Tuesday, September 23, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపేదలంటే కనికరం లేదా..?

పేదలంటే కనికరం లేదా..?

- Advertisement -

ఇండ్ల స్థలాలు దక్కేవరకు పోరాటం ఆగదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
కొమరం భీం వాసులకు ఇండ్ల స్థలాలివ్వాలని పాల్వంచలో పాదయాత్ర
కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ(ఎం) ధర్నా

నవతెలంగాణ-పాల్వంచ
పేదల పట్ల ప్రజా ప్రతినిధులకు కనికరం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని కొమరం భీం కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వెంకటేశ్వర కాలనీ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు 15 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. ముందుగా కాలనీలో బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మహిళలు బతుకమ్మలను ఎత్తుకొని ఇల్లు ఇవ్వాలని నినాదాలు చేస్తూ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయం వద్ద సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లిక్కి బాలరాజు అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ.. కొమరం భీం కాలనీ వాసులకు ఇండ్ల స్థలాలు దక్కేవరకూ పోరాటం ఆగదన్నారు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు సుడిగాలి పర్యటనలు, ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు చేసిన మేలు ఏంటని ప్రశ్నించారు. గుడిసెవాసుల గోస కనబడడం లేదా అని ప్రశ్నించారు.

ఎనిమిది సంవత్సరాలుగా 450 మంది పేద కుటుంబాలు గుడిసెలు వేసుకొని కనీస మౌలిక సదుపాయాలు లేకుండా నివాసం ఉంటే ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తామని ఆరేండ్లు కాలయాపన చేసిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు గడుస్తున్నా వీరి బాధలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం సెలెమెలు తవ్వుకొని అవే నీళ్లు తాగుతున్నా ప్రభుత్వానికి కనీస మానవత్వం లేకుండాపోయిందని విమర్శించారు. ఈ పాదయాత్ర ద్వారా అయినా జిల్లా మంత్రులకు ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కొమరం భీం కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఎర్రజెండా అండగా ఉంటుందని, వారికి ఇండ్ల స్థలాలు దక్కేవరకు ఎంతటి పోరాటానికైనా వెనకాడబోమని తెలిపారు. అనంతరం ఓఎస్‌డీ వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -