ఈ ఫ్యాక్టరీ రావడానికి కష్టపడింది బీఆర్‌ఎస్ పార్టీనే : మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-నంగునూరు
వేలాదిమంది రైతుల జీవితంలో ఆయిల్ పామ్ కర్మాగారం గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చి, దశ దిశను మారుస్తోందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ కర్మాగారం ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో సోమవారం కర్మాగారాన్ని ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎఫ్డీసీ మాజీ చైర్మెన్ వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇతర బీఆర్‌ఎస్ పార్టీ నేతలతో కలిసి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పామ్ ఆయిల్ కర్మాగారం కల సాకారం కావడం గొప్ప విజయమన్నారు. అందరి దృష్టిలో ఇది కర్మాగారం అయితే ఈ ప్రాంత రైతుల దృష్టిలో ఇది ఒక భావోద్వేగమని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో సాగు నీటికి ఇబ్బందులు తొలగిపోయాయన్నారు.
సిద్దిపేటకు పామాయిల్ పంట తీసుకొద్దామని ప్రయత్నం చేసిన తొలినాళ్లలో ఇక్కడ ఆయిల్ పామ్ సాగు సాధ్యం కాదన్నారని, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటమే కారణమని చెప్పారని తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్(ఐఐఓఆర్) వారు చెబితే తప్ప ఇక్కడ పామాయిల్ సాగు చేయలేమని అధికారులు చెప్పారన్నారు. కానీ కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా మారిందని తెలిపారు. 2019లో అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌తోపాటు చెరువులు, చెక్ డ్యాంల్లో నీళ్లు నింపినట్టు తెలిపారు. ఐఐఓఆర్ 2021లో పరిశోధన చేసి గాలిలో తేమ శాతం పెరిగిందని ఇక్కడ పామాయిల్ సాగు చేసుకోవచ్చని ప్రకటించిందన్నారు. ఆయిల్ పామ్ సాగు లాభసాటిగా మారి రైతుకు ప్రతినెల జీతం పడ్డట్టు ఆదాయం వస్తున్నదని చెప్పారు. చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ కర్మాగారం వరప్రదాయిని కాబోతున్నదన్నారు.
విత్తనం నాటింది బీఆర్‌ఎస్.. ఫలాలు తింటున్నది కాంగ్రెస్..
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పామ్ ఆయిల్ తోటలతో విత్తనం నాటడంతో పాటు కర్మాగారానికి పునాది వేసింది బీఆర్‌ఎస్ అయితే.. ఫలాలు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్లు బయలుదేరారని హరీశ్‌రావు అన్నారు. ఈ కర్మాగారం రావడం వెనుక కష్టం ఎవరిది? తంటాలు పడింది ఎవరనేది ప్రజలకు తెలుసునన్నారు. తాము పడ్డ కష్టానికి ఫలితం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణంలో ఏమాత్రం కష్టపడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రిబ్బను కత్తిరించడానికి కత్తెర జేబులో పెట్టుకొని బయలుదేరాడని అన్నారు. పామాయిల్ తోటల్లో కోకో పంటల సాగు వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, జనగాం నియోజకవర్గం మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనగోని లింగం గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.