విద్యుత్, రక్షణ వంటి రంగాల్లో ప్రయివేటీకరణ ఆపాలి
సంక్షోభంలోకి ‘ఉపాధి’
దళిత, గిరిజన సమూహాలపై దాడులు
సీపీఐ 25వ జాతీయ మహాసభ తీర్మానాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ సమాఖ్యవాదం ప్రమాదంలో ఉందని సీపీఐ జాతీయ మహాసభ పేర్కొంది. చండీగఢ్‌లో జరుగుతున్న సీపీఐ 25వ జాతీయ మహాసభ నాలుగో రోజు బుధవారం కూడా వివిధ చర్చలు జరిగాయి. వామపక్ష, ప్రజాస్వామ్య పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో కలిసి సమాఖ్యవాదాన్ని రక్షించడానికి సామూహిక నిరసనలు చేపడతామని తీర్మానం ఆమోదించింది. విద్యుత్, రక్షణ వంటి రంగాలలో ప్రయివేటీకరణ, ఉపాధి హామీని సంక్షోభంలోకి నెట్టడం, దళిత, గిరిజన సమూహాల పై దాడులకు వ్యతిరేకంగా కూడా తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అన్నీ రాజా మాట్లాడుతూ మరింత మంది మహిళలు, యువత నాయకత్వంలోకి రానున్నారని అన్నారు. పార్టీ కార్యక్రమం పునరుద్ధరణలో భాగంగా పార్టీ మహాసభ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ప్రతినిధులు కమిషన్‌ల వారీగా మూడు నివేదికలను చర్చించారని అన్నారు.
చర్చల్లో వచ్చిన సూచన ల ఆధారంగా నివేదికలలో సవరణలు చేసినట్టు తెలిపారు. రాజకీయ తీర్మానంపై చర్చకు డీ రాజా, అమర్‌జిత్ కౌర్, బినోరు విశ్వం, నాగేంద్ర నాథ్ ఓఝా, పల్లబ్ సేన్ గుప్తా, సాంబశివరావు నాయకత్వం వహించారు. కె నారాయణ, రామ కృష్ణ పాండే, రామ్ నరేష్ పాండే, స్వపన్ బెనర్జీ, ఎ. వనజ, అరవిందరాజ్ స్వరూప్, ప్రకాష్ బాబు సంస్థాగత నివేదికపై చర్చకు నాయకత్వం వహించారు. డాక్టర్ బి.కె కాంగో, అన్నీ రాజా, డాక్టర్ గిరీష్ శర్మ, అజీజ్ పాషా, బంద్ సింగ్ బ్రార్, పి.సంతోష్ కుమార్ రాజకీయ సమీక్ష కమిషన్‌పై చర్చకు నాయకత్వం వహించారు.
మహాసభలో వివిధ తీర్మానాలను కూడా సమర్పిం చారు. అనంతరం బుధవారం రాత్రి జాతీయ మండలి, కార్యనిర్వాహక సమావేశం సమావేశమైంది. ముగింపు రోజైన గురువారం మహాసభ నూతన జాతీయ కమిటీ, కార్యనిర్వాహక, ప్రధాన కార్యదర్శి, సెక్రెటేరియట్ ఎన్నిక జరగనుంది.
ప్రమాదంలో సమాఖ్యవాదం
- Advertisement -
- Advertisement -