Thursday, September 25, 2025
E-PAPER
Homeఆటలుఫైనల్‌కు టీమిండియా

ఫైనల్‌కు టీమిండియా

- Advertisement -

అర్ధసెంచరీతో మెరిసిన అభిషేక్‌
బంగ్లాదేశ్‌పై 41పరుగుల తేడాతో గెలుపు
నేడు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య కీలక పోరు

దుబాయ్: ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీ ఫైనల్లోకి భారత జట్టు దూసుకెళ్లింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా బుధవారం జరిగిన సూపర్‌-4 రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 168పరుగులు చేయగా.. అనంతరం బంగ్లాదేశ్‌ జట్టు 19.3ఓవర్లలో 127పరుగులకు ఆలౌటైంది. బంగ్లా జట్టు ఓపెనర్‌ సైఫ్‌ హసన్‌(69) అర్ధసెంచరీకి తోడు ఎమేన్‌(21) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. టీమిండియా బౌలర్లు కుల్దీప్‌కు మూడు, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రాకు రెండేసి, తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ధనా ధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 25బంతుల్లోనే అర్ధసెంచరీ బాదిన అభిషేక్‌.. మొత్తమ్మీద 37బంతుల్లో 8ఫోర్లు, 5సిక్సర్లతో 75 పరుగులతో రాణించాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(29) కూడా రాణించాడు. అభిషేక్‌-గిల్‌ కలిసి తొలివికెట్‌కు 6.2ఓవర్లలో 77పరుగులు జతచేశారు. ఆ తర్వాత గిల్‌ ఔటైనా.. అభిషేక్‌ తన ధనా ధన్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అభిషేక్‌ శర్మ ఔటయ్యే సమయానికి భారతజట్టు 11.1ఓవర్లలో 112పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా స్కోర్‌బోర్డు నెమ్మదించింది. చివర్లో హార్దిక్‌ పాండ్యా(38; 29బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్‌) రాణించాడు. దీంతో భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లు నష్టపోయి 168పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. శ్రీలంక బౌలర్లు రిషాద్‌ హొసైన్‌కు రెండు, సైఫుద్దీన్‌, ముస్తాఫిజుర్‌, తంజిమ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.

అభిషేక్‌ మరో అర్ధసెంచరీ..
ఆసియా కప్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ(75) తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. సూపర్‌-4 తొలి పోరులో పాకిస్థాన్‌పై అర్ధశతకంతో చెలరేగిన అభిషేక్‌.. బంగ్లాదేశ్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. సైఫుద్దీన్‌ ఓవర్లో నాలుగు ఫోర్లతో రెచ్చిపోయిన అభిషేక్‌.. 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. దాంతో.. టీమిండియా స్కోర్‌ రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. అయితే.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన శుభ్‌మన్‌ గిల్‌.. అభిషేక్‌కు ఎక్కువసేపు ఆడే అవకాశమిచ్చాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉన్నంతసేపు స్కోర్‌బోర్డు పరుగెత్తింది. నేడు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్‌ బెర్త్‌ దక్కనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జరిగే గురువారం జరిగే మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. 26న జరిగే చివరి, నామమాత్రపు లీగ్‌ మ్యాచ్‌లో భారతజట్టు శ్రీలంకతో తలపడనుంది. ఆ జట్టు వరుసగా రెండో ఓటములతో టోర్నీనుంచి ఇప్పటికే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -