Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలి 

అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలి 

- Advertisement -

ప్రభుత్వం అన్ని రకాల క్రీడలకు ప్రోత్సాహం : తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి
క్రీడలకు వనపర్తి నిలయం కావాలి : వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి 

రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో వారు అత్యుత్తమంగా రాణించేలా చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోదని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న 11వ అంతర్ జిల్లా సీనియర్ మెన్స్ అండ్ ఉమెన్స్ సెపక్ తాక్రా చాంపియన్షిప్ క్రీడా పోటీలకు శివసేన రెడ్డి స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రీడలకు వనపర్తి మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస గౌడ్ అధ్యక్షత వహించారు.

క్రీడలను ప్రారంభించడానికి ముందు ముఖ్య అతిథులు ప్రముఖ క్రీడాకారుడు, హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చాంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహబూబ్నగర్, ఆదిలాబాద్ జట్ల మధ్య ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో జిల్లా నుంచి మెన్స్, ఉమెన్స్ రెండు జట్లు చొప్పున మొత్తం 20 జట్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

 ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో  రూ.800 కోట్లు క్రీడలకు కేటాయించిందని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లేందుకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. సెపక్ తాక్రా క్రీడకు సంబంధించి బాల్స్ కొనుగోలు చేసేందుకు కొంత ఇబ్బందులు ఉన్నట్లు తెలిసిందని ఇందుకు సంబంధించి అట్టి క్రీడకు సంబంధించిన అసోసియేషన్ వారు తమకు నివేదిక ఇస్తే మలేషియా నుంచి బంతుల్ని తెప్పించేందుకు  తప్పనిసరిగా కృషి చేస్తామన్నారు. క్రీడాకారులకు కావాల్సిన అన్ని సదుపాయాలని కల్పిస్తామని, క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి మెడల్స్ తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీలో మైదానాలను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇక వనపర్తి జిల్లాకు రూపాయలు 57 కోట్లతో స్పోర్ట్స్ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పారు. వచ్చే ఏడాదికి వనపర్తి లో ఇండోర్ స్టేడియం అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో విద్యార్థులు క్రీడలు నుంచి దూరం కావడం వల్ల మానసికంగా, శారీరకంగా అనారోగ్యం పాలవుతున్నారని, కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని క్రీడల వైపు దృష్టి సాధించేలా ప్రోత్సహించాలన్నారు. క్రీడలు ఎంత ఎక్కువగా ఆడితే అంతగా ఆరోగ్య తెలంగాణను నిర్మించగలమని, అంతేకాకుండా విద్యార్థులను ఇతర చెడు వ్యసనాల వైపు మల్లకుండా కాపాడగలమన్నారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించేవరకు కష్టపడాలని, గత ఏడాది తెలంగాణ నుంచి పారా ఒలంపిక్స్ లో మెడల్ సాధించిన దీప్తి జీవాంజిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. 

 స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి విద్యాపర్తి మాత్రమే కాదని క్రీడలకు కూడా నిలయమని అన్నారు. క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి వనపర్తి వారే కావడం, రాష్ట్ర క్రీడా మంత్రి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వారే కావడం ఎంతో గర్వించదగిన విషయం అన్నారు. సీఎం రేవంత్ కూడా క్రీడల పట్ల చాలా మక్కువ ఉంటుందని, ఇక్కడే చదువుకొని ఇక్కడే అనేక క్రీడల్లో పాల్గొన్నారన్నారు. క్రీడాకారులకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా హైదరాబాద్లోని క్రీడా ప్రాధికార సంస్థకు వెళ్లి కలిస్తే ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. వనపర్తి జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేసిందని, అదేవిధంగా పెద్దమందడి, ఘనపూర్ మండలాలకు మినీ స్టేడియంలో శాంక్షన్ చేసిన సీఎంకు, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలో 9 ఎకరాల్లో క్రికెట్ కోసం స్థలాన్ని కేటాయించినట్లు కూడా ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని విద్యార్థులు చక్కగా చదువుకోవడమే కాకుండా, కొత్తగా ఆడుకొని అన్ని రంగాల్లో రాణించి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. 

 సెపక్ తాక్రా క్రీడల్లో రాణించి ఇన్కమ్ టాక్స్ విభాగంలో ఉద్యోగాన్ని సంపాదించిన ఘనపురం అమ్మాయి నవతను ఎమ్మెల్యే అభినందించారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని అందరూ క్రీడల్లో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెపక్తక్రా క్రీడల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జిల్లా క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సెపక్ థాక్రా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సెక్రెటరీ పబ్బ భాస్కర్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -