ప్రసవ పూర్వమూ, ప్రసవసమయమూ.. ఈ రెండు దశల్లోనూ తల్లీ, శిశువు, ఇద్దరి పరంగా కుటుంబం తీసుకోవల్సిన సంరక్షణ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రసవం తర్వాత ఎలాంటి సంరక్షణ తీసుకోవాలో తెలుసుకుందాం. బిడ్డను ప్రసవించిన నాటి నుండి శారీరకంగా, మానసికంగా తల్లి తిరిగి మామూలు స్థితికి వచ్చేందుకు పట్టే కాలాన్ని ప్రసవానంతర సమయం అని అంటారు. అది కొన్నివారాలు లేదా నెలలు కూడా కావచ్చు. ఈ కాలాన్ని నాల్గవ త్రైమాసికం (ఫోర్త్ ట్రైమెస్టర్) అని సంబోధిస్తారు. ఈ సమయంలో జాగ్రత్త వహించాల్సిన విషయాల గురించి చర్చిద్దాం.
ప్రసవం తర్వాత తల్లి శారీరిక ఆరోగ్యం, పోషకం, మానసిక స్థితి, వ్యాయాయంతో పాటు బిడ్డ సంరక్షణ, ఆరోగ్యం, పోషకం అనే అంశాలు ప్రాధాన్యత కలిగి వుంటాయి. గర్భధారణలో జరిగిన శారీరిక మార్పులు, బిడ్డ జననం, హార్మోన్ల ప్రభావాలు, కాన్పులో కలిగిన అలసట, ఆందోళనలు, వీటిని తట్టుకుంటూనే నవజాత శిశువు ఆలనా, పాలనా చూసుకునే విధంగా తల్లి తన జీవన విధానాన్ని మలచుకోవాల్సి ఉంటుంది.
ఆమె కదలేని స్థితిలో వుంటే…
తల్లీ బిడ్డలకు ప్రసవానంతరం మొదటి రెండు రోజులు చాలా ముఖ్యమైనవి. ఆ కొన్ని గంటల్లోనే తల్లి సేదతీరాలి. బిడ్డకు తన పాలు ఇవ్వాలి. సాధారణ కాన్పు కాకుండా సిజేరియన్ ద్వారా జన్మనిస్తే ఆమె కదలేని స్థితిలో కనీసం తన పని తాను చేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఆ సమయంలో బిడ్డ అవసరాలు తీర్చలేకపోతున్నాననే బాధ కలిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో బిడ్డతో తల్లికి అనుబంధమేర్పడడానికి ఇదే ఆటంకంగా ఉంటుంది. అంతే కాక, చనుబాలివ్వగలిగి కూడా కదల్లేని పరిస్థితిల్లో ఉంటుంది. దాంతో పాల ఉత్పత్తిలో కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది.
సమస్యలు తలెత్తితే…
మొదటి ఇరవైనాలుగు గంటల్లో బిడ్డ తల్లి పాలు ఎంత తాగితే అంత మంచింది. తల్లి అంత త్వరగా గర్భధారణ పూర్వ దశకి చేరుకొనే అవకాశముంటుంది. తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. బిడ్డ సాంత్వన పొందుతుంది. కనుక ఈ సమయంలో తల్లి ఆరోగ్య స్థితిని తరచూ పర్యవేక్షిస్తూ ఉండాలి. కొద్ది మంది తల్లుల్లో ఫూపెరల్ సెప్సిస్ అనేది ప్రసవానంతరం ఇరవై నాలుగు గంటల నుండి పది రోజుల వరకూ జరగవచ్చు. యోని నుండి దుర్గంధపూరిత స్రావం, పొత్తి కడుపు నొప్పితో బాటు తీవ్ర జ్వరం దీని ముఖ్య లక్షణాలు. చికిత్స పరంగా తగిన చర్యలు వెంటనే చేపట్టాలి.
ఆరోగ్యంగా ఉంటేనే ఇంటికి…
ప్రథమ ప్రసవ సమయంలో యోనిద్వారం వద్ద కుట్లు పడి ఉంటే (ఏపిసిఓటమి), ఆ గాయానికి అంటు తగలకుండా కాపాడాలి. అలాగే పుట్టిన వెంటనే బిడ్డకు విటమిన్ కే, బీసీజీ, పోలియో చుక్కలు, హెపటైటిస్ బి టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలి. బొడ్డు తాడుకి ఏ అంటూ తగలకుండా చూసుకోవాలి. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించిన తర్వాతే ఇంటికి తీసుకెళ్లాలి. ఇంటి దగ్గర తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఆహార ప్రణాళిక, తీసుకోవల్సిన మందులు, బిడ్డకు ఏవైనా మందులివ్వాల్సిన అవసరమున్నప్పుడు అవి ఎలా, ఏ మోతాదులో ఇవ్వాలి, ఆసుపత్రికి మళ్లీ ఎప్పుడు రావాలి వంటివన్నీ తెలుసుకోవాలి. వీటన్నింటిపై తల్లికి, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి. డిశ్చార్డ్ కార్డులో బిడ్డ టీకాలు తేదీలు, తప్పని సరిగా సూచించాలి.
విశదీకరించవలసిన అంశాలు
తల్లి ఆరోగ్య సంరక్షణలో భాగంగా పోషకాహారం తీసుకోవాలి.. పాలిచ్చే తల్లిలో సహజంగానే ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఆమె పోషకాలతో కూడిన ఏ ఆహారమైన తీసుకోవచ్చు. తీసుకోకూడనివంటూ ఆంక్షలు, నియమాలు లేవు. ఆమెకు నచ్చిన పౌష్టికాహారం ఎక్కువ తీసుకునే విధంగా ప్రోత్సహించాలి. అవేవీ కూడా బిడ్డ పైన ఎలాంటి దుష్ప్రభావం చూపవని అర్థమయ్యేలా వివరించాలి. ఆరోగ్యపరంగా కొన్ని అనుకోని పరిస్థితులు తలెత్తవచ్చు. బిడ్డ మొదటి నెలలో రాత్రి ఎక్కువసేపు మేల్కొని పగలు నిద్ర పోతుండవచ్చు. అలాంటప్పుడు తల్లి తన నిద్రాసమయం కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులు చేసుకొనే ప్రక్రియలో కుటుంబ సభ్యుల సహకారం ఏంతో అవసరం. ఆ సహకారం అందకపోతే ఆమె నిరాశకు గురి కావచ్చు. మన దేశంలో ఇరవై శాతానికి పైగా తల్లులు ప్రసవానంతరం కలిగే నిరాశ స్థితి (పోస్ట్ పార్టమ్ డిప్రెషన్)కి గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ సూచికలు
ఓపిక లేకపోవడం, శక్తి హీనత, నిద్ర పట్టకపోవడం, తొందరగా అలిసిపోవడం, వివిధ రకాల నొప్పులతో బాధపడటం, దేనిలోనూ, బిడ్డపై కూడా ఆసక్తి కనబరచకపోవడం, ఎప్పుడూ నిరుత్సాహంగా, నీరసంగా, దిగులుగా ఉండటం దీని లక్షణాలు. ఈ స్థితి నుండి ఆమెను బయటకు తీసుకు వచ్చేలా, ఆమెతో బాటు ఆమె కుటుంబ సభ్యులతోనూ, తగిన శిక్షణ పొందిన నిపుణుల చేత మాట్లాడించి సాంత్వన పొందేలా చూడాలి. ఇవే కాకుండా రక్త స్రావం, ఫిట్స్, శ్వాసపరంగా ఇబ్బందులు, గుండె, పాలిండ్లలో నొప్పి, చనుమొనల్లో చీము రావడం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, అనాయాసంగా మూత్రం పడిపోతూ ఉండటం వంటి సమస్యలేవన్నా తలెత్తితే వెంటనే ఆసుపత్రికి వెళ్లి నిపుణులను సంప్రదించాలి.
అవగాహన కల్పించాలి
తల్లి ఆరోగ్యవంతురాలైతే ఆమె పాలు బిడ్డకి ఆరు నెలల వయసు వచ్చేవరకు కూడా సరిపోతాయి. ఇంకెటువంటి ఇతర ఆహారం లేదా పోతపాలు అవసరం లేదన్న విషయంపై తల్లికి, ఆమె కుటుంబానికి అవగాహన కల్పించాలి. బిడ్డకి పాలిచ్చే సరైన పద్ధతులను తల్లికి విశదీకరించి చెప్పాలి. తల్లి ఆరోగ్యం కుదుటపడగానే తన పనులు, బిడ్డ సంరక్షణ తానే చేసుకొనే విధంగా, శారీరిక వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించే కార్యకలాపాల్లో కూడా పాల్గొనే విధంగా ప్రోత్సహించాలి. తల్లీ బిడ్డల సంరక్షణ ఓ సామాజిక బాధ్యత. మానవాళి శ్రేయస్సు అందులోనే అంతర్లీనమై ఉన్నది.
– డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్