నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సందర్బంగా డెఫ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాదు వారు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. వ్యక్తుల మధ్య సంభాషణకు భాష అవసరం. అలాంటి భాషను వినాలేని, మాట్లాడలేని బధిరులకు సమాచారాన్ని అర్థమయ్యే రీతిలో అందించేందుకు ఆవిర్భవించిందే సంకేత భాష విధానం అన్నారు. బాడీ లాంగ్వేజ్, శరీర కదలికలు, కనుబొమ్మలను కదపడం, ముఖ కవళికల ద్వారా ఎదుటి వ్యక్తితో సంభాషణ చేసే నైపుణ్యాన్ని సంకేత భాష అందిస్తుందని వేళ్లు లేదా చేతి సంజ్ఞల ద్వారా మనసులోని భావాలను వ్యక్తపరచడం గొప్ప విషయం అన్నారు.
2018 సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మొదటిసారిగా అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని నిర్వహించిందని ఈ సంవత్సరం 2025 అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం యొక్క థీమ్ “సంజ్ఞా భాష హక్కులు లేకుండా మానవ హక్కులు లేవు”. అన్నారు. సంజ్ఞా భాషను ఉపయోగించే వారి హక్కును గుర్తించకుండా మరియు మద్దతు ఇవ్వకుండా బధిరుల హక్కులను పూర్తిగా సాధించలేమని ఈ థీమ్ నొక్కి చెబుతుంది అన్నారు.
బాధిరుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే గారిని కోరగా స్థలం & నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సౌందర్య , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, భూపతి , Dewa సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.