Thursday, September 25, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుతుది తీర్పునకు లోబడే నియామకాలు

తుది తీర్పునకు లోబడే నియామకాలు

- Advertisement -

టీజీపీఎస్సీ అప్పీళ్లపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గ్రూప్‌1 పరీక్షల తుది మార్కుల జాబితా, ర్యాంకుల జాబితాలను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి గత నెల 9న వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌1 అభ్యర్థుల్లోని అర్హులు ఉద్యోగ నియామకాలు చేపడితే, అది తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులతో టీఎస్‌పీఎస్సీకి ఉపశమనం లభించింది. సంజరు సింగ్‌ కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం మోడరేషన్‌ పద్ధతిలో పున:మూల్యాంకనం చేయాలని సింగిల్‌ జడ్జి వెలువరించిన తీర్పును టీజీపీఎస్సీ, అర్హత పొందిన పలువురు అభ్యర్థులు సవాలు చేస్తూ దాఖలు చేసిన పలు అప్పీళ్లను బుధవారం చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ జీఎం మోహీయుద్దీన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 15వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం/టీఎస్‌పీఎస్సీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ. సుదర్శన్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి, క్వాలిఫై అయిన అభ్యర్థుల తరఫున సీనియర్‌ న్యాయ వాదులు డి.ప్రకాశ్‌ రెడ్డి, కె.లక్ష్మీ నరసింహ తదితరులు వాదనలు వినిపించారు.

సింగిల్‌ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోరాదని సీనియర్‌ న్యాయవాదులు జి. విద్యాసాగర్‌ రావు, బి.రచనారెడ్డి ఇతరులు వాదించారు. గ్రూప్‌ 1 పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించలేదు. సమగ్రతను పాటించలేదు. మూల్యాంకనంలో తప్పులు జరిగాయి.. అని సింగిల్‌ జడ్జి తేల్చడాన్ని బెంచ్‌ ప్రాథమికంగా తప్పుపట్టింది. విద్యార్థులు 10 నుంచి12 గంటలు చదివారని ఎలా చెబుతారని ప్రశ్నించింది. అనుమానాల ఆధారంగా అక్రమాలు జరిగాయని తేల్చడం సరికాదని పేర్కొంది. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌, మాల్‌ప్రాక్టీస్‌ వంటివి జరిగితేనే కోర్టుల జోక్యానికి వీలుంటుందని సుప్రీం కోర్టు చెప్పింది. లేదా పేపర్‌ లీకేజీ అయితే కూడా పరీక్షల రద్దు చేయవచ్చునని చెప్పింది. ఇక్కడ అలాంటివి జరిగినట్టుగా సింగిల్‌ జడ్జి గుర్తించలేదు. పక్షపాతంగా జరిగిందనీ తేల్చలేదు. ఫలానా అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహారం జరిగిందనీ చెప్పలేదు. పరీక్షా కేంద్రాల సంఖ్య 45 నుంచి 46కు పెరిగాయని చెప్పడం అక్రమాల కిందికి రాదు. రెండు సెంటర్లలో మహిళా అభ్యర్థినులు ఎక్కవ సంఖ్యలో పాసయ్యారని చెప్పి పరీక్షలను రద్దు చేయడానికి వీల్లేదు. అలా జరిగినచోట అక్రమాలు జరిగాయని తేల్చేలేదు. అదే విధంగా తెలుగులో పరీక్ష రాసిన వాళ్లు ఎక్కువగా అర్హత సాధించలేదని చెప్పి తప్పు జరిగిందంటే ఎలా?.. అని హైకోర్టు విచారణ సమయంలో ప్రశ్నించింది. వీటిపై ఇరుపక్షాల వాదలన తర్వాత తగిన ఉత్తర్వులను జారీ చేస్తామని ప్రకటించింది.

ప్రశ్నాపత్రం లీకేజ్‌ జరగలేదు: ఏజీ
ప్రశ్నాపత్రం లీకేజీ, గోల్‌మాల్‌ వంటి ఘటనలు జరగలేదని ఏజీ, ఇతరులు వాదించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని నియమాలను అమలు చేసి పరీక్ష నిర్వహించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి వెలువరించిన తీర్పు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన సర్వీస్‌ కమిషన్‌ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. తీర్పు అమలును నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించారు. ఎక్కడ తప్పు జరిగిందో, ఎక్కడ చట్ట నిబంధనల ఉల్లంఘన జరిగిందో సింగిల్‌ జడ్జి తేల్చలేదన్నారు. 45కు బదులు 46 పరీక్ష కేంద్రాలు పెట్టారనీ, కోఠి మహిళా కాలేజీలోని 18,19 పరీక్షా కేంద్రాల్లో మహిళలు ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారనీ, ఇంగ్లిషులో రాసిన వారి కంటే తెలుగులో పరీక్ష రాసిన వాళ్లు తక్కువ శాతం అర్హత సాధించారనే విషయాలను గుర్తించారని చెప్పారు. ఇవేమీ నిబంధనలకు వ్యతిరేకంగా జరగలేదన్నారు. ఒకవేళ జరిగాయనే విషయాన్ని కూడా సింగిల్‌ జడ్జి గుర్తించలేదన్నారు. మాస్‌ కాపీయింగ్‌, కొందరు అభ్యర్థులకు ఫేవర్‌ చేయడం, పేపర్‌ లీకేజీ వంటివి జరిగాయనే విషయాలు ఏమీ సింగిల్‌ జడ్జి గుర్తించనప్పుడు, పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని తీర్పు చెప్పడం చెల్లదన్నారు. సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం ఈ తరహా అక్రమాలు, అవకతవకలు జరిగితేనే పరీక్షలను రద్దు చేయాలన్నారు. తిరిగి మూల్యాంకనం చేయాలన్న ఉత్తర్వులు నిబంధనలకు వ్యతిరేకమన్నారు. రూల్స్‌ ప్రకారం రీకౌంటింగ్‌కు మాత్రమే వీలుందని, పున్ణమూల్యాంకనం చేసేందుకు వీల్లేదన్నారు. సింగిల్‌ జడ్జి నిబంధనల్లో లేని అంశాలపై తీర్పు చెప్పడం వల్ల న్యాయపరంగా కొత్త లిటిగేషన్ల ఆస్కారానికి తెరతీశారన్నారు. దీనిపై రచనారెడ్డి స్పందిస్తూ, మూల్యాంకనం పూర్తిగా నియమావళికి విరుద్ధంగా జరిగిందన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనానికి స్పష్టమైన నిబంధనలను అమలు చేయలేదన్నారు.

పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను కమిషన్‌ వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు సంఖ్యలను వెల్లడించడాన్ని బట్టి అక్రమాలు చోటు చేసుకున్నాయని అర్ధం అవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో సింగిల్‌ జడ్జి తీర్పే సరైనదని, జోక్యం చేసుకోరాదని కోరారు. వాదనల అనంతరం హైకోర్టు స్టే ఆర్డర్‌ ఇవ్వబోతుంటే రచనారెడ్డి అభ్యంతరం చెప్పారు. స్టేటస్‌కో ఆర్డర్‌ ఇస్తే సరిపోతుందని, స్టే ఇస్తే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ దశలో ఏజీ, ఇతర న్యాయవాదులు కల్పించుకుని, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందనీ, నియామకాలు ఒక్కటే మిగిలిందన్నారు. నియామకాలకు అనుమతివ్వాలనీ, అప్పీళ్లపై వెలువడే తుది తీర్పునకు లోబడి నియామకాలు ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇందుకు డివిజన్‌ బెంచ్‌ అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సింగిల్‌ జడ్జి ఆదేశాల్లోని 372వ పేరా అమలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. సింగిల్‌ జడ్జి తీర్పుపై స్టే విధించింది. ఒకవేళ నియామకాలు చేపడితే అవి తుది తీర్పుపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. ప్రతివాదులు అక్టోబర్‌ 10లోపు లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. దీనిపై అప్పీల్‌ పిటిషనర్ల వాదనలను కూడా లిఖితపూర్వంగా సమర్పించాలని పేర్కొంటూ విచారణను అక్టోబర్‌ 15కి వాయిదా వేసింది.

బీసీ రిజర్వేషన్ల పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టేసింది. పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ అంశాల ఆధారంగా పిటిషన్‌ వేశారని ప్రశ్నించింది. పిటిషనర్‌ అర్హతపై నిలదీసింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏదైనా కాపీ ఇచ్చిందా అని ప్రశ్నించింది. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా పిటిషన్‌ వేస్తారని అడిగింది. మీడియా వార్తల ఆధారంగా పిటిషన్లు వేయడం సరికాదంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికా వార్తలను పరిగణనలోకి తీసుకోలేమని పేర్కొంది. పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285ఏ ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌ గ్రామా నికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్న కోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వలు పిటిషన్‌ దాఖలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనతోపాటు అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్లు పేర్కొ న్నారు. తద్వారా ఎన్నికల ప్రక్రియను, స్పూర్తిని దెబ్బ తీసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రిజర్వేషన్లు 50 శాతం దాటుతాయని ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొ న్నారు. అందువల్ల పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహిం చేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై బుధ వారం విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్లను కొట్టేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -