– సమావేశం ఉద్దేశ్యం ఒకటి
– చర్చించిన విషయం మరోటి
– పీఏసీఎస్ సమావేశంలో పాల్గొన్న డీసీసీబీ డైరెక్టర్ పుల్లారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
దివాలా దశలో ఉన్న అశ్వారావుపేట ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని పురోభివృద్ధిలో పెట్టడానికి ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, రెగ్యులర్ సీఈఓ ను నియమించాలని పాలకవర్గం తీర్మానించింది. పలు అవినీతి ఆరోపణలు నేపధ్యంలో జిల్లా కో ఆపరేటివ్ ఉన్నతాధికారుల విచారణలో ఉద్యోగం నుండి ఉద్వాసనకు గురైన సీఈఓ విజయ బాబు స్థానంలో తాత్కాలిక సీఈఓ నియామకం పై పాక్స్ అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ అద్యక్షతన సోమవారం సమావేశం అయిన పాలక వర్గం అజెండా అంశం కంటే ఇతర వ్యవహారాలపై నే చర్చించారు.
ఒక దశలో సమావేశానికి హాజరైన డీసీసీబీ డైరెక్టర్ పుల్లారావు కార్యాలయం సహాయ సిబ్బందిని తంతాను అంటూ గదమాయించారు. గతంలో జరిగిన అక్రమాల్లో ప్రస్తుత ఆఫీస్ అసిస్టెంట్ హిమగిరి కూడా బాధ్యుడే నని, అటువంటి వ్యక్తికి అదనపు బాధ్యతలు ఎలా ఇస్తారంటూ పలువురు సభ్యులు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావటం, బాధ్యులుగా కార్యదర్శి విజయ బాబు ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయటం పూర్తి స్థాయి విచారణ,దుర్వినియోగ మైన నిధులు రికవరీ పై చర్చించారు.రుణ వసూళ్లు,కొత్త రుణాలు, రుణాల పెంపు, సంఘం అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలను సమీక్షించారు. నూతన కార్యదర్శి నియామకం అయ్యే వరకు ఆఫీస్ అసిస్టెంట్ హిమగిరి కి అదనపు బాధ్యతలు అప్పగించాలని చివరిగా నిర్ణయించారు.
ఈ సమావేశంలో డీసీసీబీ స్థానిక బ్రాంచ్ సూపర్వైజర్ సుందర్, డైరెక్టర్ లు బత్తిన పార్థసారధి, గొడవర్తి వెంకటేశ్వరరావు, సత్తెనపల్లి వెంకటేశ్వరరావు, అల్లూరి వెంకట రామారావు, తెల్లమేకల కన్నయ్య, పెన్నాడ చిట్టిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.