Tuesday, September 23, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుడెక్కన్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత

డెక్కన్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌ కాంట్రాక్ట్‌ కార్మికుడు గుండెపోటుతో మృతి
న్యాయం చేయాలని తోటి కార్మికుల ధర్నా
నష్టపరిహారంపై ఆగ్రహం.. కాంట్రాక్టర్‌ నిలదీత
అడ్డుకునేందుకు పోలీసుల యత్నం..
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ఘటన


నవతెలంగాణ- పాలకీడు
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం భవానిపురం డెక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్ట్‌ కార్మికుడు గుండెపోటుతో మృతిచెందడంతో.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ తోటి కార్మికులు పరిశ్రమ ఎదుట ధర్నాకు దిగారు. నష్టపరిహారం ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్‌ ను నిలదీశారు. ఈ సమయంలో యాజమాన్యం, కాంట్రాక్టర్‌, కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం తారాస్థాయికి చేరింది. బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, బలియా జిల్లా కస్కారూర్‌ తాలూకా, కాకర ఘాట్‌కు చెందిన వినోద్‌ అవాక్‌ (45) 2022 జులై నుంచి డెక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ‘ఏపీ బావ కాంట్రాక్టర్‌’ వద్ద అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ప్రకారం పనిచేస్తున్నాడు. పరిశ్రమలో పనిచేసే కార్మికులందరూ ఆ సమీపంలో ఉండే లేబర్‌ కాలనీలో నివాసముంటున్నారు. ఈనెల 21న ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటి వద్ద వినోద్‌ అవాక్‌ బట్టలు ఉతుకుతుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే తోటి కార్మికులు పరిశ్రమలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, అంబులెన్స్‌లో మిర్యాలగూడలోని మ్యాక్స్‌ కేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు.

అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో కార్మికుడు మృతిచెందినట్టు వైద్యులు రిపోర్టు ఇచ్చారు. సదరు కాంట్రాక్టర్‌ అదే రాత్రి మిర్యాలగూడ ఏరియాస్పత్రి నుంచి వినోద్‌ మృతదేహాన్ని అంబులెన్స్‌ ద్వారా మరో నలుగురు కార్మికులతో స్వస్థలానికి తరలించారు. అయితే, మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ సోమవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుమారు 150 మంది కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు. యాజమాన్యంతో సంబంధం లేకుండా అవుట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టర్‌ రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తానని చెప్పాడు. కాదు. రూ.20 లక్షలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. దాంతో కాంట్రాక్టర్‌, యాజమాన్యం, కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాస్త ఘర్షణ వాతావరణం నెలకొంది. యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చింది. ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న కార్మికులు పరిశ్రమలోని సెక్యూరిటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో పోలీసులు కార్మికులను అడ్డుకునే క్రమంలో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

కార్మికుని మృతి బాధాకరం.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 150 మంది కార్మికులు 2022 జులై నుంచి అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిన కొత్త ప్లాంట్‌ నిర్మాణంలో పనిచేస్తున్నారు. మరో రెండు నెలల్లో పని పూర్తి అయ్యి వెళ్లిపోవాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కార్మికుడు మృతిచెందడం బాధాకరం. నష్టపరిహారం విషయంలో సదరు కాంట్రాక్టర్‌, కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫ్యాక్టరీ 40 ఏండ్ల చరిత్రలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదు.
-పరిశ్రమ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ నాగమల్లేశ్వరరావు

చట్టాన్ని చేతిలోకి తీసుకున్న కార్మికులపై కఠిన చర్యలు
డెక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమలో ఘటన జరగడంతో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సాయంత్రం 6 గంటల సమయంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్మికుడు వినోద్‌ గుండెపోటుతో మృతిచెందినట్టు వైద్యులు స్పష్టం చేసినట్టు తెలిపారు. కార్మికుని మృతి విషయంలో యాజమాన్యంపై ఎలాంటి అనుమానాలూ లేవన్నారు. అందువల్లే అదే రాత్రి మృతదేహాన్ని అతని స్వస్థలానికి అంబులెన్స్‌ ద్వారా పంపారని తెలిపారు. అతనితో పని చేసే మరికొంతమంది కార్మికులు నష్టపరిహారం విషయంలో ఘర్షణకు దిగడంతో యాజమాన్యం ఉదయం 11 గంటలకు స్థానిక పోలీస్‌లకు సమాచారం అందించిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భద్రత కల్పించడానికి వచ్చిన పోలీస్‌ సిబ్బందిపై కార్మికులు దాడికి పాల్పడటం చట్ట విరుద్ధమన్నారు. ఎస్‌ఐ కోటేష్‌, హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయన్నారు. పోలీస్‌ విధులకు ఎవరు ఆటంకం కలిగించినా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -