– అంబుష్ ఘడ్ అడవుల్లో ఎన్ కౌంటర్.. గోపాల్ రావు పల్లెలో విషాదం
– గోపాల్ రావు పల్లెకు చెందిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ కడారి
– మృతదేహం కోసం వెళ్ళిన సోదరుడు కరుణాకర్ రెడ్డి
– కడసారి చూపుకు ఎదురుచూస్తున్న గోపాల్ రావు పల్లె
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
పుట్టి పెరిగిన ఇంటిని ఊరును వదిలి వెళ్ళిన ఆ యువకుడు 45 ఏళ్ల తర్వాత కానరాని అడవుల్లో పోలీసుల ఎన్కౌంటర్లో మరణించి శవమై పుట్టిన ఊరికి వస్తుండటం గ్రామంలో ప్రతి ఒక్కరిని కదిలించింది. ఆస్తితోపాటు చదువు ఉండి కూడా ప్రజల కోసం నేనుంటానంటూ విప్లవ పార్టీలోకి వెళ్లిన కడారి సత్యనారాయణరెడ్డి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు అనే విషాదంలో గోపాల్ రావు పల్లె గ్రామం నిశ్శబ్దంతో ఉంది. ఎప్పటికైనా తమ ఊరికి సత్యనారాయణ రెడ్డి వస్తాడు అని ఆయన బంధువులు స్నేహితులు అనుకున్నారు కానీ ఇంతటి ఘోరం జరుగుతదని అనుకోలేదని ఆ గ్రామస్తులు విలపిస్తున్నారు. చిన్నప్పుడు అందరితో కలివిడిగా ఉండే కడారి ఇలా మధ్యలోనే మమ్మల్ని విడిచి వెళతాడని అనుకోలేదని ఆ కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగారు. నేడు గోపాల్ రావు పల్లెకు ఆయన మృతదేహం వస్తుండడంతో గ్రామం ఎదురు చూస్తుంది.
నాలుగున్నర దశాబ్దాల పోరాటం…
నాలుగున్నర దశాబ్దాలు ప్రజల కోసం పోరాటం చేసిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస, అలియాస్ దాదా, అలియాస్ సాధు చత్తీస్గడ్ రాష్ట్రంలోని జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. సత్యనారాయణ రెడ్డి కుటుంబం లోని అందరూ విద్యావంతులు కాగా తండ్రి కిష్టారెడ్డి ఉపాధ్యాయుడు సోదరుడు కరుణాకర్ రెడ్డి మండల విద్యాధికారిగా పని చేశారు. సత్యనారాయణ రెడ్డి కూడా ప్రాథమిక విద్యను సిరిసిల్లలో పూర్తిచేసి పెద్దపల్లిలో ఐటిఐ చేశాడు బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో సత్యనారాయణ రెడ్డి ఉద్యోగంలో చేరి కార్మికుల పక్షాన ఉండి పోరాటం చేశాడు ఈ సమయంలోనే ఫ్యాక్టరీలో ఒకరి హత్య కావడం ఆ హత్యకు సత్యనారాయణ రెడ్డి కారణమని అతనిపై కేసులు నమోదు చేశారు దీంట్లో భాగంగా ఆయన జైలుకు వెళ్లి తిరిగి వచ్చి పీపుల్స్ వార్ లో చేరిపోయాడు అప్పటినుంచి అతను వెనక్కి తిరిగి చూడలేదు అంచలంచలుగా దళ సభ్యుని నుంచి మావోయిస్టులో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు.
మావోయిస్టు లో జిల్లాకు చెందినవారు ఇంకా మిగిలింది ముగ్గురే…
సిపిఐ మావోయిస్టు లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు ఐదుగురు ఉండగా కొద్ది రోజుల క్రితం కోనరావుపేట మండలం శివంగాలపల్లికి చెందిన జ్యోతి అలియాస్ జ్యోతక్క లొంగిపోయారు. గోపాల్ రావు పల్లికి చెందిన కడారి సత్యనారాయణరెడ్డి రెండు రోజులకు చత్తీస్గడ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు ఇంకా మిగిలింది తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన బాలసంతుల ఉప్పలయ్య అలియాస్ చిన్నన్న, ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి కి చెందిన శ్రీనివాస్ అలియాస్ భరత్ అలియాస్ యాదన్న, కోనరావుపేట మండలం ధర్మారం కు చెందిన చంద్రయ్య అలియాస్ ఆజాద్ లు మావోయిస్టు పార్టీలో మిగిలి ఉన్నారు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు ఉన్నారా అని కలవరం మొదలవుతుంది. ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
మృతదేహం కోసం గోపాల్ రావు పల్లె ఎదురుచూపులు…
తన ఒడిలో పురుడు పోసుకున్న బిడ్డ… తన ఒడిలోనే శాశ్వతంగా నిద్రించాలనుకున్న ఆ గోపాల్ రావు పల్లె గ్రామం ప్రజల కోసం పోరాటం చేసి అసువులు బాసిన కడారి సత్యనారాయణ రెడ్డి ఆఖరి చూపు కోసం ఎదురుచూస్తుంది. కడారి సత్యనారాయణరెడ్డి సోదరుడు కరుణాకర్ రెడ్డి మృతదేహం కోసం చత్తీస్గడ్ బయలుదేరాడు. అక్కడి ప్రభుత్వం తో మాట్లాడి సత్యనారాయణ రెడ్డి మృతదేహం తన సొంత గ్రామమైన గోపాల్ రావు పల్లెకు తీసుకు వస్తానని ఆయన పేర్కొన్నాడు 1978లో విప్లవాల వైపు ఆకర్షితుడైన సత్యనారాయణ రెడ్డి నాలుగేళ్లపాటు గోపాల్ రావు పల్లెకు వచ్చి వెళ్లేవాడని తర్వాత అసలు గ్రామం వైపు రాలేదని తన స్నేహితులు పేర్కొన్నారు. ప్రస్తుతం మాత్రం గ్రామ ప్రజలు స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు ఎప్పుడు సత్యనారాయణ రెడ్డి మృతదేహం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సత్యనారాయణ రెడ్డి ఎన్కౌంటర్లో మరణించడంతో ఆ గ్రామంలో నిశ్శబ్ద చాయలు నెలకొన్నాయి. ఇంటెలిజెన్స్ పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు గ్రామంలో ఏం జరుగుతుందో ప్రత్యేక నిఘ ఏర్పాటు చేశారు.
అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి: ఆలూరి కర్ణాకర్ రెడ్డి, గ్రామస్తులు
కడారి సత్యనారాయణరెడ్డి నా చిన్ననాటి స్నేహితుడు. ఆయన గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవాడు. ఆ సమయంలోనే ఆయన ఎవరు తప్పు చేసిన సహించేవాడు కాదు. చదువులో మాత్రం ముందు వరసలో ఉండేవాడు అతను ప్రాథమిక విద్యాభ్యాసం సిరిసిల్లలో చేసి ఐటిఐ పెద్దపల్లి లో పూర్తి చేశాడు అదే సమయంలో అతనికి బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది అప్పుడు ఊరును విడిచి వెళ్లాడు ఇప్పటికి 45 ఏళ్లు పూర్తయింది. బతికి వస్తే సంతోషించే వాళ్ళం.
లొంగిపోయి వస్తాడు అనుకున్నాం: కల్లేపల్లి భూమిరెడ్డి,గ్రామస్తులు
కడారి సత్యనారాయణరెడ్డి 45 ఏళ్ల క్రితం ఊరు విడిచి వెళ్ళాడు అతను చాలా తెలివివంతుడు లొంగిపోయి వస్తాడు అనుకున్నాం కానీ ఆయన మృతదేహం చూస్తాం అనుకోలేదు ఇది చాలా బాధాకరమైన విషయం చిన్నప్పుడు అందరితో కలిసి ఉంటూ అనేక మంచి విషయాలు చెప్పేవాడు అతనికి చిన్నప్పటి నుంచే పేద మధ్య తరగతి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండేది ఆయన మాటలు కూడా అలాగే ఉండేవి కానీ ఇంత ఘోరం జరుగుతదని అనుకోలేదు.
కడారి కడచూపుకు..ఎదురుచూపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES