అలైన్‌మెంట్ మార్చాల్సిందే..
త్రిబుల్ ఆర్ బాధితులకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు
27న కలెక్టరేట్ ముట్టడి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
పెద్దల కోసం చిన్న రైతులను బలి చేసే విధంగా తీసుకొచ్చిన త్రిబుల్ ఆర్ నూతన అలైన్‌మెంట్‌ను మార్చాల్సిందేనని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం, నారాయణపురం మండలం శేరిగూడెం, సర్వేలు, పుట్టపాక గ్రామాల్లో బుధవారం భూబాధిత రైతులను కలిశారు. ఆయా గ్రామాల్లో త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం చేపట్టబోయే పంటపొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తనకున్న రెండు మూడెకరాలు రోడ్డు కింద పోతుందని కొందరు.. భూములే మాకు జీవనాధారం.. అవే పోయాక ఎలా బతకాలని మరికొందరు.. పచ్చటి పంట పొలాల్లో రోడ్డు నిర్మిస్తే మా కుటుంబాల పరిస్థితి ఏంటని, ప్రాణం పోయినా భూమి వదిలే ప్రసక్తే లేదని ఇంకొందరు… సీపీఐ(ఎం) నాయకుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. ఆవేశం, ఆవేదనతో మీ కుటుంబాలను, పంట భూములను బలి చేసుకోవద్దు.. ఆలోచనతో పని చేయాలని సూచించారు. ఆందోళనలకు సీపీఐ(ఎం) మద్దతు ఇస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరంలో నిర్మించాల్సిన త్రిబుల్‌ఆర్ రోడ్డును చౌటుప్పల్‌లోని దివిస్ కంపెనీ కోసం 26,28 కిలోమీటర్ల దూరంలోనే నిర్మించేందుకు అలైన్‌మెంట్ కుదించడం సరికాదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 3వేల ఎకరాలకుపైగా భూములను రైతులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. పేదలకు అన్యాయం జరిగితే సీపీఐ(ఎం) చూస్తూ ఊరుకోదన్నారు. అలైన్‌మెంట్ మార్చాలని బాధిత రైతులు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరును కలిస్తే.. త్రిబుల్ ఆర్ గురించి తమకేమీ తెలియదని సమాధానం చెప్పడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరభాగంతోపాటు దక్షిణభాగం రోడ్డుకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. రైతులను మోసపుచ్చడంలో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకటికి మించింది మరొకటని విమర్శించారు. త్రిబుల్‌ఆర్ ప్రాజెక్టు బీఆర్‌ఎస్ హయాంలోనే వచ్చిందన్నారు. అప్పుడు వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రాగానే.. అప్పుడు సమర్థించిన బీఆర్‌ఎస్ ఇప్పుడు వ్యతిరేకిస్తోందన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక తీరు.. అధికార పక్షంలో ఉంటే మరో తీరా? రైతుల గురించి ఆలోచించరా? అని వీరయ్య ప్రశ్నించారు. త్రిబుల్ ఆర్ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇస్తూనే రాష్ట్రంలో అధికారంలో లేమనే ఉద్దేశంతో బీజేపీ బాధిత రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందే పనిలో ఉందని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ జిమ్మిక్కులను రైతులు నమ్మొద్దన్నారు. పోరాటాలతోనే అలైన్మెంట్‌ను అడ్డుకుందామని చెప్పారు. త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని, తప్పనిసరి పరిస్థితుల్లో భూములు తీసుకోవాల్సి వస్తే భూమికి బదులు భూమి కొనివ్వాలని, బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న 8 జిల్లాల్లోని త్రిబుల్ ఆర్ బాధితుల పక్షాన సీపీఐ(ఎం) చేపట్టనున్న కలెక్టరేట్ల ముట్టడికి రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా చౌటుప్పల్ మండలం మందోల్ల గూడెం, సింగరాయచెరువు, తూర్పుగూడెం, కుంట్లగూడెం గ్రామాలలో త్రిబుల్‌ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులతో నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరుగు కృష్ణారెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాసచారి, జిల్లా కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, సీనియర్ నాయకు లు దొంతగాని పెదులు తదితరులు ఉన్నారు.
పెద్దల కోసం పేద రైతులను బలి చేయొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES