తగువు పెట్టి.. తమాషా చూడటమంటే ఇదే కాబోలు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంలోని మోడీ సర్కారు, రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని బుట్టలో పారేసింది. దానిపై ఏమీ తేల్చకుండా నానబెడుతూ ఉంది. ఇక్కడ రేవంత్ సర్కారేమో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామంటూ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎటూ తేల్చకపోవటంతో ఆర్డినెన్సు తీసుకొచ్చి… గవర్నర్‌కు పంపితే ఆయన కూడా దానివైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక రాష్ట్ర బీజేపీ నేతల వితండ వాదన జనాలకు పిచ్చెక్కిస్తోంది. బీసీ రిజర్వేషన్ల జాబితా నుంచి ముస్లింలను తొలగించాలంటూ ఒక అశాస్త్రీయమైన వాదనను వారు తెరపైకి తెచ్చి, రిజర్వేషన్లను అడ్డుకోవటం విచిత్రం. ఇదిలా ఉండగా… బీసీ రిజర్వే షన్లపై కొందరు హైకోర్టు మెట్లెక్కటం, సంబంధిత పిటిషన్లను న్యాయస్థానం కొట్టేయటం తాజా పరిణామం.
రాష్ట్రంలో పంచాయతీల్లోని పాలకవర్గాల పదవీకాలం పూర్తయి ఏడాదిర్నర కావస్తోంది. అంతకు ముందు సర్పంచులు, ఆ తర్వాత పంచాయతీ కార్యదర్శులు పల్లెల్లో పనుల కోసం తమ చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టారు. ఆయా బిల్లులను ఆనాటి సర్కారు విడుదల చేయకపోవటంతో పలువురు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవటం బాధాకరం. ఇప్పుడు కూడా సర్పంచులతోపాటు కార్యదర్శులు తమ బిల్లుల కోసం సచివాలయం చుట్టూ చెప్పుల రిగేలా తిరుగుతుండటం శోచనీయం. గత బీఆర్‌ఎస్ హయాంలో నిధులుండీ విడుదల చేయని దుస్థితి. నేటి కాంగ్రెస్ జమానాలో ఖజానా నిండుకున్న పరిస్థితి. మొత్తం మీద సర్పంచులు, కార్యదర్శులు బలయ్యారు.
మరోవైపు పాలకమండళ్లు లేకపోవటంతో ఏడాదిన్నర కాలంగా పంచాయతీల్లో పాలన కుంటుపడింది. మంచినీరు, పారిశుధ్యం, వీధిలైట్లు, రోడ్లు… మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. పోనీ వాటిని రిపేరు చేద్దామా… అంటే పాత బిల్లులే రాని స్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ఈనెల 30 నాటికి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసి తీరాలంటూ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళతామంటూ రేవంత్ సర్కార్ తెగేసి చెబుతోంది. దీనికి కేంద్రం మోకాలడ్డుతుండటంతో ఎన్నికలు మరింత వెనక్కి పోవటం ఖాయంగా కనబడుతోంది. ఇక్కడే మోడీ సర్కారు అసలు స్వరూపాన్ని మనం బయటపెట్టాలి. ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో ముస్లింలకు రిజర్వేషన్లను అమలు చేస్తూ.. తెలంగాణలో మాత్రం వాటికి అడ్డుపడటం దాని రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. ముస్లింలలో అత్తరు సాయిబులు, దూదేకుల వారు, రాళ్లు కొట్టుకుని బతికేవారు, ఫకీర్లలాంటి కూలీలు, పేదలకు రిజర్వేషన్లు కల్పించొద్దని చెప్పటం ఏ రకమైన న్యాయమో బీజేపీ నేతలే సెలవివ్వాలి.
తమ నేత, ప్రధాని మోడీ స్వయంగా బీసీ అని చెప్పుకుంటున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వారు అదే బీసీల రిజర్వేషన్లను మతం పేరిట అడ్డుకోవటం దుర్మార్గంగాక మరేమిటి? రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలున్నారు. వీరికి రాష్ట్రంలోని బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తేవటం ద్వారా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదింప జేయాలి. వారు ఆ పనికి పూనుకోకపోతే రాష్ట్రంలోని సామాజిక శక్తులు, అభ్యుదయ వాదులు… బీజేపీ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తేవాలి. అప్పుడు కూడా పని కాకపోతే ఐక్య పోరాటాలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మరిన్ని ఆందోళనలు చేపట్టాలి. అప్పుడే రిజర్వేషన్ల సాధన సాధ్యమవుతుంది. ప్రతీ విషయంలోనూ మౌన ప్రేక్షకుడి పాత్ర పోషిస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కూడా రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. అంతేతప్ప సమస్యలను సాకుగా చూపి… ‘స్థానిక సంస్థల ఎన్ని కలను బహిష్కరించండి…’ అని పిలుపునివ్వటం తగదు. ప్రజా సమస్యలను.. సమస్యలుగానే చూడాలి. వాటి పరిష్కా రానికి ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీ లోపలా, బయటా పోరాడాలి. అంతే తప్ప తన రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్ధమైన పిలుపులిస్తే అది ఒక్కోసారి బూమరాంగ్ అవటం ఖాయం.
పంచాయి(య)తీ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES