నవతెలంగాణ-హైదరాబాద్ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని దండకారణ్యాలు నెత్తురొడుతున్నాయి. ఏడాది కాలంగా ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా ఎన్‌కౌంటర్ల మోత మోగుతూనే ఉంది. తాజాగా సెప్టెంబర్ 20న ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు కట్టా రామచంద్రా రెడ్డితో పాటు కడారి సత్యానారాయణ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్‌కౌంటర్‌పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ సంచలన లేఖను విడుదల చేసింది. కట్టా రామచంద్రా రెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మరణించినట్లు పోలీసులు ప్రకటించిన విషయం ఓ కట్టుకథగా అభివర్ణించారు. ఆ ఇద్దరు నాయకులను ముందుగానే అరెస్టు చేసి విచారించాక ప్రణాళికాబద్ధంగా హత్య చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అనంతరం ఆ హత్యలను బాహ్య ప్రపంచంలో ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆరోపించారు. ఆ బూటకపు ఎన్‌కౌంటర్‌పై వెంటనే స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇటీవలి కాలంలో జరుగుతోన్న వరుస లొంగుబాట్లు, పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు చేస్తున్న ద్రోహం కారణంగా తమ నెట్‌వర్క్ కాస్త బలహీన పడిందని.. అయినా కానీ పుంజకుంటామని లేఖలో ప్రస్తావించారు. తమ స్థావరాలు, కదలికల సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులు, భద్రతా బలగాలకు లీక్ అవుతోందని తెలిపారు. కామ్రేడ్ రాజు దాదా సెప్టెంబర్ 9న రాసిన తన చివరి లేఖలో కొరియర్ వ్యవస్థ బలహీనతలు, పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు చేస్తున్న నష్టంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ క్యాడర్ల మరణాలు, అరెస్టుల వెనుక ఉందని వారేనని లేఖలో స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరింత అత్యంత జాగ్రత్తగా ఉండాలని తమ సహచరులకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ దిశానిర్దేశం చేసింది.