మట్టి కుండ పట్టుకొని భిక్షాటన చేసిన కార్యకర్తలు
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని రాయిచెడు గ్రామంలో వీధిలైట్లు లేకపోవడంతో బిజెపి గ్రామ అధ్యక్షుడు సొంట రవి ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. గ్రామంలోని పలు వీధి వాడలలో తిరుగుతూ మట్టి కుండ పట్టుకొని భిక్షాటన చేసి ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మొగిలి అంజి మాట్లాడుతూ –..“గ్రామంలో నెలలుగా వీధిలైట్లు లేక చిమ్మ చీకట్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్ల వీధి వాడలలో చెత్త పేరుకుపోతోంది. కనీసం వీధిలైట్లు కూడా ఏర్పాటు చేయలేని ప్రభుత్వం ప్రజల సమస్యలను విస్మరిస్తోంది” అని మండిపడ్డారు.
అలాగే వర్షాకాలంలో విషపురుగులు, తేళ్లు విస్తరిస్తున్నందున ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని, తక్షణమే సంబంధిత శాఖ అధికారులు స్పందించి గ్రామంలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. “ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో ప్రజల పక్షాన ఉద్యమిస్తాం” అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ అధ్యక్షుడు గుండమోని జగదీష్, ఎత్తపు మధు, ఇంజమూరి తిరుపతి, దామెర్ల శ్రీను, రాజేష్, శివ, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.