Thursday, September 25, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణపై కేంద్రం వివక్ష

తెలంగాణపై కేంద్రం వివక్ష

- Advertisement -

యూరియా తెప్పించడంలో కేంద్ర మంత్రులు విఫలం
జీఎస్టీ తగ్గించినా.. వస్తువుల ధరలు తగ్గలేదు
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం : కరీంనగర్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రాష్ట్రానికి రావాల్సిన, కావాల్సిన యూరియా, నిధులు తీసుకురావడంతో విఫలమైన ఇక్కడి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు రాజీనామా చేయాలి. జీఎస్టీ తగ్గించామని చెబుతున్నా.. వస్తువుల ధరలు మాత్రం తగ్గలేదు. జీఎస్టీ తగ్గింపుతో రూ.2.5లక్షల కోట్ల భారాన్ని తగ్గించడంతో ప్రతి కుటుంబానికీ రూ.15వేల ఆదాయం మిగిల్చామని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ అంటున్నారు. అయితే ఇన్నేండ్లలో జీఎస్టీ పేరుతో దోచుకుని, కార్పొరేట్లకు ధారబోసిన కేంద్రం వైఖరిని కూడా ప్రజలు గమనిస్తున్నారు’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ చెప్పారు.

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ముకుందలాల్‌ మిశ్రా భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను కేంద్ర మంత్రులు తీసుకురాకపోవడంతో రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన యూరియా తేవడంలో విఫలమయ్యారని విమర్శించారు. అంతర్జాతీయంగా బీజేపీ, ప్రధాని మోడీ విధానాల వల్ల దేశం తన అస్తిత్వాన్ని కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా విధించిన టారిఫ్‌ల యుద్ధంలో సరైన విధంగా పోరాడలేకపోయిందన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని భారతదేశం పెంచి పోషిస్తోందని ఐక్యరాజ్య సమితిలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపిస్తుంటే, మోడీ ఖండించకపోవడం సరికాదన్నారు. అమెరికాలో నిరుద్యోగానికి భారతీయులే కారణమని తప్పుడు కూతలు కూస్తుంటే ప్రధాని ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

యూరియా కొరతపై ‘బండి’ ఏం చేసినట్టు..?
కరీంనగర్‌ జిల్లాకు 45 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంటే, ఇప్పటివరకు 30 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే వచ్చిందని ఈ విషయంలో ఇక్కడి ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజరు ఏం చేస్తున్నట్టు? అని సీపీఐ(ఎం) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ప్రశ్నించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి, ట్రిపుల్‌ ఐటీ తేవడంలో కనీస కృషి లేదన్నారు. ఏండ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న రైల్వే బ్రిడ్జిని సైతం పూర్తి చేయించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఒక్క చిన్న తరహా పరిశ్రమనూ తీసుకురావడంలో ఆయన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భీమా సాహెబ్‌, జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్‌, ఎడ్ల రమేష్‌, కె.నాగమణి, డి.నరేష్‌ పటేల్‌, సీనియర్‌ నాయకులు పుల్లెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి

హామీలు మరిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం
రాష్ట్రంలో పదేండ్లు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారం అనుభవించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని, తాము అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ సర్కారు కూడా హామీలు మరిచిందని జాన్‌వెస్లీ విమర్శించారు. 120 గజాల ఇంటి స్థలం కోసం లక్షలాది మంది పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే, వాటిని తొలగించి, పోలీసులతో లాఠీచార్జి చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ సర్కారుకూ పడుతుందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -