Thursday, September 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజా మానవతా సాయం బోట్లపై డ్రోన్లతో దాడులు

గాజా మానవతా సాయం బోట్లపై డ్రోన్లతో దాడులు

- Advertisement -

గుర్తు తెలియని వస్తువుల జారవిడత, పెద్ద ఎత్తున పేలుళ్ళు
ఆ బోట్లను గాజా చేరనివ్వబోమన్న ఇజ్రాయిల్‌


ఏథెన్స్‌ : విచక్షణారహితంగా ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దాడులతో దయనీయమైన పరిస్థితుల్లో వున్న గాజా ప్రజానీకానికి మానవతా సాయం అందించే లక్ష్యంతో బయలుదేరిన సహాయక బోట్లపై ఇజ్రాయిల్‌ డ్రోన్లతో విరుచుకుపడింది. ప్రస్తుతం గ్రీస్‌ తీరంలో వున్న ఈ బోట్లపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు డ్రోన్లతో దాడులు జరిగాయి. పెద్దగా పేలుళ్ళ శబ్దాలు వినిపించాయని ఎయిడ్‌ ఫ్లోటిల్లా నిర్వాహకులు, పాలస్తీనా అనుకూల కార్యకర్తలు తెలిపారు. ”పలు డ్రోన్లు గుర్తు తెలియని వస్తువులను జారవిడిచాయి. కమ్యూనికేషన్లు స్తంభించిపోయాయి. అనేక బోట్ల నుండి పెద్ద ఎత్తున పేలుళ్ళ శబ్దాలు వినిపించాయి.” అని గ్లోబల్‌ సుముద్‌ ఫ్లోటిల్లా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఎవరైనా మరణించారా లేదా అన్నది తెలియరాలేదు. తమను భయ భ్రాంతులకు గురిచేసేందుకే ఈ దాడులు జరుగుతున్నాయని, అయినా సరే తమను ఎవరూ అడ్డగించలేరని ఆ ప్రకటన పేర్కొంది. ఐదు బోట్లపై దాడులు జరిగాయని జర్మనీ మానవ హక్కుల కార్యకర్త, ఫ్లోటిల్లా సభ్యురాలు యాస్మిన్‌ ఏసెర్‌ ఒక వీడియోలో తెలిపారు.

తాము కేవలం మానవతా సాయాన్ని అందించే లక్ష్యంతోనే బయలుదేరామని, తమ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని ఆమె తెలిపారు. ఎవరికీ తాము ఎలాంటి హాని కలిగించే పరిస్థితి లేదన్నారు. వేలాదిమంది ప్రజలను చంపుతూ, మొత్తంగా జనాభాను ఆకలితో మాడ్చి చంపుతున్నది ఇజ్రాయిల్‌ అని ఆమె విమర్శించారు. తమ కార్యకర్తలు 15 నుండి 16 డ్రోన్లను చూశారని ఏసెర్‌ చెప్పారు. రాత్రి 1.43గంటల సమయంలో పేలుళ్ళ శబ్దాలు రికార్డయినట్లు మరో వీడియో పేర్కొంది. గుర్తు తెలియని వస్తువులను విసురుతూ నాలుగు బోట్లను లక్ష్యంగా చేసుకున్నారని బ్రెజిల్‌ కార్యక్త తియాగో అవిల్లా చెప్పారు. ఈ నెల ఆరంభంలో బార్సిలోనా నుండి గ్లోబల్‌ సుముద్‌ ఫ్లోటిల్లా బయలుదేరింది. గాజాకు మానవతా సాయం అందకుండా ఇజ్రాయిల్‌ అమలు చేస్తున్న ఆంక్షల నేపథ్యంలో వారికి అవసరమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ బోట్లు బయలుదేరాయి. ప్రస్తుతం ఈ బృందంలో 51 బోట్లు వున్నాయి. గ్రీక్‌ ద్వీపమైన క్రీట్‌ వద్ద చాలా బోట్లు ప్రస్తుతం వున్నాయి. ట్యునీషియాలో ఇప్పటికే రెండుసార్లు డ్రోన్లు దాడులు జరిగాయి.

సాయం అందనివ్వం
ఆ బోట్లను గాజా చేరనివ్వబోమని, ఆ సాయం వారికి అందనివ్వబోమని ఇజ్రాయిల్‌ పేర్కొంది. జూన్‌, జులై మాసాల్లో సముద్ర మార్గం ద్వారా గాజాకు చేరడానికి జరిగిన ప్రయత్నాలను ఇజ్రాయిల్‌ అడ్డుకుంది. గాజా విషయంలో అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లువస్తున్నా ఇజ్రాయిల్‌ వాటిని బేఖాతరు చేసి తన ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -