అయినా గుర్తింపు లేదు
ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది : జీఎస్టీ సంస్కరణలపై స్టాలిన్
హేతుబద్ధీకరణలో ఇంత జాప్యమా అంటూ మోడీపై మండిపాటు
చెన్నై : జీఎస్టీ సంస్కరణల ద్వారా పౌరులకు కల్పించిన ఉపశమనంలో సగం భారాన్ని రాష్ట్రాలే భరిస్తున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. అయినప్పటికీ రాష్ట్రాలకు తగిన గుర్తింపు లభించడం లేదని మండిపడ్డారు. జీఎస్టీ పన్ను రేట్ల తగ్గింపులో జరిగిన జాప్యంపై ప్రధాని నరేంద్ర మోడీని నిలదీశారు. రాష్ట్రాలకు న్యాయబద్ధంగా అందాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు తీవ్ర పదజాలంతో స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. పన్నులు తగ్గించాలంటూ రాష్ట్రాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని, హిందీని బలవంతంగా రుద్దడాన్ని ప్రతిఘటించిన తమిళనాడు వంటి రాష్ట్రాలను శిక్షిస్తోందని ధ్వజమెత్తారు. ‘జీఎస్టీ సంస్కరణలు, ఆదాయపన్ను మినహాయింపుల ద్వారా భారతీయులకు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ప్రధాని మోడీ చెబుతున్నారు.
అయితే ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచే ఈ డిమాండ్ చేస్తున్నాయి. ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ చర్యలు తీసుకొని ఉంటే దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు లక్షల కోట్ల రూపాయలు ఆదా చేసుకొని ఉండేవి’ అని స్టాలిన్ గుర్తు చేశారు. ఉపశమన భారంలో రాష్ట్రాలు సగం భరిస్తున్నప్పటికీ గుర్తింపు లేకుండా పోతోందని ఆయన వాపోయారు. ఈ వాస్తవాన్ని కేంద్రం గుర్తించడం లేదని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధులను కూడా నిరాకరిస్తోందని ధ్వజమెత్తారు. హిందీని రుద్దడాన్ని అంగీకరించనందునే తమిళనాడుకు సమగ్ర శిక్ష నిధులు ఇవ్వలేదని తెలిపారు. ఈ అన్యాయం ఎప్పుడు అంతమవుతుందని ప్రశ్నించారు. సమాఖ్యను గౌరవించాలని కేంద్రానికి స్టాలిన్ సూచించారు. తమ హక్కుల రక్షణ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న రాష్ట్రాలను శిక్షిస్తే దేశం అభివృద్ధి చెందదని చెప్పారు. ‘సమాఖ్యను గౌరవించండి. నిధులు విడుదల చేయండి. ప్రజలకు న్యాయంగా చెందాల్సిన వాటాను వారికి అందించి ప్రయోజనం పొందనివ్వండి’ అని మోడీ ప్రభుత్వానికి స్టాలిన్ హితవు పలికారు.