Thursday, September 25, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివిలీన సందర్భం - విపరీత పోకడలు

విలీన సందర్భం – విపరీత పోకడలు

- Advertisement -

విలీన దినోత్సవ సందర్భంగా పాలకుల పోకడలు ప్రజలను పక్కదారులు పట్టిస్తున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ను భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేసామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పుకున్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370ని చేర్చడం వల్ల జమ్మూ కశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ సత్యానికి మసిబూసి మారెడుకాయ చేస్తున్నారు. కేవలం మతపరమైన విభజన సృష్టించడం కోసమే ఆర్టికల్‌ 370ని బీజేపీ, ఆరెస్సెస్‌లు వివాదస్పదం చేసాయి. జమ్మూ కశ్మీర్‌కు మాత్రమే ప్రత్యేక అధికరణం రాజ్యాంగంలో చేర్చారని చెప్పడం మరో అబద్ధం. ఈ దేశంలో కొండ ప్రాంత రాష్ట్రాలన్నింటికీ రాజ్యాంగంలో ప్రత్యేకమైన అధికరణాలు చేర్చారు. గిరిజన హక్కులు కాపాడటం కోసం కూడా రాజ్యాంగంలో ప్రత్యేకంగా షెడ్యూల్‌ 5, షెడ్యూల్‌ 6 కూడా చేర్చారు. జమ్మూ కశ్మీర్‌ ఆస్తుల రక్షణకు కల్పించిన ఏర్పాట్లను కూడా వక్రీకరించారు. నిజానికి కశ్మీర్‌ ప్రజలే కాదు, జమ్మూలో భూస్వాముల ప్రతినిధులుగా ఉన్న ఆరెస్సెస్‌ ముద్దుబిడ్డలు కూడా తమ ఆస్తులకు భద్రత కావాలని డిమాండ్‌ చేసారు.

కానీ వీరిద్దరి డిమాండ్ల మధ్య భూమి-ఆకాశాలకు ఉన్నంత తేడా ఉన్నది. కశ్మీర్‌లో పేదలకు భూపంపకం చేసి వారి హక్కులకు భద్రత కల్పించేందుకు షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ డిమాండ్‌ చేసింది. భూ సంస్కరణలు అమలు చేయకుండా తమ భూస్వాముల భూములకు రక్షణ కల్పించాలని జమ్మూలో ఆరెస్సెస్‌ ముద్దుబిడ్డ ప్రజాపరిషత్‌ డిమాండ్‌ చేసింది. ఒకటి ప్రజల కోసం చేసిన డిమాండ్‌, రెండవది భూస్వాముల కోసం చేసిన డిమాండు. ఈ వివరాలు చెప్పకుండా ఆర్టికల్‌ 370 వల్ల ఇతర భారతీయులెవరూ కశ్మీర్‌లో ఆస్తులు కొనకుండా ఆంక్షలు విధించారని వక్రీకరించారు. కశ్మీర్‌ భారతదేశంలో భాగం కాదా అని భావోద్వేగాలు రెచ్చగొట్టారు.

1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, తెలంగాణ ప్రజలకు రాలేదని మరొక వక్రభాష్యం. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు ఇక్కడికి రాకముందు బ్రిటిష్‌ ఇండియాలో సాగింది స్వాతంత్య్ర పోరాటం. హైదరాబాద్‌, కశ్మీర్‌లో సాగిన పోరాటాలు భూమికోసం, భుక్తికోసం, ప్రజాస్వామ్యం కోసం భూస్వాముల మీద, రాచరికాల మీద జరిగిన తిరుగుబాట్లు. పైగా భారతదేశంలో తెలంగాణ విలీనాన్ని విమోచన దినోత్సవంగా కేంద్రంలో బీజేపీ సర్కార్‌ ప్రకటించింది. తెలంగాణ విలీనం విమోచనే అయితే, జమ్మూకశ్మీర్‌ విలీనాన్ని కూడా విమోచన దినంగా ఎందుకు ప్రకటించలేదు? అనేక రాజ్యాలు భారతదేశంలో విలీనమైన చారిత్రక సన్నివేశాలకు కూడా మతంరంగు పులిమి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నమే ఇది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ… పటేల్‌ కలలుగన్న రాజ్యాన్ని నిర్మించుకోవాలన్నారు, నిజమే… ఆరెస్సెస్‌ లాంటి మతోన్మాద సంస్థకు జనజీవనంలో పనిచేసే అర్హత లేదని నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ భావించారు.అందుకే మతకల్లోలాలు సృష్టిస్తున్న ఆరెస్సెస్‌ను నిషేధించారు. తాను ఇకనుంచి సాంస్కృతిక సంస్థగా మాత్రమే ఉంటామని, రాజకీయాల్లో జోక్యం చేసుకోబోమని రాతపూర్వకంగా ఇచ్చిన తర్వాత ఆరెస్సెస్‌పై నిషేధం ఎత్తివేసారు.

పటేల్‌ను నమ్మించి మోసం చేసిన ఆరెస్సెస్‌ ఇప్పుడు బాహాటంగా రాజకీయం చేస్తున్నది. రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పినట్టు పటేల్‌ కలలుగన్న రాజ్యం స్థాపించాలంటే, తెలంగాణ ప్రజలు ఆరెస్సెస్‌కు జనంలో స్థానం లేకుండా చేయాలి. ‘ఉత్సవం’ అంటూనే, విమోచన పేరుతో విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడే కాదు, విలీన సమయంలో కూడా వీరు చేసిన పని అదే. హిందూ, ముస్లిం తేడా లేకుండా తెలంగాణ ప్రజలు విలీన సందర్భంగా నెహ్రూ ప్రభుత్వం పట్ల ఆశాభావంతో ఎదురుచూస్తుండగా మరఠ్వాడా ప్రాంతంలో మాత్రం ఆరెస్సెస్‌ పరివారం మత మారణహోమం సృష్టించింది. ప్రజాస్వామ్యవాదులు తెలంగాణ విలీనాన్ని జాతీయ సమగ్రతకు, సమైక్యతకు చిహ్నంగానే చూసారు. రాజ్‌నాథ్‌సింగ్‌ మాతృసంస్థ మాత్రం మారణకాండ సృష్టించింది. ఈ వాస్తవాల నుంచి ప్రజల కండ్లుగప్పి ఇప్పుడు ”ఎవరేమనుకున్నా సమగ్రతకోసమే నిలబడదాం” అని తెలంగాణ ప్రజానీకాన్ని రాజ్‌నాథ్‌సింగ్‌ నమ్మబలుకుతున్నాడు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు త్యాగధనులు. మరఠ్వాడ కల్లోల సృష్టికర్తలు రక్తచరితులు. వీరి వారసులే నేటి కేంద్ర పాలకులు.

ఉక్కుమనిషి సర్దార్‌ పటేల్‌ రాజకీయ పరిపక్వతతో ఆనాటి సంస్థానాలను భారత్‌లో విలీనం చేసారని రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పు కొచ్చారు. రాచరికపు నిరంకుశత్వాన్ని అనుభవిస్తున్న సంస్థానాల ప్రజల మీద స్వాతంత్య్రోద్యమ ప్రభావం తిరుగులేనిది. దీని ఫలితమే సంస్థానాలు భారతదేశంలో విలీనం. నాటి కేంద్ర హోంమంత్రిగా ఉన్న సర్దార్‌పటేల్‌ పాత్ర కూడా విస్మరించలేము. విలీనాల ప్రక్రియ గొప్పతనమంతా ఒక వ్యక్తికి ఆపాదించడం ద్వారా ప్రజలను అవమానించడం తగదు. సర్దార్‌పటేల్‌ హైదరాబాదుకు విముక్తి కల్పించి, విలీనం చేసారన్నారు. జునాగడ్‌, జమ్మూ కశ్మీర్‌లను భారతదేశంలో విలీనం చేసిన నాటి హోంమంత్రి, నిజాం రాజుతో మాత్రం యధాతథ ఒప్పందం చేసుకున్న కారణం మాత్రం నేటి కేంద్రమంత్రులు చెప్పరు. కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగ తిరుగుబాటు ఫలితంగా మాత్రమే తెలంగాణ విలీనం కాక తప్పలేదన్నది నిజం. రజాకార్ల పీచమణచి నిజాం రాజును లొంగ దీసుకున్నారని మరొక అబద్ధం చెప్పారు.

రజాకార్‌ నేత కాశీంరజ్వీని నడిబజార్‌లో ఉరితీయాలని కోరుకున్న తెలంగాణ ప్రజల నుంచి రక్షించి, ప్రత్యేక విమానంలో పాకిస్థాన్‌కు పంపించింది నిజం కాదా? నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ను బంధించక పోగా, రాజ ప్రముఖ్‌ పేరుతో ఆ నరహంతకుడినే పాలకుడిగా నియమించింది వాస్తవం కాదా? హైదరాబాదు రాజ్యం మీద ఇండియన్‌ యూనియన్‌ సైనిక చర్య ఖర్చులను హైదరాబాదు రాజ్యం భరించిన విషయం కూడా గమనార్హం. అసలు సర్దార్‌పటేల్‌కు, బీజేపీకి సంబంధమేమిటి? కాంగ్రెస్‌ నాయకుల చేతగానితనం వల్లనే సర్దార్‌ పటేల్‌ పేరును వీరు ఉచ్ఛరించ గలుగుతున్నారు. ఆయన స్వాతంత్య్రంకోసం పోరాడిన కాంగ్రెస్‌ నాయకుడు. నెహ్రూ మంత్రివర్గంలో హోంమంత్రి. ఆయనేదో ఆరెస్సెస్‌కు చెందినవాడన్నట్టు, బీజేపీ నాయకులకు గురువన్నట్టు, ఆయన కృషి ఫలితాలను దొంగిలించేందుకు నేటి ఆరెస్సెస్‌, బీజేపీ నేతలు ఆయాసపడుతున్నారు. నాటి పోరాట యోధులను కేంద్రం గుర్తించి, గౌరవిస్తుందని మరో కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పారు.

ఎవరీ పోరాటయోధులు? వీర తెలంగాణ సాయుధ పోరాటనేత పుచ్చలపల్లి సుందరయ్య కదా! రావినారాయణ రెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, కాచం కృష్ణమూర్తి, ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి అనేకమంది యోధుల త్యాగఫలమే కదా విలీనం. ఈ చారిత్రక సత్యాన్ని అంగీకరించే చిత్తశుద్ధి మోడీ ప్రభుత్వానికి ఉన్నదా? స్వాతంత్య్రోద్యమంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నవారు దేశ భక్తులు, పోరాట యోధులు. మరఠ్వాడా మారణకాండకు బాధ్యులైనవారు దేశద్రోహులు. బ్రిటిష్‌ ఇండియాలో స్వాతంత్య్రపోరాటంతో గానీ, తెలంగాణలో రైతాంగ పోరాటంతో గానీ వీరికి సంబంధం లేదు. పైగా, తెల్లదొరలకు సహకరించిన చరిత్ర వీరిది. విలీనోత్సవ సందర్భంగా మరో కేంద్రమంత్రి బండి సంజరు తొండి మాటలు మాట్లాడాడు. భూస్వాముల దౌర్జన్యాలు, రాచరికపు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాట చరిత్రకు మతం రంగు పులిమే ప్రయత్నంలో మత మార్పిడుల గురించి మాట్లాడాడు.
నేటి మోడీ పాలన గురించి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రగల్భాలు పలికాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ ఆగలేదని, తాత్కాలిక విరామం మాత్రమేనని చెప్పుకొచ్చారు.

సర్జికల్‌ స్ట్రైక్స్‌ తర్వాత కూడా పహల్గాం ఉగ్రవాద దాడి ఎందుకు జరిగిందో మాత్రం చెప్పలేదు.ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం చేరుకున్నదని చెప్పుకున్నారు. జనం నవ్విపోతారన్న బిడియం కూడా లేదు. ఆక్రమిత కశ్మీర్‌ సమస్య పరిష్కారం కోసం మూడో వ్యక్తి జోక్యం అవసరంలేదని మోడీ తేల్చి చెప్పారన్నారు రాజ్‌నాథ్‌సింగ్‌. ఎక్కడ చెప్పారో! పార్లమెంట్‌లో గానీ, మీడియా సమక్షంలో గానీ మోడీ ఎప్పుడూ చెప్పలేదు. రాష్ట్ర పాలకులూ, మాజీ పాలకులు కూడా విలీన సందర్భంగా అర్థ సత్యాలు, అసందర్భ చర్యలు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా చెప్పింది. కానీ ఇప్పడు రాష్ట్రంలో ప్రజాపాలనే సాగుతున్నదని చెప్పగలరా! బీఆర్‌ఎస్‌ నాయకత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించింది. రాచరికం మీద జరిగిన పోరాటమని కేటీఆర్‌ చెప్పారు. ఇవి కూడా నిజమే. కానీ, కేసీఆర్‌ నాయకత్వంలో సాగిన పాలన రాచరికాన్నే గుర్తు చేసింది కదా! విలీన దినోత్సవం నాడు గన్‌పార్కు దగ్గర ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు.

ఈ స్థూపానికీ, విలీన దినోత్సవానికి సంబంధం లేదుగదా! బైరాన్‌పల్లి అమరవీరుల స్థూపం దగ్గర లేదా బాగ్‌లింగంపల్లి సుందరయ్య విగ్రహం దగ్గర, ట్యాంక్‌బండ్‌ మీద మఖ్ధుం మోహియుద్దీన్‌ విగ్రహం దగ్గర లేదా ట్యాంక్‌బండ్‌ కింద ఐలమ్మ విగ్రహం దగ్గర నివాళులర్పించడం సందర్భోచితం కదా! కేటీఆర్‌ కూడా ఈ పనే చేసారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని, 1969లోనూ, తర్వాత కేసీఆర్‌ నాయకత్వంలోనూ జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒకే గాటున కట్టటం అర్థరహితం. సీఎం రేవంత్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి 1948 సెప్టెంబర్‌ 17ను 2023 డిసెంబర్‌ 7తో పోల్చడం హాస్యాస్పదం. దేశంలో తెలంగాణ విలీనానికి, ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మీద కాంగ్రెస్‌ విజయం సాధించడానికి సంబం ధమేమిటి? కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలిద్దరూ పోటీపడి సంక్షేమ పథకాల గురించి చెప్పుకొచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది సంక్షేమం పేరుతో ప్రకటించే ఓట్ల పథకాల కోసం కాదు. భూమి పంచి, అక్రమ రుణపత్రాలను చించి, రైతులను రుణ విముక్తులను చేసిన పోరాటమది. నిర్ణయాల్లో మహిళలను భాగస్వాములను చేసి కనీస వేతనాలు అమలుచేసిన గ్రామ రాజ్యాలవి. ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి స్ఫూర్తి అంటే అది.

ఎస్‌.వీరయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -