకిస్తుందని సతీశన్ చెప్పారు. తాజా ఓటర్ల జాబితాలనే ఇసి బేస్ డాక్యుమెంట్‌గా తీసుకోవాలని ఐయుఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి సి.పి.చెరియా మహ్మద్, సీపీఐ(ఎం) మాజీ మంత్రి కె.రాజు, ఆర్‌ఎస్‌పికి చెందిన ప్రసన్న కుమార్, కేరళ కాంగ్రెస్‌కు చెందిన జారు అబ్రహం, కేరళ కాంగ్రెస్(ఎం)కు చెందిన ఆనంద్‌కుమార్‌లు కూడా విజ్ఞప్తి చేశారు.