– కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
– ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తే తప్పేంటని నిలదీత
న్యూఢిల్లీ : రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదనలు విన్పించిన ఓ అధ్యాపకుడిని జమ్మూకాశ్మీర్ విద్యా శాఖ సస్పెండ్ చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఆయనను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో చెప్పాలని కేంద్రాన్ని నిలదీసింది. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి రాజకీయ శాస్త్ర సీనియర్ లెక్చరర్ అయిన జహూర్ అహ్మద్ భట్ స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. ఇది జరిగిన నాలుగు రోజులకే భట్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలలో భట్‌ను ‘అపరాధి అయిన అధికారి’గా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అలోక్ కుమార్ అభివర్ణించారు. భట్ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లపై విచారణను ప్రారంభించిన సందర్భంగా సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్‌లు భట్ సస్పెన్షన్ ఉత్తర్వులను కోర్టు దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు భట్ రెండు రోజులు సెలవు తీసుకున్నారని, ఆయన తిరిగి రాగానే సస్పెండ్ చేశారని సిబల్ తెలిపారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ భట్ సస్పెన్షన్‌కు వేరే కారణాలు కూడా ఉన్నాయని, ఆయన ఇతర కోర్టులకు కూడా వివిధ అంశాలపై హాజరయ్యారని, ఆ వివరాలు కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తే తప్పేంటని, అసలు ఏం జరుగుతోందని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణిని, తుషార్ మెహతాను ప్రశ్నించారు.