ఇంటికి పెద్దదిక్కోలె ఇంటి పెద్దర్వాజ…
ఎంత గాంభీర్యం పెద్దపులోలె…
దాని రాజసాన్ని జూసె
వాళ్ళు వీళ్ళు లోపలికి రావడానికే ఝడుసుకునేటోళ్ళు…
తొలిపొద్దున మాఅమ్మ కడపల్గడిగి ముగ్గుబెట్టినంక చూడాలే దాని పొగరు…
పండగలప్పుడు దాని సోకె వేరు
పచ్చని మావిడాకులు తలపై జేరి
కమ్మని వాసనలతో ముచ్చట్లు పెడ్తాంటె ….
పసుపు కుంకాలను పులుముకొని
తెల్లపిండితో నవ్వుల ముగ్గులల్ల
కళకళ లాడుతాంటది
మా పెద్దర్వాజ…
అప్పుడప్పుడు నాకు కొంచెం పొగరెక్కి కండ్లు నెత్తికి చేరితె ….
కాలిగోటుకి ఒక్క పోటు పొడిసి నేలన్జూసి నడుమని బుద్దులుజెప్పేది…
సాయంత్రం పూట పనైపొంగనే పెద్దర్వాజకాడ మా అమ్మ కూసుంటె …
వచ్చిపొయెటోళ్ళ పలకరింపులతో కళకళలాడేది…
కాని ఇప్పుడు పొక్కిలిపడ్డ వాకిట్ల
ఎండినాకుల సప్పుడుతో…
చెదల్వట్టి ముసల్దై మూలుగుతూ రొదబెడ్తాంది మా పెద్దర్వాజ ….
వలసబోయిన ఇంటిమనుషులకై ఎదురుజూస్తూ…
-వకుళవాసు, 9989198334
పెద్దర్వాజ?
- Advertisement -
- Advertisement -