ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెనుకాడం
ఈనెల 26 వరకు ప్రభావిత గ్రామాల్లో పర్యటన
27న 8 జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలు…
ఆర్‌ఆర్‌ఆర్‌కు ఎంత భూమి కావాలి
ఏ అలైన్‌మెంట్ అమలు చేస్తారు?
సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన వైఖరి ప్రకటించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్
ఆర్‌ఆర్‌ఆర్ భూనిర్వాసితులు, రైతులతో వచ్చేనెల ఐదో తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఎనిమిది జిల్లాల్లో 33 మండలాల్లోని 163 గ్రామాల్లోని రైతులు భూములు కోల్పోతున్నారని వివరించారు. ఈనెల 26 వరకు ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తామన్నారు. 27న ఎనిమిది జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఎంత భూమి కావాలో, ఏ అలైన్‌మెంట్‌ను అమలు చేస్తారో సీఎం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు సార్లు అలైన్‌మెంట్‌ను మార్చారనీ, ఏ అలైన్‌మెంట్‌ను అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదన్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. పెద్దవారు, పలుకుబడి కలిగిన వారు, పెత్తందారుల భూముల జోలికి వెళ్లకుండా అలైన్‌మెంట్‌ను మార్చారని విమర్శించారు. దీంతో పేద రైతులు భూములు కోల్పోతున్నారని అన్నారు. రైతులతో మాట్లాడకుండా, నోటీసులు ఇవ్వకుండా సర్వే నెంబర్లను బ్లాక్ చేస్తున్నారని చెప్పారు. భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతులకు సరైన భరోసా ఇవ్వడం లేదన్నారు. భూమిని కోల్పోతే వారికి పరిహారం ఏం ఇస్తారో చెప్పడం లేదని అన్నారు. అందుకే భూమిని ఇవ్వడానికి వారు సిద్ధంగా లేరని వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు దానిచుట్టూ రింగ్ రైలు వస్తుందంటున్నారని చెప్పారు. దానిచుట్టూ చెట్లు నాటడానికి అదనంగా భూమి అవసరం చెప్తున్నారని అన్నారు. ఆర్‌ఆర్ ఆర్, రింగురైలు, చెట్లు నాటేందుకు సుమారు 40 వేల నుంచి 45 వేల ఎకరాల భూమి అవసరమని అంచనాలున్నాయని వివరించారు. దీంతో వేల మంది రైతులు నిర్వాసితులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.రైతుల ఆమోదం లేకుండా భూమిని తీసుకోవడం సరైంది కాదన్నారు. ఎకరా రూ.రెండు కోట్లు, రూ.మూడు కోట్లు, రూ.ఐదు కోట్లు ఉంటే, ప్రభుత్వం రూ.30 ఇస్తామంటున్నదని అన్నారు. దాని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఇంకోవైపు పెత్తందారుల భూములను వదిలేసి పేదల భూముల ను తీసుకుంటున్నదని విమర్శించారు. ఇదే అమలైతే ప్రతిఘటన పోరాటాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతులకు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాధ్యం కాకుంటే మార్కెట్ ధరకు అదనంగా మూడు రెట్లు పరిహారం ఇవ్వాలని కోరారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు.
గాజులరామారంలో గుడిసెల కూల్చివేతకు ఖండన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజుల రామారంలో పేదల గుడిసెలను హైడ్రా కూల్చివేయడాన్ని జాన్‌వెస్లీ ఖండించారు. వారు ఆక్రమించి చెరువులను కాదనీ, ప్రభుత్వానికి చెందిన క్వారీ భూముల్లోనే గుడిసెలు వేసుకున్నారని వివరించారు. మాజీ, తాజా ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని విమర్శించారు. వారి జోలికి హైడ్రా పోలేదన్నారు. గుడిసెల కూల్చివేతతో పిల్లలు, కుటుంబ సభ్యులు వర్షంలోనే ఉంటున్నారనీ, తాగునీరు, కరెంటు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కనీస మానత్వం ఉండాలనీ, ఆ భూమిలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వారు కొందరు ప్రజాప్రతిని ధులకు డబ్బులు ఇచ్చి మోసపోయారని అన్నారు. పేదల నోర్లు కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపా రులకు ఆ భూమిని ఇస్తారా?అని ప్రశ్నించారు. ఈ వైఖరిని ప్రభుత్వం మార్చుకోవాలని కోరారు. వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి కట్టివ్వకుంటే పేదలను సమీకరించి ఉద్యమిస్తామని అన్నారు.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం అనైతికం
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ కాల్పులు, యుద్ధం చేయడం అనైతికమని జాన్‌వెస్లీ విమర్శించారు. పాఠశాలలు, ఆస్పత్రులే లక్ష్యంగా ధ్వంసం చేస్తున్నదని అన్నారు. అక్కడి ప్రజలకు ఆహారం, నీళ్లు దొరక్క ఆకలి చావులకు గురవుతున్నారని వివరించారు. ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా అన్ని వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులతో కలిసి హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన చేపడతామని అన్నారు. వామపక్షాలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దోబూచులాడుతున్నదని విమర్శించారు. పాలస్తీనా దేశం ఉండాలనీ, ఆ భూభాగం ఉండాలని కోరారు.
అభివృద్ధి పేరుతో ప్రజల ఆస్తులను లాక్కోవడం అన్యాయం : జూలకంటి
పరిశ్రమలు, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పేరుతో ప్రజల ఆస్తులను వారి ఆమోదం లేకుండా లాక్కోవడం అన్యాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఆర్‌ఆర్‌ఆర్ ఇష్టం వచ్చినట్టు అలైన్‌మెంట్‌ను మార్చారని అన్నారు. కొందరి స్వార్థం కోసం విలువైన భూములను లాక్కుంటున్నారని చెప్పారు. మార్కెట్ ధరకు అదనంగా మూడు, నాలుగు రెట్లు పరిహారం ఇచ్చి భూములను శాస్త్రీయంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడం లేదన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. అలా చూపకుండా దౌర్జన్యంగా భూముల నుంచి వెళ్లిపోవాలని చెప్పడం సరైంది కాదన్నారు. కేరళలో నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపి ఆ భూములను ప్రభుత్వం తీసుకుంటుందని గుర్తు చేశారు. గాజుల రామారంలో పేదల గుడిసెలను ధ్వంసం చేయడం సమంజసం కాదన్నారు. పేదల తరపున పోరాడతామని చెప్పారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యల పరిష్కారం కోసం మెమోరాండం సమర్పించి ఒత్తిడి తెస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 5న ఆర్‌ఆర్‌ఆర్ భూనిర్వాసితుల చలో హైదరాబాద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES