భారతీయ బ్యాంకుల యాజమాన్యంలో ప్రవాసులకు వాటా ఉండవచ్చు. అయితే ఆ వాటా పదిహేను శాతానికి మించకుండా ఉండాలని రిజర్వు బ్యాంక్ పరిమితి విధించింది. ఈ పరిమితిని ఆయా సందర్భాన్ని బట్టి పెంచే అవకాశం ఉంది. ఏదేమైనా చట్టం ప్రకారం ఈ 15శాతం పరిమితి అనేది ఇప్పటికీ కొనసాగుతోంది. ఐనప్పటికీ, 2018లో కెనడాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ అనే కంపెనీ, (ఇది మారిషస్ నుంచి కార్యకలాపాలు నడుపు తోంది) కేరళలోని కేథలిక్ సిరియన్ బ్యాంక్ వాటాలలో 51 శాతాన్ని కొనుగోలు చేయడానికి అనుమతించారు. కేంద్ర ప్రభుత్వం గాని, రిజర్వుబ్యాంక్ గాని 15 శాతం పరిమితిని ఇలా 2018లో ఉల్లంఘించవలసిన అగత్యం ఏమిటో వివరించనేలేదు. అంతకు మునుపు, 1994లో (నయా ఉదారవాద విధానాల తొలిదినాల్లో) ఎస్‌ఎస్ చౌవాలా గ్రూపు సంస్థ (ఇది థారులాండ్ నుండి నడుస్తోంది) ఇదే బ్యాంకులో 34శాతం వాటాలను కొనుగోలు చేస్తానని ముందు కొచ్చినప్పుడు ఆ అభ్యర్ధనను అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. అలా తిరస్కరించడం సరైనది. కాని ఆ తర్వాత 2018లో ఎందుకు అనుమతించారో ఇప్పటికీ వివరణ లేదు.
ఇప్పుడు ఐడిబిఐ బ్యాంక్ (ఇండిస్టియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)ను ఒక విదేశీ ప్రయివేటు సంస్థకు అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఐడిబిఐ బ్యాంక్ ప్రభుత్వ రంగ సంస్థగా ప్రత్యేకంగా పరిగణించబడకపోయినప్పటికీ, దానిలోని మెజారిటీ వాటాదారుడిగా ప్రభుత్వ యాజమాన్యం కింద నడుస్తున్న ఎల్‌ఐసి సంస్థ 2019 నుంచీ ఉంది.
అందుచేత ఈ విషయమై ఎన్ని అభ్యంతరాలు వెలువడుతున్నప్పటికీ, విదేశీ సంస్థలు మన దేశీయ బ్యాంకుల మీద పెత్తనం పొందడానికి అనుమతించేందుకు ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా మొగ్గు చూపుతోంది. ఎందుకు ఈ విధంగా జరుగుతోందన్న విషయాన్ని ఇంతవరకూ వివరించే ప్రయత్నం ప్రభుత్వం గాని రిజర్వు బ్యాంక్ గాని చేయలేదు. సాధారణంగా ఇటువంటి ప్రధాన, విధానపరమైన మార్పులు చేపట్టినప్పుడు ‘విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం’ అంటూ సాకులు చెప్తారు. కాని ఈసారి అటువంటిది కూడా లేదు. అయితే, అటువంటి సాకు ఈ విషయంలో నిలబడదు. విదేశీ సంస్థలు మన బ్యాంకుల వాటాలను కొనుగోలు చేస్తే వచ్చే మొత్తమే చాలా తక్కువ.
కేథలిక్ సిరియన్ బ్యాంక్‌లో 51 శాతం వాటాలను కొనుగోలు చేసిన ఫెయిర్ ఫాక్స్ సంస్థ చెల్లించినది కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే. పైగా, జూన్ 2024లో తమ వాటాల్లో కేవలం 9.72 శాతం వాటాలను అమ్మి రూ.592 కోట్లు, అంటే తాము చెల్లించిన దాంట్లో దాదాపు సగం, తిరిగి పొందారు. మన బ్యాంకుల యాజమాన్యం విదేశీ కంపెనీల చేతుల్లో ఉంటే అప్పుడు మన దేశంలోకి పెట్టుబడులు రావడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది అన్న వాదన కూడా పూర్తిగా తప్పుడు వాదనే. గతంలో విదేశీ వాటాలు 15శాతానికి మించకూడదన్న నిబంధనను రిజర్వు బ్యాంక్ ఖచ్చితంగా పాటించినప్పుడు కూడా విదేశీ పెట్టుబడులు బాగానే వచ్చాయి. ఇప్పుడు విదేశీ పెట్టు బడులు రావడం తగ్గిపోయి, వెనక్కి వెళ్ళిపోవడం పెరుగుతోందంటే అందుకు వేరే కారణాలు ఉన్నాయి (ఉదాహ రణకు ట్రంప్ సుంకాల పెంపు). కొన్ని బ్యాంకులను విదేశీ సంస్థలకు అమ్మేసినంత మాత్రాను విదేశీ పెట్టుబడులు వెనక్కి పోతున్న ధోరణిని ఆపడం కూడా సాధ్యం కాదు. విదేశీ సంస్థల పెత్తనం కిందికి మన దేశీయ బ్యాంకులను అనుమతించే ప్రక్రియ ఎందుకిలా గోప్యంగా ముందుకు సాగుతోంది? అందునా అటువంటి ప్రక్రియ వలన మన దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వినాశకర ఫలితాలను చవిచూడవలసి వస్తుందని గుర్తించిన తర్వాత కూడా ఎందుకిలా జరుగుతోంది? (మన బ్యాంకుల్లో విదేశీ సంస్థల వాటాలు 15 శాతానికి మించకూడదన్న నిబంధనను తొలుత రూపొందించి అమలు చేసినది ఇందుకే కదా?)!
బ్యాంకుల యాజమాన్యం విదేశీ సంస్థల చేతుల్లోకి పోతే జరిగే హాని గురించి ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్తున్నారన్న వాదన ఉంది. భారతీయ బ్యాంకులు విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేయడం గురించి రిజర్వు బ్యాంక్ కొన్ని నిబంధనలను రూపొందించింది. ఆ నిబంధనలు మన బ్యాంకులకు కొన్ని పరిమితులు విధించాయి. ఆ పరిమి తులకు లోబడి వ్యవహరించినంత కాలం మన బ్యాంకుల యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉందన్నది అంత ప్రధానం కాదు. ఈ వాదనను ఒకవేళ అంగీకరించినా, అసలు మన భారతీయ బ్యాంకులను విదేశీ సంస్థకు ఎందుకు అప్ప జెప్పాలన్న ప్రశ్నకు అది సమాధానం చెప్పదు. విదేశీసంస్థల చేతుల్లో ఉంటే మన బ్యాంకుల నిర్వహణ బాగా మెరుగు పడుతుందన్న వాదన సైతం చెల్లదు. నిజానికి మన బ్యాంకులు విదేశీ సంస్థల చేతుల్లోకి పోతే అప్పుడు ఇక్కడ చిన్న స్థాయి రుణాలను పొందేవారికి ఆ బ్యాంక్ అందుబాటులో ఉండదు. నిజానికి బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు వారికే ప్రాధాన్యతనివ్వాలి. కాని విదేశీ సంస్థల చేతుల్లో ఉన్నప్పుడు ఆ విధంగా జరగదు. పైగా అత్యున్నత స్థాయి అధికారుల జీతాలు మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతాయి. కేథలిక్ సిరియన్ బ్యాంక్ అనుభవం ఇదే.
అంతే కాదు, ఒకసారి మన బ్యాంకుల మీద పెత్తనం విదేశీ కంపెనీల చేతుల్లోకి పోయిన తర్వాత వాళ్లు విదేశీ ఆస్తుల కొనుగోలు విషయంలో ఉన్న ప్రస్తుత నిబంధనలను, పరిమితులను ఎత్తివేయాలని మన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతారు. ఆ పరిమితులను ఎత్తివేస్తే అప్పుడు ఈ బ్యాంకులు విదేశీ స్పెక్యులేటివ్ వ్యాపారాల్లో పెట్టు బడులను ఎక్కువగా పెట్టేందుకు అవకాశం కలుగుతుంది. ఎక్కువ లాభాలు వచ్చేటప్పుడు స్పెక్యులేటివ్ పెట్టుబడులైతే మాత్రం ఏమిటి నష్టం? అని ప్రశ్నించవచ్చు. స్పెక్యులేషన్ అంటేనే ఒక తరహా జూదం. అందులో లాభాలు వస్తున్న ప్పుడు బాగానే ఉంటుంది. అయితే, ఆ లాభాల్లో ఒక్క పైసా కూడా డిపాజిట్‌దారుల ఖాతాల్లో పడదు. అంతా యజ మానులకే పోతుంది. ఒకవేళ ఆ స్పెక్యులేషన్‌లో నష్టం వస్తే మాత్రం అప్పుడు బ్యాంకులు దివాలా తీసే ప్రమాదాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు డిపాజిటర్లు తమ కష్టార్జితాన్నంతటినీ పోగొట్టుకునే దుస్థితి వస్తుంది. అందుచేత చాలా పెద్దసంఖ్యలో ఉండే డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా చూసినప్పుడు ఈ స్పెక్యులేటివ్ పెట్టు బడులకు దిగడం అనేది చాలా హానికరం. అందువలన భారతీయ డిపాజిటర్లకు లాభాలు ఏవీ రావు సరికదా తమ సమస్తాన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇదేదో పనీ పాటు లేనివాడెవడో ఊహించి చెప్తున్న విషయం కాదు. అమెరికాలో ”హౌసింగ్ బుడగ” 2008లో పేలిపోయినప్పుడు ఆ బుడగ పెరుగుతున్న కాలంలో రుణాలు ఇచ్చిన సంపన్న పెట్టుబడిదారీ దేశాలలోని ప్రధాన బ్యాంక్‌లన్నీ దెబ్బతిన్నాయి. ఆ రుణాలన్నీ ”పనికి మాలిన వ్యర్థ ఆస్తులు”గా ఆ బ్యాంక్‌లకు మిగిలిపోయాయి. అప్పుడు ప్రభుత్వాలు బ్యాంకులకు భారీగా ‘బెయిల్ ఔట్” ప్యాకేజీలు ప్రకటించవలసి వచ్చింది. ఆ బెయిల్ అవుట్ల కార ణంగా డిపాజిటర్లు గణనీయంగా నష్టపోయారు. ఆ హౌసింగ్ బుడగ పేలుడు తాకిడి తగలకుండా తప్పించుకున్న ఒక ప్రధాన దేశం మనదే. ఎందుకంటే అప్పటికి మన భారతీయ బ్యాంకులలో విదేశీ ఆస్తుల వాటా నామమాత్రమే. దాని వలన ”వ్యర్ధ ఆస్తుల” వాటా కూడా చాలా తక్కువగానే ఉండింది. ప్రైవేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రమే కాస్త గణనీయమైన మోతాదులో ఆ ”వ్యర్థ ఆస్తులను” మూటగట్టుకుంది తప్ప ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ దాదాపు ఏ నష్టమూ చవిచూడకుండా బైటపడ్డాయి. ఇప్పుడు మన బ్యాంకుమీద పెత్తనాన్ని విదేశీ సంస్థల చేతుల్లో పెడితే అప్పుడు మన ఆర్థిక వ్యవస్థకు 2008 నాడు ఉన్న బలం ఇంకెతంమాత్రమూ ఉండదు.
బ్యాంకుల మీద విదేశీ పెత్తనాన్ని అనుమతించాలన్న ఒత్తిడి మనకు నయా ఉదారవాదం వైపు నుండి వస్తోంది.పెట్టుబడుల మీద ఏ విధమైన ఆంక్షలనూ నయా ఉదారవాదం అంగీకరించదు. ముఖ్యంగా ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టడాన్ని అది ఒప్పుకోదు. మరీ ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల ప్రభుత్వాలు పెట్టే ఆంక్షలను అది సుతరామూ అంగీకరించదు. అందుకే ప్రస్తుతం ఉన్న 15శాతం పరిమితినీ తొలగించాలని ఒత్తిడి చేస్తుంది. అంతే గాక, భారత ఆర్థిక వ్యవస్థ మీద తన పట్టు పెరగాలంటే భారతీయ బ్యాంకుల మీద పెత్తనం సాధించడం సామ్రాజ్య వాదానికి కీలకమైన అంశంగా ఉంటుంది (నయా ఉదారవాదం అంటేనే సామ్రాజ్యవాదపు వ్యూహం అని మనం గ్రహించాలి). విదేశీ యజమానికి విదేశీ ప్రభుత్వం నుండి పూర్తి దన్ను లభిస్తుంది. అదే మాదిరి దన్ను భారతీయ యజమానికి మన ప్రభుత్వం నుండి అభించదు.
ప్రభుత్వ నియంత్రణ ఉన్న కాలంలో (1990 దశకానికి ముందు కాలంలో) భారతీయ ఆర్థిక రంగంలో చేపట్టిన పురోగామి చర్యలన్నింటినీ ఇప్పటికే గణనీయంగా నయా ఉదారవాదం తిరుగుముఖం పట్టించింది. ఉదాహరణకు: ప్రాధాన్యతారంగ రుణాలకు సంబంధించి పాటించవలసిన ప్రమాణాలు నేటికీ కొనసాగుతున్నా, అసలు ప్రాధాన్యతా రంగం అంటే ఏమిటన్న నిర్వచనాన్నే మార్చివేశారు. అంతకు ముందు రైతులు, చిన్న ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులు , బలహీనవర్గాల వారు ప్రాధాన్యతారంగంగా పరిగణించబడ్డారు. ఇప్పుడు అటవంటి తరగతుల ప్రజలకు బ్యాంకుల నుండి రుణాలు లభించడం దాదాపు అసాధ్యం అయ్యే విధంగా విధానాలను మార్చివేశారు. ఇటీవల ఐద్వా చేసిన అధ్యయనం ప్రకారం, ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలకు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు బ్యాంకులు పదిశాతం కన్నా తక్కువ వడ్డీకే రుణాలనిస్తున్నాయి. ఆ ఫైనాన్స్ కంపెనీలు పేద మహిళలకు 26 శాతం వడ్డీకి రుణాలను ఇస్తున్నాయి. బ్రిటిష్ వాడి కాలంలో గ్రామాల్లో వడ్డీ వ్యాపారి పేదలను ఏ విధంగా కొల్లగొట్టేవాడో, అదే మాదిరిగా ఇప్పుడు జరుగుతోంది. అంతే కాదు, ఈ ఫైనాన్స్ సంస్థలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణిస్తున్నారు! గతంలో బ్యాంకులను జాతీయం చేసినప్పుడు ప్రకటించిన లక్ష్యాలలో వ్యవసాయానికి, చిన్న వ్యాపారులకు, చిన్న పరిశ్రమలకు తేలికగా, మధ్య దళారీలు లేకుండా, రుణాలను అందుబాటులోకి తీసుకు రావాలన్న లక్ష్యం ఒకటిగా ఉంది. ఇప్పుడా లక్ష్యమే దెబ్బ తినిపోయింది.
మరోపక్క బ్యాంకింగ్‌రంగం యావత్తూ, ప్రభుత్వరంగ బ్యాంకులతో సహా బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పనిలో మునిగిపోయింది. ఆ బడా పెట్టుబడిదారులు బ్యాంక్ రుణాలను అత్యధికంగా కాజేయడం, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టడం వంటివి చేయకుండా వారి ఆటలు కట్టించడం కోసం గతంలో బ్యాంక్‌లను జాతీయం చేశారు (ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లలో ప్రభుత్వ వాటా క్రమంగా తగ్గిపోతోందనుకోండి.). ఏదేమైనా మళ్లీ పూర్వ కాలంలో మాదిరిగా గుత్త పెట్టుబడిదారీ సంస్థలు, బ్యాంకులతో కుమ్మక్కై (వాస్తవానికి ఒక్కో గుత్త సంస్థకూ ఒక్కో బ్యాంక్ ఉంది) కొల్లగొట్టే పరిస్థితి ఏర్పడింది. బ్యాంక్ రుణాల పంపిణీ మీద సామాజిక నియంత్రణ క్రమంగా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనికి తోడు బ్యాంకుల యాజమాన్యమే విదేశీ సంస్థల చేతుల్లోకి పోయిందనుకోండి. అప్పుడు పేదలు, మధ్య తరగతి బ్యాంక్ రుణాలకు మరింత దూరం అవుతారు. బడా పెట్టుబడిదారులు బ్యాంక్ రుణాలను కాజేసి మరింత బలుస్తారు. బ్యాంకులలో దాచుకున్న ధనం మరింతగా స్పెక్యులేటివ్ కార్యకలాపాలకు మళ్ళించ బడుతుంది. దేశాన్ని పాలించేది ఫాసిస్టు తరహా శక్తులైనప్పుడు వారి నుండి ఇంతకన్నా ఏం ఆశించగలం? ఈ ప్రయత్నాలను గట్టిగా ప్రతిఘటించడమే మన ముందున్న కర్తవ్యం.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్