Monday, September 22, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎవరికీ పట్టని ఔట్‌ సోర్సింగ్‌

ఎవరికీ పట్టని ఔట్‌ సోర్సింగ్‌

- Advertisement -

సచివాలయం గేటు నుంచి సీఎం ఆఫీసు దాకా వారే కీలకం
సీనియారిటీ 25 ఏండ్లు.. వేతనం రూ.15 వేల నుంచి రూ.22 వేలే
అటెండర్లు, డ్రైవర్లు, డీఈవోలు, డీపీవోల అరిగోస
గొడ్డు చాకిరీ చేస్తున్నా కనికరించని వైనం
ఇదే స్థితిలో రిటైర్‌ అయిన వారెందరో
త్వరలోనే ఉద్యోగ విరమణ చేయనున్న మరికొందరు
క్రమబద్ధీకరణకు అడ్డుగా 2/94 యాక్ట్‌
రద్దుపై విధాన నిర్ణయం తీసుకోని పాలకులు


బి.వి.యన్‌.పద్మరాజు

సచివాలయం గేటు నుంచి సీఎం, సీఎస్‌ ఆఫీసు దాకా వారే కీలకం. మంత్రులు, ఉన్నతాధికారుల కారు డోరు దగ్గర్నుంచి, కాఫీ కప్పులందించే వరకు. ఉన్నతాధికారుల పేషీల్లో దస్త్రాల నుంచి కంప్యూటర్లలో ప్రింట్లు తీసే వరకు వారే నిరంతరం సేవలంది స్తుంటారు. కానీ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనే చందంగా…రాష్ట్ర పరిపాల నా కేంద్రంలో సేవలందిస్తున్న వీరి సీనియారిటీ, వేతనాల గురించి వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఒక్కో సిబ్బందికి కనీసం పదేండ్ల నుంచి 25 ఏండ్ల వరకు సర్వీసుంది. కానీ వారికి వచ్చే జీతం మాత్రం నెలకు రూ.15 వేల నుంచి రూ.22 వేల వరకే. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో 1994లో ఈ కొలువుల్లో చేరిన వారిలో చాలా మంది రిటైరయిపోగా.. మరికొం త మంది రిటైర్‌మెంట్‌కు దగ్గర్లో ఉన్నారు. తమ జీవితం మొత్తం ఇక్కడే సేవలందించినా కనీసం బతకటానికి కావాల్సిన వేతనం కూడా ఇవ్వటం లేదని వారు వాపోతున్నారు.

రాష్ట్ర సచివాలయంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతు ల్లో పనిచేస్తున్న అటెండర్లు, డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవోలు), డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్ల (డీపీవోలు) అరిగోస ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో ఆనాటి టీడీపీ ప్రభుత్వం… ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల రిక్రూట్‌మెం ట్‌కు సంబంధించి 2/1994 అనే యాక్టును తెచ్చింది. తద్వారా 240 రోజులు పని చేస్తే ఆ ఉద్యోగిని పర్మినెంట్‌ చేయాలనే నిబంధనలకు తిలోదకాలిచ్చింది. 2002లో కేంద్రంలో ని నాటి వాజ్‌పారు ప్రభుత్వం ‘రెండో లేబర్‌ కమిషన్‌’ను తీసుకొచ్చింది. ఆ కమిషన్‌ సిఫారసులను సాకుగా చూపుతూ టీడీపీ, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కూడా 2/1994 యాక్ట్‌ను రద్దు చేసేందుకు ముందుకు రాలేదు. ఇదే రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. తెలంగాణ వస్తే ‘కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వ్యవస్థే ఉండబోదు…’ అంటూ ప్రకటించిన బీఆర్‌ఎస్‌ సైతం ఆ యాక్టును రద్దు చేసేందుకు ముందుకు రాకపోవటం గమనార్హం. అయితే 2020లో తీసుకొచ్చిన జీవో.60 ద్వారా అనేక డిపార్టుమెం ట్లతోపాటు సచివాల యంలోని ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కూడా వేతనాలు పెరిగాయి.

కానీ అది కూడా అరకొరే!. ప్రస్తుతం సచివాల యంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో పని చేస్తున్న వారిలో అటెండర్లు 200 మంది, డ్రైవర్లు 100, డీఈవోలు 200, డీపీవోలు 200 మంది ఉన్నారు. వీరిలో 25 ఏండ్లు పైబడి సీనియారిటీ ఉన్నవారూ ఉన్నారు. కేటగిరీల వారీగా డ్రైవర్లు, అటెండర్లకు రూ.15,600, డీఈవోలు, డీపీవోలకు రూ.19,500, ఆఫీస్‌ సబార్డినేట్లు, సూపర్‌ వైజర్లకు రూ.22,750 వేతనంగా చెల్లిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో వీరు పని చేస్తుండటంతో సదరు ఏజెన్సీలు జీతంలోని ఒకటి నుంచి మూడు శాతం వరకు ముందే కట్‌ చేసుకుని వేతనాలు చెల్లిస్తున్నాయి. దీంతో కుటుంబాలను పోషించటం సాధ్యం కావటం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఈ చాలీచాలని వేతనాలతో బతుకులీడ్చలేక పలువురు సిబ్బంది తమ కొలువులకు రాజీనామా చేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. 1994 నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల (డ్రైవర్లు, అటెండర్లు, ఆఫీస్‌ సబార్బినేటర్లు) పోస్టులను ప్రభుత్వాలు భర్తీ చేయటం లేదని, ఫలితంగా తాము ‘ఔట్‌సోర్సింగ్‌’లో మగ్గిపోతున్నామని ఆర్థిక శాఖకు చెందిన ఒక నాలుగో తరగతి ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ వేతనాలను పెంచాలనీ, ఉద్యోగాలను క్రమబద్ధీకరిం చాలని ఆయన మొరపెట్టుకున్నారు.

ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి… జే.వెంకటేశ్‌, రాష్ట్ర అధ్యక్షులు, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌
‘సచివాలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కొంతలో కొంత ఉపశమనం కలగాలంటే వారికి రూ.26 వేల కనీస వేతనాన్ని నిర్ణయించాలి. లేదా పర్మినెంట్‌ ఉద్యోగుల మూల వేతనాన్ని వీరి కనీస వేతనంగా నిర్ణయించాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసినప్పుడే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కొంత ఊరట కలుగుతుంది. అయితే ఇదే సమస్యకు పరిష్కారం కాదు. యాక్ట్‌ 2/94ను పూర్తిగా రద్దు చేసి, వారందర్నీ క్రమబద్ధీకరించినప్పుడే వారి జీవితాలు బాగుపడతాయి.

పెరిగేది వయస్సే..జీతం కాదు
సచివాలయంలోని ఓ శాఖకు చెందిన అటెండర్‌
‘నేను ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో ఈ ఉద్యోగంలో జాయిన్‌ అయ్యా. అప్పుడు నాకు పెండ్లి కాలే. ఆ తర్వాత పెండ్లయి పిల్లలు పుట్టారు. నేను ఈ పోస్టులో ఉండగానే నా పెద్ద కూతరు డిగ్రీ పూర్తి చేసింది. ఈ మధ్యనే పెండ్లి చేశా. ఈ యేడాదితో నా సీనియార్టీ 29 ఏండ్లు పూర్తయింది. నా జీతం మాత్రం రూ.15,600లే. ఈ కొలువులో మా వయస్సే పెరుగుతోంది, జీతం కాదు…’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -