ఐపీఓకు రానున్న సహజ వనరుల కంపెనీ : దీపమ్ సెక్రెటరీ అరునిష్ చావ్లా వెల్లడి
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కార్ మళ్లీ పీఎస్‌యూల్లో వాటాల విక్రయాన్ని వేగవంతం చేస్తోంది. ప్రభుత్వ రంగంలోని ఆరు సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే యోచనలో ఉన్నామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) సెక్రెటరీ అరునిస్ చావ్లా తెలిపారు. అయితే ఏ సంస్థల్లో వాటాను విక్రయించేది ఆయన స్పష్టతనివ్వలేదు. కాగా.. ఆ ఆరు సంస్థల్లో మాత్రం మైనారిటీ వాటాల ఉపసంహరణ ఉంటుందని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో చావ్లా వెల్లడించారు. అయితే.. రాయిటర్స్ గతంలో ఇచ్చిన నివేదిక ప్రకారం యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో సహా ఐదు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో వాటాలను విక్రయించాలని ప్రణాళిక వేస్తోందని తెలుస్తోంది. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)లోనూ ప్రభుత్వం తన వాటాను తగ్గించుకోనుందని సమాచారం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సహజ వనరుల రంగంలోని ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుందని చావ్లా తెలిపారు. ఆ సంస్థ పేరును చావ్లా వెల్లడించనప్పటికీ.. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), ఎన్‌హెచ్‌పీసీ తమ గ్రీన్ ఎనర్జీ విభాగాలైన ఓఎన్‌జీసీ గ్రీన్ ఎనర్జీ, ఎన్‌హెచ్‌పీసీ రెన్యూవబుల్ ఎనర్జీలను లిస్టింగ్ చేయడాన్ని పరిశీలిస్తున్నాయని తెలుస్తోంది. మైనారిటీ వాటాల విక్రయాలు, ఐపీఓలు ప్రభుత్వానికి ఆదాయాలను పెంచడానికి సహాయపడతాయని చావ్లా పేర్కొన్నారు. 2026 మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్స రంలో పీఎస్‌యూల్లో వాటాల విక్రయం ద్వారా రూ.47వేల కోట్ల నిధులను సమీకరించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయాలు అంచనా లక్ష్యాన్ని మించిపోవచ్చని చావ్లా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల నుంచి రూ.69వేల కోట్ల నిధులు డివిడెండ్ రూపంలో రావొచ్చని అంచనా వేశారు.
ఆరు పీఎస్‌యూల్లో వాటాల విక్రయం
- Advertisement -
- Advertisement -