Wednesday, September 24, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమేధోవలస, తిరిగి రాకపై చైనా ముందుచూపు!

మేధోవలస, తిరిగి రాకపై చైనా ముందుచూపు!

- Advertisement -

రానున్న రోజుల్లో తమ దేశానికి హెచ్‌-1బి వీసా మీద వచ్చే వారు లక్ష డాలర్లు(88 లక్షలరూపాయలు) చెల్లించాల్సి ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయం భారతీయులను విస్మయానికి గురిచేసింది. అనేక మంది డాలర్‌ కలలు కల్లలైనట్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయానికి ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా కార్పొరేట్లు తెచ్చే ఒత్తిడికి లొంగి సవరించుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ప్రపంచవ్యాపితంగా మేధోవలస-తిరిగి రాకల గురించి మధనం ప్రారంభమైంది.ట్రంప్‌ నిర్ణయం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది మరికొంత స్పష్టత వచ్చిన తరువాతనే చెప్పుకోవటం మంచిది. ఈ సంద ర్భంగా వచ్చిన కొన్ని వ్యాఖ్యలు, పత్రికా శీర్షికలు, వాటి వెనుక ఉన్న అంశాల గురించి చూద్దాం. అమెరికా లక్షల డాలర్ల ఫీజు కేవలం ఒక చెడ్డ విధానమేగాక చైనాకు వ్యూహాత్మక బహుమతి అంటూ ఒక బడా ఆంగ్ల పత్రికలో విశ్లేషణ ప్రారం భమైంది. హ్రస్వదృష్టితో ఉన్న అమెరికా వైఖరి కేవలం చైనా సాంకేతిక ప్రగతి పెరగటానికే తోడ్పడుతుందని కూడా వ్యాఖ్యాత వాపోయారు.

విలువైన సంపదలను వెండి పల్లెంలో పెట్టి చైనాకు అప్పగిస్తున్నారంటూ మరొకరు. ఎవరెన్ని ఏడ్పులు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా గడచిన ఐదు దశాబ్దాల చరిత్రను చూసినపుడు అమెరికా, ఇతర ధనిక దేశాల విధాన నిర్ణేతలు, మేథావులు అనుసరించిన విధానాలు, అడ్డుకోవటాలు జనచైనా ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయన్నది జగమెరిగిన సత్యం. చైనా గురించి ఈ మాటలు చెబుతున్నవారు ట్రంప్‌ నిర్ణయం భారత్‌కు బహుమతి అని ఎందుకు చెప్పలేకపోయారు? అత్తారింటికి దారేది సినిమాలో పదిలక్షల రూపాయల సూట్‌కేసును పవన్‌ కల్యాణ్‌ బహుమతిగా ఇస్తే దాన్ని తీసుకెళ్లిన ఆలీ తాళం రావటం లేదంటూ తిరిగి వచ్చిన దృశ్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆకస్మి కంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని స్థితిలో పదకొండేండ్ల మోడీ పాలన మనదేశాన్ని ఉంచిందని భావించాలా? ఎందుకంటే ఏది జరిగినా మోడీ కారణంగానే అంటున్నారు గనుక ఇలా వ్యాఖ్యానించాల్సి వస్తోంది.

ప్రతిభావంతులకు చైనా,బ్రిటన్‌ వల అన్నది ఒక ప్రముఖ తెలుగు పత్రిక శీర్షిక. అమెరికా అడ్డుకుంటే ప్రతిభను వృధా కానివ్వాలా? ఆ పని మనమెందుకు చేయటం లేదని ప్రశ్నించాల్సిన వారు ఇతర దేశాల గురించి అలాంటి పద జాలంతో కించపరుస్తూ వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి కె వీసాల జారీతో చైనా ఎంతో చురుకుగా ప్రపంచంలోని స్టెమ్‌ (సైన్సు,టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత) మేధావులను ఆకర్షిస్తున్నదని ట్రంప్‌ ప్రకటన తర్వాత వార్తలు వెలువడ్డాయి. నిజానికి చైనా నిర్ణయం ఎంతో ముందుగానే తీసుకున్నది. మన మీడియా, అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ మన పాలకులు చైనా చర్యలను గుర్తించలేదు, అసలు ప్రయత్నం కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు.మనం లేకపోతే అమెరికాకు గడవదు అని మనజబ్బలు మనం చరుచుకున్నాం తప్ప అసలు వారెందుకు ప్రపంచ మంతటి నుంచీ మేధావంతులను ఆకర్షిస్తున్నారు, తేడా వచ్చి ఆకస్మికంగా అడ్డుకుంటే ప్రత్యామ్నాయం ఏమిటని 2047 విజన్‌ గురించి చెబుతున్న నరేంద్రమోడీ గానీ, అంతకు ముందే విజన్లను ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గానీ ఎప్పుడైనా ఆలోచించారా ? కాక మీద ఉన్నపుడే ఇనుము మీద దెబ్బలు వేసి అవసరానికి అనుగుణంగా మలుచుకోవాలి. ఇప్పుడు యువత కూడా ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. అమెరికా గాకపోతే ఆస్ట్రేలియా, అదిగాక పోతే ఆఫ్రికా అన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు.

సంచార తెగమాదిరి ఎక్కడికో అక్కడికి పోవటం తప్ప మన దేశం పురోగమించటం గురించి, గౌరవప్రదమైన ఉపాధి గురించి ఎందుకు ఆలోచించరు? అమెరికా వ్యూహాత్మకంగా స్వయంగా చేసిన తప్పిదమం టున్నారు సరే, దాంతో మనకు పోయేదేమీ లేదు, మనమెందుకు వ్యూహాత్మకంగా ఆలోచించలేదని కదా పాఠాలు తీసుకోవాల్సింది. చైనా కె వీసా ఎంతో స్మార్ట్‌గా, వ్యూహా త్మకంగా, నిర్దాక్షిణ్యమైన అవకాశవాదంతో (రూత్‌లెస్లీ ఆపర్చ్యునిస్టిక్‌) ఉందని కూడా ఉక్రోషం వెలిబుచ్చారు. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకొనేందుకు చైనాలోని ఏదో ఒక కంపెనీ ఇచ్చే అవకాశంతో పనిలేదు. అనుభం కూడా అవసరం లేదు. వారు కోరిన అర్హతలు ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముందే చెప్పుకున్నట్లు ప్రతిభావంతులను ఆకర్షించటం ఇప్పుడే ప్రారంభం కాలేదు. వేయి ప్రతిభల పథకం(టిటిపి) పేరుతో చైనా 2008 నుంచే ఆకర్షించటం ప్రారంభించింది. అయితే చైనా మీద ఉన్న తప్పుడు ప్రచారం, అమెరికాతో పోలిస్తే దక్కే ప్రతిఫలం తక్కువగా ఉండటం, కమ్యూనిస్టు నిరం కుశ ప్రభుత్వం అనే వ్యతిరేక భావనలు ఇలా అనేక అంశాలు చైనా వైపు చూడటానికి యువతను అడ్డుకున్నాయి. అది కూడా చాపకింద నీరులా తన పథకాన్ని అమలు జరిపింది తప్ప హడావుడి చేయలేదు. ఇప్పుడు చైనా సాధిస్తున్న పురో గతి, ఇతర దేశాల్లో విధిస్తున్న ఆంక్షలు, జాత్యహంకారం వంటి వివక్ష ఇతర సమస్యల కారణంగా గతంలో మాదిరి అడ్డుకొనే అవకాశాలు పరిమితం. అనేకమంది వైద్య విద్యకోసం చైనా వెళ్లిన సంగతి తెలిసిందే.

మన దేశానికి ట్రంప్‌ మంచి అవకాశాన్ని కల్పించాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవటం మన విధాన నిర్ణేతలు, పాలకుల చేతుల్లో ఉంది. సేవారంగంలో మన యువత ముందంజలో ఉంది. మొత్తంగా చూసినపుడు సాధించాల్సింది ఇంకా ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది. ప్రపంచంలో పరిశోధన, అభివృద్ధి మీద చేస్తున్న ఖర్చు వంద రూపాయలు అనుకుంటే మనం చేస్తున్నది కేవలం రూ.2.90 మాత్రమే. అదే అమెరికా 24.8, చైనా 22.80 ఖర్చు చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ప్రపంచంలో నవకల్పనలకు పేటెంట్‌ హక్కులు లభిస్తున్నాయి. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం 2023లో చైనా అత్యధికంగా 16,19,268 దరఖాస్తులు సమర్పించగా 7,98,347 మంజూరయ్యాయి. రెండవ స్థానంలో ఉన్న అమెరికా 5,94,340కి గాను 3,20,410 పొందింది. మన విషయానికి వస్తే ఐదవ స్థానంలో 70,068 మాత్రమే సమర్పించి 30,490 పొందాము.

మూడవ స్థానంలో ఉన్న జపాన్‌ 2,89,530కి గాను 2,01,420, నాలుగవది దక్షిణ కొరియా 2,37,633కు గాను 1,35,180 పొందాయి. ఏదైనా పిండికొద్దీ రొట్టె. గడచిన పదకొండు సంవత్సరాలుగా అంతకు ముందు కూడా పరిశోధన, అభివృద్ధికి మనదేశం చేసిన ఖర్చు పెరగలేదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తే ఇలాగే ఉంటుంది. పోనీ వాటినైనా వెలికి తీస్తారా అంటే అదీ చేయరు. పడక కుర్చీ కబుర్లు చెబుతుంటారు. యుద్ధ ప్రాతిపదికన కొన్నేండ్లపాటు అవసరమైన నిధులు కేటాయించి ప్రోత్సహిస్తే మనం కనీసం మూడవ స్థానానికి చేరుకుంటాం.ఈ అవకాశాన్ని మోడీ సర్కార్‌ సద్విని యోగం చేస్తుందా? చౌకబారు రాజకీయాల మీదనే కేంద్రీకరిస్తుందా? కొంతమంది అంచనా వేస్తున్నట్లు రానున్న రోజుల్లో ప్రావీణ్యం అసలైనశక్తిగా ముందుకు రానుంది. దీన్ని చైనా ఎప్పుడో గుర్తించింది, అమెరికా ఇప్పుడు నేర్చు కుంటున్నది, మరి మనం? అవు సైన్సును నమ్ముకుంటే గోమూత్రం, పేడ దగ్గరే ఉండిపోతాం.

ఇప్పటి వరకు చైనా నుంచి అమెరికాకు మేధోవలస జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగి రావటం ప్రారంభమైంది. దీనికి అక్కడ పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు పెరగటంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులో చైనాను విస్మరించలేని స్థితికి చేరుకోవటం, అక్కడ కూడా అనేక స్టార్టప్‌లు ప్రారంభించటానికి ప్రభుత్వం అవకాశం కల్పించటం వంటి కారణాలు దీనికి దోహదంచేస్తున్నాయి.2035 నాటికి ప్రపంచ అగ్రస్థానంలో సాంకేతిక రంగాన్ని నిలబెట్టేందుకు చైనా పూనుకుంది. అందుకు అవసరమైన పెట్టుబడిలో అమెరికాతో పోటీపడుతోంది.ఓయిసిడి సంస్థ సమాచారం ప్రకారం పదేండ్ల క్రితం అమెరికా చేసిన పరిశోధన ఖర్చులో 72శాతం చేసిన చైనా 2023నాటికి 780 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 96శాతానికి చేరుకుంది. పరిశోధన ఉత్పత్తిలో 2017లోనే అమెరికాను అధిగమించింది. డీప్‌ సీక్‌ సంచలనం తెలిసిందే. దానిలో పనిచేసిన వారందరూ చైనా యువకులే.కొంత మందికి ఎక్కడా పని చేసిన అనుభవం కూడా లేదు. దీనితో పాటు ఝజియాంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాడ్యుయేట్లు డీప్‌ రోబోటిక్స్‌లో ప్రావీణ్యం పొందారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ప్రమాదకరమైన హై ఓల్టేజి సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తున్నారు. సిలికాన్‌ వాలీతో పోటీ పడేట్లుగా చైనా ప్రోత్సహిస్తున్నది.

సాంకేతిక పరిజ్ఞాన ఎగుమతులపై అమెరికా విధించిన నిషేధాలను సవాలుగా తీసుకుంది.అవకాశాలను అందిపుచ్చుకోవటంలో చైనాను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 1970 దశకంలో అనివార్యమైన స్థితిలో ఐరాస భద్రతా మండలిలో కమ్యూనిస్టు చైనాను అసలైన శాశ్వత ప్రతినిధిగా అమెరికా గుర్తించాల్సి వచ్చింది. దాని కొనసాగింపుగా చైనా ప్రారంభించిన సంస్కరణలను సొమ్ము చేసుకోవాలని అమెరికా భావించింది. తాత్కాలిక లాభాలను అమెరికన్లు చూస్తే దీర్ఘకాలిక లక్ష్యంతో సంస్కరణలను చైనా తలపెట్టింది.1978 వరకు అమెరికా ఉన్నత విద్యా సంస్థలలో చైనీయులకు ప్రవేశం లేదు. సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకొనే ప్రక్రియలో భాగంగా అమెరికా సైన్సు సలహాదారు ఫ్రాంక్‌ ప్రెస్‌ బీజింగ్‌ సందర్శనకు వచ్చాడు. అక్కడి నుంచి నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు ఫోన్‌ చేసి తమ విద్యార్థులు ఐదువేల మందిని అమెరికా విద్య కోసం పంపేందుకు ఆసక్తితో ఉన్నట్లు చైనా చెప్పిందని, ఏం చేయమంటారని అడిగాడు. ఐదువేలేం ఖర్మ లక్ష మందిని పంపవచ్చని వారికి చెప్పండని కార్టర్‌ సమాధానమిచ్చాడట.

అలా వెళ్లిన లక్షలాది మంది చైనా విద్యార్ధులు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏటా 15 బిలియన్‌ డాలర్ల లబ్ది కలించారు.ఆ విధంగా అమెరికా మేధోవలసను ప్రోత్సహించి ఎంతోలబ్ది పొందింది. అక్కడి మార్కో పోలో అనే మేథో సంస్థ ప్రపంచ కృత్రిమే మేథ సర్వే చేసింది. అమెరికాలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధకుల్లో 37శాతం మంది అమెరికన్లు కాగా చైనీయులు 38శాతం ఉన్నట్లు తేలింది.చాట్‌ జిపిటి 4 ప్రాజెక్టులో కీలకమైన సేవలందించిన వారిలో ఇరవై శాతం మంది చైనీయులే. వీటన్నింటిని చూసిన తర్వాత భయపడిన అమెరికన్లు పొమ్మనకుండా చైనీయులకు పొగపెట్టారు. మా దేశంలో చదువుకొనేందుకు రావచ్చు గానీ స్టెమ్‌ కోర్సుల బదులు, మావవ, సామాజిక శాస్త్రాలను ఎంచుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన కోర్సులో ప్రవేశాన్ని పరిమితం చేశారు. అందుకే చైనీయులు వేలాది మంది స్వదేశం బాటపట్టి అమెరికాకు పాఠం చెప్పేందుకు పూనుకున్నారు. మోడీ సర్కార్‌ మనవారికి అలాంటి అవకాశాలను కల్పిస్తుందా అన్నది శేష ప్రశ్న!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -