దసరా పండుగ వచ్చేస్తోంది. ఇప్పటికే స్కూళ్లకు పండుగ సెలవులు ఇచ్చేశారు. దాంతో చాలా మంది ఇప్పటి నుంచే పిల్లల కోసం వివిధ రకాల పిండి వంటలు సిద్ధం చేస్తుంటారు. సాధారణంగా పిండి వంటలంటే చెక్కలు, జంతికలు, కారప్పూస, గర్జలు వంటివి అందరూ చేస్తూనే ఉంటారు. అలాకాకుండా ఈ సారి కాస్త వెరైటీగా చేసి పెట్టండి. అప్పుడు బయటి చిరుతిండి గురించి మర్చిపోతారు. అలాంటి వెరైటీ పిండి వంటలే మీకోసం ఈరోజు…
రిబ్బన్ పకోడీ
కావాల్సిన పదార్థాలు: పుట్నాలపప్పు – కప్పు, కారం – రెండు టీస్పూన్లు, జీలకర్ర – టీస్పూను, బియ్యప్పిండి – కప్పు, శనగపిండి – కప్పు, ఉప్పు – రుచికి తగినంత, నువ్వులు – రెండు టేబుల్‌స్పూన్లు, ఇంగువ – నాలుగు చిటికెళ్లు, బటర్ – నాలుగు టేబుల్ స్పూన్లు, నూనె – వేయించడానికి తగినంత
తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్‌లో పుట్నాల పప్పు, కారం, జీలకర్ర వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో బియ్యప్పిండి, శనగపిండి, పుట్నాల పప్పు పొడి, రుచికి తగినంత ఉప్పు, తెల్లవి లేదా నల్ల నువ్వులు, ఇంగువ వేసుకొని అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆ పిండిలో మరిగించుకున్న వేడి వేడి బటర్‌ని వేసి గరిటెతో కలిపి అది చల్లారాక పిండి మొత్తానికి పట్టేలా చేతితో రబ్ చేస్తూ కలుపుకోవాలి. అవసరం మేరకు నీళ్లను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని సాధ్యమైనంత వరకు కాస్త గట్టిగానే కలుపుకోవాలి. జంతికల గొట్టం తీసుకుని అందులో రిబ్బన్ పకోడీ ప్లేట్‌ను అమర్చుకుని నూనె రాసి అందులో పిండి నింపుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మంటను తగ్గించి కాగుతున్న నూనెలో మురుకుల గొట్టంతో నేరుగా రిబ్బన్ పకోడీని వత్తుకోవాలి. తర్వాత స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు.
క్యారెట్ గులాబ్ జామూన్
కావాల్సిన పదార్థాలు: ఆరు – క్యారెట్లు, రెండు టేబుల్ స్పూన్లు – నెయ్యి, రెండు కప్పులు – పాలు, ఐదు టేబుల్ స్పూన్లు – బొంబాయి రవ్వ, కప్పు – పాల పొడి, రెండు కప్పులు – చక్కెర, చెంచా – యాలకుల పొడి, వేయించడానికి సరిపడా – నూనె, కప్పు – నీళ్లు.
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో చక్కెర, నీరు పోసి మరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగి లేత పాకంలా తయారవుతున్నప్పుడు అందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కనుంచాలి. ఇప్పుడు క్యారెట్లను శుభ్రంగా కడిగి పైన చెక్కును తొలగించుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్ మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్‌లో బాగా వేయించాలి. తర్వాత అందులో పాలు పోసి బాగా కలపాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉడకనివ్వాలి. అది ఉడుకుతునప్పుడు బొంబాయిరవ్వ, పాలపొడి వేసి మరోసారి బాగా కలపాలి. తర్వాత లో టూ మీడియం ఫ్లేమ్‌లో ఆ మిశ్రమం దగ్గరకు అయ్యేవరకూ కలుపుతూ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు చల్లారిన క్యారెట్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆ ఉండలను నెమ్మదిగా కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అవి వేడి కాస్త చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కనుంచిన పాకంలో వేసి వాటికి పాకం పట్టేలా కాసేపు ఉంచి సర్వ్ చేసుకుంటే చాలు.
మొక్కజొన్న సర్వపిండి
కావల్సిన పదార్థాలు: కప్పు – మొక్కజొన్న గింజలు, కప్పు – బియ్యప్పిండి, ఐదారు – పచ్చిమిర్చి, కప్పు – మొక్కజొన్న రవ్వ, నాలుగైదు – వెల్లుల్లి రెబ్బలు, పావు కప్పు – శనగ పప్పు, చెంచా – కారం, రెండు రెమ్మలు – కరివేపాకు, మూడు చెంచాలు – సన్న ని ఉల్లిగడ్డ తరుగు, చెంచా – జీలకర్ర, చెంచా – అల్లంపేస్ట్, చెంచా – సన్నని కొత్తిమీర తరుగు, అరచెంచా – పసుపు, పల్లీలు – మూడు చెంచాలు, టేస్ట్‌కి తగినంత – ఉప్పు, అర కప్పు – నూనె.
తయారీ విధానం: ముందుగా ఒక చిన్న గిన్నెలో శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అది నానేలోపు తాజా మొక్కజొన్న పొత్తులను తీసుకుని వాటి నుంచి ఒక కప్పు పరిమాణంలో గింజలను ఒలిచి గిన్నెలోకి తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి వడకట్టి పక్కనుంచాలి. అలాగే సన్నని ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు తరుగును సిద్ధం చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లిరెబ్బలు, మొక్కజొన్నగింజలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో మొక్కజొన్నరవ్వ, బియ్యప్పిండి, నానబెట్టిన శనగపప్పు, రుచికి సరిపడా కారం, ఉప్పు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, అల్లంపేస్ట్, పసుపు, వేయించి పొట్టుతీసి పెట్టుకున్న పల్లీలు, మొక్కజొన్న పేస్ట్ కూడా వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మందపాటి కడాయి తీసుకుని దానిలో తగినంత నూనె అప్లై చేసుకోవాలి. కొద్దిగా పిండిముద్దను తీసుకుని కడాయిలో అన్నివైపులా పరుచుకునేలా చేతితో కాస్త మందపాటి రొట్టెలా ఒత్తుకోవాలి. సర్వపిండిని వత్తుకునే ముందు తగినంత నూనె వేస్తే ముద్ద చక్కగా పరుచుకుంటుంది. సర్వప్పలా ఒత్తకున్నాక దానిపై చేతితో అక్కడక్కడా చిల్లులు పెట్టాలి. ఆ చిల్లుల్లో కాస్త నూనెను చుక్కలు చుక్కలుగా వేసుకోవాలి. ఆ కడాయిని స్టవ్ మీద ఉంచి పైన మూతపెట్టి లో ఫ్లేమ్‌లో 10 నుంచి 15 నిమిషాల పాటు కాలనివ్వాలి. అంతే కమ్మని మొక్కజొన్న సర్వపిండి రెడీ..!
కుర్‌కురే
కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం – కప్పు, బియ్యప్పిండి – రెండు టేబుల్ స్పూన్లు, వెన్న – టేబుల్ స్పూన్, వాము – అర టీస్పూను, జీలకర్ర – అర టీస్పూను, ఉప్పు – సరిపడా, శనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు, కారం – టీస్పూను.
తయారీ విధానం: మిక్సీజార్‌లోకి అన్నం తీసుకోవాలి. అందులో బియ్యప్పిండి, బటర్, ఉప్పు, వాము, జీలకర్ర, కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నాన్ని ఓ గిన్నెలోకి తీసుకొని అందులో శనగపిండి, కారం వేసి మెత్తగా కలుపుకోవాలి. ఈలోపు జిప్‌లాక్ కవర్ లేదా పైపింగ్ బ్యాగ్ లేదా పాలిథిన్ కవర్ తీసుకుని దాని లోపల పిండిని పెట్టి చివర కొద్దిగా కట్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసుకొని మంటను తగ్గించి కవర్ సాయంతో నూనెలో కుర్‌కురే షేప్‌లో ప్రెస్ చేసుకోవాలి. మంటను సిమ్‌లో ఉంచే మధ్యమధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. కుర్‌కురే క్రిస్పీగా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జల్లి గరిటెతో ప్లేట్‌లోకి తీసుకోవాలి. పిండి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత లైట్‌గా కారం, చాట్ మసాలా చల్లీ మొత్తానికి పట్టేలా కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే అన్నం కుర్‌కురే రెడీ.