బతుకమ్మ ఆట పాటలే కాదు.. అదొక పోరాటం : టీపీఎస్‌కే రాష్ట్ర కార్యదర్శి కె.హిమబిందు
నవతెలంగాణ-ముషీరాబాద్
”బతుకమ్మ అంటే నిలదీసే ‘ప్రశ్న’గా బతుకుతూనే ఉంటుంది.. బతుకమ్మ ఆట పాటలే కాదు.. అదొక పోరాటం.. సమూహగళం.. ఒక తిరస్కారం.. తరాల తరబడి ఎదుర్కొన్న అణచివేతలపై, అపహాస్యాలపై, దోపిడీ దుర్మార్గాలపై గళమెత్తిన స్వరం..” అని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర కార్యదర్శి కె.హిమబిందు తెలిపారు. టీపీఎస్‌కే, మత్స్య మహిళా సంఘం సంయుక్తంగా బుధవారం ”స్వేచ్ఛ, సమానత్వ స్వాభిమాన బతుకమ్మ ధూంధాం”ను హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీఎస్‌కే రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. స్త్రీ, స్వేచ్ఛ సమానత్వం సమాజ సామాజిక బాధ్యత అని చెప్పారు.
ప్లాస్టిక్ పూలను, కృత్రిమ రంగులను, డీజే సౌండ్‌లను వ్యతిరేకించాలని సూచించారు. ‘అమ్మ కడుపు’ను వ్యాపార వస్తువుగా చేయటమే దుర్మార్గమన్నారు. తాము బతుకుతూ.. ఆకాశం హద్దుగా ఎదుగుతూ.. ఈ సమాజాన్ని మార్చడం బతుకమ్మ ఉద్దేశం అని వివరించారు. అనేకదారులలో బతుకమ్మలందరినీ కలుపుకునే చైతన్య వేదికగా టీపీఎస్‌కే పనిచేస్తోందన్నారు. వుమెన్ కౌన్సెలింగ్ సెంటర్ ఫౌండర్ హిప్మో పద్మ కమలాకర్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ సమానత్వం వచ్చినప్పుడే అమ్మలకు బతుకమ్మలకు నిజమైన పండుగ అని చెప్పారు. గాజుల శబ్దం కాదు.. బతుకమ్మల బతుకు గర్జన వినబడాలని, చేత్తోకొట్టే చప్పట్లే సంగీతమై పాలకుల గుండెల్లో మార్మోగాలని.. తెలంగాణలో ఆత్మగౌరవం నిలబడాలని ఆకాంక్షించారు.
మత్స్య మహిళా విభాగం అధ్యక్షకార్యదర్శులు బి.బాలమణి, జి.అమరవాతి మాట్లాడుతూ.. లింగ వివక్షతను రూపుమాపాలని, మహిళా రక్షణ చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని, మహిళా హక్కులు ప్రజల హక్కులుగా ప్రభుత్వాలు ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు. కులాంతర, మతాంతర వివాహాల రక్షణ చట్టం తీసుకురావాలని, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఒక చట్టం చేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ వీర తెలంగాణ పోరాట యోధురాళ్ల ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఒక చేత్తో బతుకమ్మ.. మరో చేత్తో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొరెంకల నర్సింహ, ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, పీఎన్ మూర్తి, పుష్ప, హైకోర్టు అడ్వకేట్ హేమలలిత గంగాదేవి, తనూజ, సరిత, భవాణి, రజిత తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ అంటే నిలదీసే ‘ప్రశ్న’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES