భూనిర్వాసితులకు అండగా సీపీఐ(ఎం) : పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో ఆయా ప్రాజెక్టుల మూలంగా భూమిని నష్టపోయే నిర్వాసితులకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. రాష్ట్ర, జాతీయ రోడ్డు ప్రాజెక్టులతోపాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణం సందర్భంగా భూములు కోల్పోయే బాధితులను ఆదుకుంటామని చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నిర్వాసితులకు న్యాయం జరిగేలా ఉద్యమాలు, పోరాటాలు చేపడతామని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ ప్రభావిత జిల్లాలు, మండలాల సీపీఐ(ఎం) నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, తెలంగాణ రైతు రాష్ట్ర ప్రధానకార్యదర్శి టీ సాగర్ అధ్యక్షత వహించగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సాగునీటిరంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఈసందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఆయా ప్రాజెక్టులు, పథకాలను అమలుచేస్తున్న సందర్భంగా అత్యధికంగా భూసేకరణ చేస్తున్నాయన్నారు. దీనిమూలంగా పేద ప్రజలు, రైతులు తమకున్న కొద్దిపాటి భూములను కోల్పోవాల్సి వస్తున్నదని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి వెంటనే ప్రజలు, రైతులను కదిలించాలని అన్నారు. రైతుల భూములు తీసుకుంటే సహించబోమన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంటు శాస్త్రీయంగా జరగాలని చెప్పారు. భూమికి భూమి ఇచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ రేటు కంటే అధికంగా భూములు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలను, విధానాలను ఈసందర్భంగా ప్రశ్నిస్తామని వ్యాఖ్యానించారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం పాత అలైన్‌మెంటు ప్రకారమే చేయాలని సూచించారు. రైతులు, స్థానిక పేదలకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తామని అన్నారు.
పలువురి హాజరు
ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై బాధిత రైతుల జిల్లాల నుంచి సీపీఐ(ఎం) నాయకులు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లోని 22 మండలాల నుంచి నాయకులు సమావేశానికి వచ్చారు. ఈసందర్భంగా స్థానిక భూసేకరణ వ్యవహారంపై చర్చించారు.
భూనిర్వాసితుల కోసం పోరాటం
ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజనం కోసం చూస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలి. భూసేకరణ సందర్భంగా వేలాది ఎకరాలు నష్టపోతున్న రైతులు, పేద ప్రజల తరపున సీపీఐ(ఎం) పోరాటం చేస్తుంది, ఈ ప్రాజెక్టు కోసం 45 వేల ఎకరాల భూమితోపాటు రూ. 22 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. భారీస్థాయిలో రైతుల భూములను తీసుకోవడం ఎంతమాత్రం సరికాదు. రైతుల ప్రయోజనాల కోసం సీపీఐ(ఎం) పోరాడుతుంది.
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
చట్ట ప్రకారమే భూసేకరణ చేయాలి
ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు ఇతర ప్రాజెక్టుల కోసం చట్ట ప్రకారమే భూసేకరణ చేయాలి. పర్యావరణం గురించి పట్టించుకోవాలి. ప్రభుత్వం కోసం చేస్తే 70 శాతం రైతులు, ప్రజలు ఒప్పుకోవాలి. ప్రయివేటు కోసం చేస్తే 80 శాతం అంగీకరించాలి. ప్రభుత్వ భూమిని అయినా పట్టా భూమితో సమానంగా ఖాస్తులో ఉండే రైతులకు పరిహారమివ్వాలి. భూసేకరణను అడ్డుకుంటే కేసులు పెట్టడం ఎంతమాత్రం సరికాదు.
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్
ప్రభుత్వ భూములే తీసుకోవాలి
ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములే తీసుకోవాలి. రైతులు, పేదలవి ముట్టుకోవద్దు. 2013 భూసేకరణచట్టాన్ని అమలుచేయాలి. పరిహారం విషయంలో రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమి ఉంది. వాటిని అభివృద్ధి కోసం వాడుకోవాలి.
సారంపల్లి మల్లారెడ్డి