– ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మోహన్‌లాల్
– రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పలువురికి పురస్కారాలు
71వ జాతీయ చలన చిత్ర పురస్కార ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలతోపాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. 2023 సంవత్సరానికిగానూ ఉత్తమ నటుడిగా షారూక్‌ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (ట్వల్త్ ఫెయిల్), ఉత్తమ నటిగా రాణీముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) పురస్కారాలను అందుకోగా, ఇదే వేడుకలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మోహన్‌లాల్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ,’ఈ పురస్కారాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. అంతా మ్యాజిక్ అనిపిస్తోంది. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఈ పురస్కారంనా ఒక్కడికే కాదు ఇది మలయాళ సినీ పరిశ్రమకు చెందుతుంది. మరింత బాధ్యతగా పని చేస్తా’ అని చెప్పారు.
ఇక టాలీవుడ్ నుంచి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఎంపిక కాగా దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి పురస్కారాలు అందుకున్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ జెట్టి వెంకట్ కుమార్ ‘హనుమాన్’ చిత్రానికి ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పురస్కారాలు స్వీకరించారు.
అదే చిత్రానికి బెస్ట్ యాక్షన్ విభాగంలో స్టంట్ కొరియోగ్రాఫర్లు నందు, పధ్వి జాతీయ పురస్కా రాలు అందుకున్నారు. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ‘యానిమల్’ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో అవార్డు అందుకోగా, ‘గాంధీతాత చెట్టు’ చిత్రానికి ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి పురస్కారం స్వీకరించింది. అలాగే ‘బేబీ’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా సాయిరాజేష్, ఉత్తమ నేపథ్యగాయకుడిగా పీవీఎస్‌ఎన్ రోహిత్ పురస్కారాలను అందుకున్నారు.